ఇంటి ప్లాన్ పూర్తయ్యింది. ఓ రెండడుగులు వెనక్కి వేసి, దూరం నుంచి దాన్ని చూసుకున్నాడు శేఖర్. అడ్డగీతలూ, నిలువుగీతలూ కలిసి ఓ అందమైన ఇంటి కోసం తుదిరూపాన్ని ఇచ్చాయి. దాని క్లయింట్ మామూలు వాడు కాదు. ఊరి నడిబొడ్డున వెయ్యి గజాల స్థలానికి సొంతదారు. ఆ మాట విన్నప్పుడల్లా శేఖర్ మనసులో లెక్కలు మొదలైపోతాయి. వెయ్యి X అంటూ ఊహించలేనంత సొమ్ము… ఓ నోటిఫికేషన్ లాగా మెదడులోకి దూసుకు వస్తుంది. దాన్ని కాస్త పక్కకి నెట్టి, ఇంజనీరుగా తన బాధ్యతను పూర్తిచేయడం మొదలుపెట్టేవాడు. ఇప్పటికి పదిహేను రోజులుగా ఆ ప్లాన్ కోసం మెదడును వేడెక్కించాడు. తన సంప్రదాయ జ్ఞానం సరిపోదేమో అని ప్రపంచవ్యాప్తంగా ఉన్న రిఫరెన్సుల కోసం గూగుల్ చేశాడు. ఆఖరికి కళ్లు మూసుకున్నా, డిజైన్‌లో ఏదో ఓ అంశం చటుక్కున కనురెప్పల తెరల మీదకు దూసుకు వచ్చేది. పూజగదిని ఇంకాస్త మార్మికంగా మార్చే అవకాశం ఉందా? స్విమ్మింగ్ పూల్ కాస్త పక్కకు ఉండాలా? ఉఫ్… అన్నీ సవాళ్లే. తన మెదడే ఓ గేమ్ షోలాగా మారిపోయిన ఫీలింగ్.
ఈలోగా ఇటు ప్లాన్ వేయించుకుంటున్న యజమాని నుంచి ఫోన్లు. అది తన డ్రీమ్ హౌజ్ అని ఊదరగొడతాడు. తన జీవితం దానితో ముడిపడి ఉందని, అప్పగించిన బాధ్యత ఎంత పదిలమో పదేపదే గుర్తుచేస్తాడు. ఇరవై ఏళ్లుగా తను పడ్డ కష్టానికి ప్రతిఫలం అంటూ తన గతాన్ని రీళ్లు రీళ్లుగా వినిపిస్తాడు. చివరికి… ప్లాన్‌లో తనకు తోచిన రిక్వైర్‌మెంట్స్ ఏకరవు పెడతాడు. వాటి ప్రకారం మళ్లీ మార్పులూ చేర్పులూ! అవన్నీ చేస్తుండగానే ఆఫీసర్ క్యాబిన్‌లోకి వస్తాడు. ‘నువ్వు ఈ ప్లాన్ బాగా హ్యాండిల్ చేయగలవు’ అంటూ పక్కకి వచ్చి నిలబడతాడు. ప్లాన్‌లోకి తొంగిచూస్తూ ‘ఇది ఇంకాస్త డిఫరెంట్ గా చేస్తే బాగుంటుందేమో ప్రయత్నించు’ అని మేనేజ్‌మెంట్ లౌక్యాన్ని ఉపయోగిస్తాడు. అదృష్టవశాత్తు ఆఫీసర్ వారం రోజులుగా రావడం లేదు. దాంతో తుదిమెరుగులు త్వరగానే పూర్తయ్యాయి. ఇవాళ తను రాగానే, ప్లాన్ సబ్‌మిట్ చేసేయవచ్చు…
ఆలోచనలన్నీ పక్కకు పెట్టి మరోసారి తదేకంగా తన ప్లాన్ వంక చూసుకున్నాడు. బాగానే వచ్చింది అన్న తృప్తి కలిగింది. ఇన్ని పరిమితుల మధ్యా… తనను తాను నిరూపించుకున్నాడనే తోచింది. ఒక్క క్షణం అలా కుర్చీలో కూలబడిపోయాడు. తల వెనక్కి వాలింది. అప్పటిదాకా బిగపెట్టుకున్న ఒత్తిడి, విడుదల అయిపోయినట్టు… ఉఫ్ అంటూ సీలింగ్ వంక చూస్తుండిపోయాడు.
అంత కష్టపడినా, ఆ ఇంటి మీద
తన పేరు ఉండదు. దాని గృహప్రవేశానికి పిలుపు రాదు. ఆ ఫంక్షన్లో ఇంటి యజమాని చేతులు బారచాచుతూ,
అతిథులను ఇల్లంతా తిప్పే సమయంలో కూడా… ‘అతను’ ఎలా జాగ్రత్తగా, ఎంత తెలివిగా ప్లాన్
చేయించుకున్నాడో చెబుతాడు. అంతేకానీ శేఖర్ అన్న పేరు చచ్చినా వినిపించదు. అలాంటివన్నీ
గుర్తుకు వచ్చినప్పుడు ఓ చిన్నపాటి బాధ. అది జెలసీ అనీ, తప్పు అనీ… ఆ బాధని అక్కడికక్కడే
తొక్కిపెట్టేస్తాడు. దాంతో బాధ ఇంకాస్త పదును తేలుతుంది. ఉద్యోగధర్మం, ప్రతిఫలాపేక్ష
లాంటి కబుర్లతో దాన్ని చదును చేసే ప్రయత్నం చేస్తాడు. ఊహూ… అయినా ఎందుకో ఆ బాధ అలా
సలుపుతూనే ఉంటుంది. ఈలోగా మరో ప్రాజెక్ట్ వస్తుంది. దానిలో నిమగ్నం అయిపోయాకే… పాత
గాయం మానుతుంది.
*****
‘సార్ రమ్మంటున్నారు’ అన్న పిలుపు వచ్చింది. చటుక్కున లేచి నిలబడ్డాడు. ఆఫీసర్ తన క్యాబిన్లోకి రాకుండా నేరుగా పిలిపించుకుంటున్నాడంటే అర్థం… ప్లాన్ తీసుకుని రమ్మనే! వెంటనే ప్రింట్ ఔట్ తీసుకుని బయల్దేరాడు. లోపలికి అడుగుపెట్టగానే అర్థమైంది… ఇవాళ తనకు గడ్డురోజు అని. ఆఫీసర్ మూడ్ తేడాగా ఉంది. రెండు సందర్భాల్లో ఆయన చాలా చిరాకుగా ఉంటాడు. ఒకటి- సోమవారం. వీకెండ్ ప్రభావమో ఏమో కానీ, ఆ రోజు కదిపితే చాలు భగ్గుమంటాడు. రెండు- తను ప్లాన్ తీసుకుని గదిలోకి అడుగుపెట్టే రోజు. ప్రతిసారీ తన ఇంట్లో పరిస్థితులు వాకబు చేస్తూ, మందుపార్టీల గురించి ఛలోక్తులు విసిరే మనిషి… తన చేతిలో ప్లాన్ చూడగానే ఎండుపుల్లలాగా బిగదీసుకుపోతాడు. హావభావాలేవీ ఉండవు. గొంతు గంభీరంగా మారిపోతుంది. ప్లాన్ చూపిస్తూ ఎంతసేపు వివరణ ఇస్తున్నా… ఊ, ఊ అంటూ పొడి మూలుగులతోనే సరిపెడతాడు.
ఆయన ప్లాన్ వంక చూసే పావుగంట, ఇరవై నిమిషాలు… ప్రపంచంలోనే తనంత అల్సజీవి ఉండడు అనిపిస్తుంది. ఆ అల్పత్వం గురించి ఆయన మౌనంగా లెక్చర్ ఇస్తున్నట్టు తోస్తుంది. ఒకో క్షణం ఉక్కపోతతో, గుండెదడతో గడిచిన తర్వాత… చిట్టచివరికి ఆ ప్లాన్ మీద నిశబ్దంగా తన సంతకం చేసి తన వైపు వేస్తాడు. అంటే ప్లాన్ బాగానే ఉన్నట్టు అర్థం! సంతకం చేయకుండా నిట్టూర్చి వెనక్కి ఇచ్చాడంటే మళ్లీ ప్రయత్నించమన్నట్టు. లోపం చెప్పడు, తన అభిప్రాయం చెప్పడు. ఇక అంతే!
కానీ ఇవాళ అలా కాదని తన నమ్మకం. ప్లాన్‌ను చూడగానే ఆయన కళ్లు మెరవాల్సిందే! ఆ ఫీలింగ్ తనకు కనిపించి తీరుతుంది. తన హోదాల బెట్టును పక్కన పెట్టి… ‘బాగుంది శేఖర్. వెల్‌డన్’ అని అన్నా అనవచ్చు. సంతోషంతో కాసేపు, క్యాబిన్‌లో కూర్చోపెట్టుకుని పిచ్చాపాటీ మాట్లాడవచ్చు. ఏమో ఇంకా తన టైమ్ బాగుంటే… ‘వచ్చే మీటింగ్‌లో నీ ఇంక్రిమెంట్ గురించి మాట్లాడి చూస్తాను’ అన్నా అనవచ్చు. కానీ ప్లాన్ కి నో అని మాత్రం అనడు. ఆ మాత్రం నమ్మకం, తను చేసిన పని మీద ఉంది. ఆ నమ్మకంతో మనసు కాస్త తేలికపడింది.
ఆఫీసర్ క్యాబిన్‌లోకి అడుగుపెట్టి, ప్లాన్ ఆయన చేతిలో పెట్టాడు. దాన్ని టేబుల్ మీద పరుచుకున్న మనిషిలో ఎప్పటిలాగా ఎలాంటి స్పందనా లేదు. ఓ పొగడ్త కోసం తనలో ఆశ చావలేదు. చివరికి ఓ పదినిమిషాల తర్వాత, సంతకం పెట్టకుండానే… ప్లాన్ తనవైపు టేబుల్ మీద గిరాట వేశాడు.
ఒక్కసారిగా ఒళ్లు చల్లబడిపోయింది. కిందపడిపోతానేమో అన్నంతగా నిస్సత్తువ వచ్చేసింది. అంతలోనే లాగిపెట్టిన బాణంలాగా… కోపం ఎగదన్నింది. ‘ఏమన్నా ప్రాబ్లమా సార్!’ ఎర్రబడ్డ మొహంతోనే వినయంగా అడిగాడు. ‘ఇంకొంచెం బెటర్‌గా ప్రయత్నించండి’ అంటూ నిర్లిప్తంగా జవాబు వచ్చింది. ‘బాగానే చేశానండీ. ఏ విషయంలో మార్పులు చేయాలో చెబితే, మారుస్తాను’ పట్టువదలకుండా అడిగాడు. రెండువారాల శ్రమంతా గుర్తుకు వచ్చి ఏడుపు తన్నుకొస్తోంది. పిల్లాడి అనారోగ్యం, ఒక్కసారిగా చుట్టుముట్టిన అప్పులు, భార్యతో గొడవ… వీటన్నింటినీ పంటి బిగువున భరిస్తూ, సాముగారడీ చేసేవాడిలాగా పూర్తిచేసిన పని అది. దానిలో ఒక్క గీతను కూడా మార్చే ఓపిక లేదిక.
‘ఒకసారి చూసుకోండి. ఎలాంటి మార్పులు చేయాలో మీకే అర్థమవుతుంది. మీతో దగ్గరే ఉండి దిద్దించుకునేట్టయితే… నేనే చేసుకోవచ్చు కదా!’ విసురుగా విరుచుకుపడింది జవాబు. తను ఇకమీదట చెప్పే ఒకో మాటకూ… అంతకు పది రెట్లు తీక్షణమైన స్పందన వస్తుందని తెలుసు. అందుకే మారు మాటాడకుండా తన క్యాబిన్‌లోకి వచ్చేశాడు. ఆ రోజుకు ఇక పని చేయకూడదని నిశ్చయించుకున్నాడు. కంపెనీకి తను విధించగలిగే శిక్ష అది ఒక్కటే.
రోజు గడుస్తోంది. పాత మెయిల్స్
చూసుకుంటూ, పాత మిత్రులను వాట్సాప్ లో పలకరిస్తూ కాలక్షేపం చేస్తున్నాడు. పాత గుర్తులతో
కొత్త గాయాన్ని కప్పిపుచ్చే ప్రయత్నమది. కానీ గుండె మండుతూనే ఉంది. రక్తపోటుతో ఊపిరితిత్తులు
బరువెక్కుతున్నాయి. ఛాతీలో సన్నగా నొప్పి! బాధంతా ఫౌంటెన్‌లా చిమ్ముతున్నట్టు… జివ్వుమని
తలనొప్పి.
సాయంత్రం అయిపోయింది. అయినా ఇంటికి వెళ్లాలనిపించడం లేదు. ఆఫీసు వదిలిన పావుగంటలో ఇంటికి చేరకపోతే, ఫోన్లు వస్తాయని తెలుసు. మరికాస్త ఆలస్యం అయితే తగవు తప్పదనీ తెలుసు. ఇవాళ తన బాధ ఆ భయాన్ని కూడా దాటేసింది. అయిదు, ఆరు, ఏడు గంటలైపోయింది. అప్పుడు కనిపించాడు… కారిడార్‌లో కూర్చున్న ఆఫీస్ అసిస్టెంట్- రాజేష్! వాళ్లిద్దరి మధ్యా గుడ్‌మార్నింగ్ చెప్పుకోవడానికి మించి మరో పరిచయం లేదు. ఆఫీసులో చిన్నాచితకా పనుల కోసం అతన్ని ఏర్పాటు చేశారు.
పగలంతా కూర్చున్న అలసటను తీర్చుకునేందుకు… శేఖర్ తన క్యాబిన్‌లోంచి బయటకు వచ్చాడు. అది చూసి ఏమన్నా కావాలా అన్నట్లు లేచి నిలబడ్డాడు రాజేష్. తనను చూసిన వెంటనే అలా లేచి నిలబడటం కాస్త ఇబ్బందిగా తోచింది. అలాగని లేవకపోయినా, ఇబ్బందిగా తోచేదేమో! ఏం అవసరం లేదన్నట్లు అభయహస్తం చూపిస్తూ… ‘ఇంకా బయల్దేరలేదే!’ అంటూ అడిగాడు. ‘మీరున్నారు కద సర్! అందరూ వెళ్లిపోయాక తాళాలు వేసి బయట సెక్యూరిటీకి ఇచ్చి వెళ్లాలి,’ అంటూ మొహమాటంగా సంజాయిషీ వినిపించింది.
‘రోజూ ఆలస్యంగా వెళ్తే, ఇంట్లో విసుక్కోరా!’ నవ్వుతూ అడిగాడు. ఇవాళ ఎందుకో తనతో మాట్లాడాలనిపించింది. ఇంకాస్త రిలీఫ్ కోసం! ‘అలవాటైపోయింది సార్. పెళ్లయిన కొత్తలో తను చాలా భయపడేది. తనని చూసి నాకూ బాధనిపించేది. ఇప్పుడు అలవాటైపోయింది సార్!’ నవ్వుతో బాధను కప్పిపుచ్చుతూ చెప్పాడు రాజేష్. శేఖర్ ఒక్క క్షణం సందిగ్ధంలో పడిపోయాడు. ఆ వ్యక్తిగత విషయం విన్న వెంటనే అక్కడి నుంచి లేచి వెళ్లకపోతే బాగోదు. అలాగని నిశబ్దంగా కూర్చోలేడు. అందుకే ‘ఏం చదువకున్నావేంటి’ అంటూ పరమ సాధారణమైన ప్రశ్న వేశాడు.
‘బీ.టెక్!’ సిగ్గుపడుతూ చెప్పాడు. ఆ మాట విన్నాక ఎదుటి మనిషి కనబొమలు ముడిపడతాయని రాజేష్ కు తెలుసు. అందుకే తన ప్రస్తుత పరిస్థితికి సంజాయిషీ ఇవ్వడం మొదలుపెట్టాడు ‘మాది చాలా నార్మల్ ఫ్యామిలీ సార్. ఇంట్లో పరిస్థితులు అంతంత మాత్రమే. బుద్ధిగా చదువుకుంటేనే బాగుపడతావని నాన్న ఎప్పుడూ చెబుతుండేవాడు. అయినా శ్రద్ధ లేకపోయింది. సినిమాలు, షికార్లు అంటూ తిరిగేవాడిని. ఎమ్‌సెట్‌లో మంచి ర్యాంక్ రాలేదు. ఎలాగొలా బీటెక్ చేయిస్తేనన్నా మంచి ఉద్యోగం వస్తుందేమో అని నాన్న ఆశ. ఉన్న డబ్బులన్నీ పెట్టి మేనేజ్‌మెంట్ కోటాలో సీట్ ఇప్పించాడు. ఎలాగొలా నెట్టుకొద్దాం అనుకున్నా. అదీ ఒంటపట్టలా. కాలేజ్ లెక్చరర్లు కూడా అంతంత మాత్రమే. మొత్తానికి అయిదేళ్లకి అయింది అనిపించా! బయటకు వచ్చేసరికి పరిస్థితులు బాగోలేదు. రికమెండ్ చేసేవాళ్లు ఎవరూ లేరు. బీ.టెక్ తో పాటు వేరే కోర్సులు ఏం చేయలేదు. చూస్తూచూస్తుండగానే ఇంకో రెండేళ్లు గడిచిపోయాయి. అటు ఫ్రెషర్ నీ కాదు, ఇటు అనుభవమూ లేదు. ఏ ఉద్యోగం అయినా చేద్దామని సిద్ధపడ్డాక ఇది దొరికింది. చూస్తూ చూస్తుండగా ఐదేళ్లు గడిచిపోయాయి. ఇక లైఫ్ ఇంతే!’ ఎటో చూస్తూ పూర్తిచేశాడు. తన గతం అంతా ఎందుకలా ధారగా చెప్పుకోవాలనిపించిందో. తను అందరూ అనుకునేంత పనికిమాలినవాడిని కాదని నిరూపించుకోవడానికా! జీవితాంతం వెంటాడే పరాజయాన్ని, పదిమందితో పంచుకుని దాన్ని పలచన చేసుకోవడానికా! ఏదైతేనేం మొత్తానికి చెప్పేశాడు. ఆ తర్వాత ఎందుకో శేఖర్ వంక చూడాలనిపించలేదు.
రాజేష్ అంతలా బేలగా బయటపడిపోతాడని ఊహించలేదు. దాంతో సాంత్వనగా ఓ నాలుగు ముక్కలు చెప్పాల్సిన పరిస్థితి వచ్చింది. ‘నేనూ చాలా కష్టాలే పడ్డానబ్బా. అయినా చదువులో ఎప్పుడూ వెనకబడింది లేదు. సివిల్స్ పరీక్షలు ఒక్క మార్కులో మిస్ అయ్యాను. ఇదిగో… చివరికి ఇక్కడికి వచ్చి పడ్డాను. పేరుకే ఇంజనీర్. ఉండేది మాత్రం ఇరుకు అద్దె ఇల్లు. ఏం చేస్తాం! ఓ మామూలు గుమాస్తాగా స్థిరపడాలని ఎవడు మాత్రం కోరుకుంటాడు. పెద్దయ్యాక నువ్వు ఏమవుతావు అని అడిగితే… ఎవరూ నేను గుమాస్తా అవుతా అని చెప్పడుగా! కానీ జిగ్ సా పజిల్ లాగా, ఎక్కడో ఒకచోట ఇమిడిపోతాం. మొదట్లో పెనుగులాడినా… అక్కడే స్థిరపడిపోతాం.’ అంటూ బడబడా చెప్పేశాడు. తన జీవితం గురించి అంత లోతుగా… అందులో ఓ అపరిచితుడితో చెప్పగలనని అనుకోలేదు. పెనుతుఫానులో ఒకే చెట్టు మీద వాలిన పక్షుల్లా ఉన్నారు వాళ్లు. ఈలోగా సందులు గొందుల వెంబడి తిరుగుతూ చల్లబడిన గాలి… నిదానంగా ఆఫీసులోకి ప్రవేశించింది. గడియారం వంక చూశాడు శేఖర్. ఎనిమిది గంటలయ్యింది. లేచి నిలబడ్డాడు. కానీ ఇంకాస్త దుగ్ధను పంచుకోవాలనిపించింది.
‘మొదట్లో చాలా డిప్రెషన్‌కు లోనయ్యా రాజేష్. ఎక్కడికో ఎగిరి వెళ్లిపోవాలన్న తపన. కానీ రెక్కలు విరిచేసిన ఫీలింగ్. వ్యక్తిత్వ వికాస పుస్తకాలు చదివా, మోడ్రన్ స్వామీజీల ప్రవచనాలు విన్నా… ఆ కాసేపు జీవితం మారిపోతుందన్న నమ్మకం కలిగేది. ఏవో ప్రణాళికలు మెదిలేవి. కానీ మర్నాడు ఆఫీసుకు వచ్చి సిస్టమ్ ముందు కూర్చోగానే, కాడిని తలకెత్తుకున్నట్టే. మళ్లీ అదే బతుకు’ తన క్యాబిన్ వైపు చిన్నగా నడుస్తూ అన్నాడు.
‘అసలు మన సిస్టమ్ లోనే లోపం ఉంది సార్. మన చదువులూ, ఉద్యోగాలూ, ప్రభుత్వాలూ… అన్నీ ఘోరమే!’ పక్కనే నడుస్తూ వత్తాసు పలికాడు రాజేష్. ‘ఏం చేయలేమబ్బా! సిస్టంకి ఎదురు తిరిగావంటే తిండి కూడా దొరకదు. పోనీ… అందరూ కలిసి ఈ సిస్టమ్ మార్చారే అనుకో… ఆ… కొన్నాళ్లకి మళ్లీ లోటుపాట్లు మొదలవుతాయి. ఏ సిస్టంలో అయినా మనిషేగా ఉండేది. అధికారం కోసం వైకుంఠపాళి, హోదాల పొగరు, కర్కశత్వం, అణచివేత… అన్నీ మొదలవుతాయి. కత్తి పేరే మారుతుంది. దాని వాడి తగ్గదు. దాన్ని పట్టుకునేవాడు బలవంతుడు. దాని గాటు తట్టుకునేవాడు బలహీనుడు. అంతే లెక్క! ఇవన్నీ ఆలోచించీ ఆలోచించీ బీపీ పెరిగిపోయిందబ్బా!’ తన కంప్యూటర్ షట్ డౌన్ చేస్తూ నవ్వాడు శేఖర్.
క్యాబిన్‌లో స్విచ్‌లు ఆఫ్ చేసి, ఇద్దరూ బయటకు నడిచారు. ఫ్రంట్ ఆఫీస్ వైపు అడుగులు వేస్తూ స్వగతం చెప్పుకుంటున్నట్టుగా… ‘మనిషిలోనే తేడా ఉంది. ఆకలి, సెక్స్… రెండూ హాయిగా తీరిపోతున్నాయిగా… దాని కోసం ప్రకృతి ఇచ్చిన తెలివినంతా ఇప్పుడు అహంతృప్తి కోసమే వాడుకుంటున్నాడు. నువ్వు బతికుండాలన్న విషయాన్ని గుర్తు చేయడానికి మనకు అహం వచ్చింది. ఇప్పుడు అదే మన జీవితం అయిపోయింది.’ రిసెప్షన్ దగ్గర ఒక్క నిమిషం ఆగాడు. అంత పెద్ద పెద్ద మాటలు వాడినందుకు సంజాయిషీ ఇస్తున్నట్టుగా ‘ఇదంతా తెలిసినా… ఓదార్పు పెద్దగా కలగదబ్బా. ఇదిగో ఇలా ఆఫీసర్ చేతిలో అవమాన పడ్డప్పుడు, ఇంట్లో మాటామాటా పెరిగినప్పుడు… ఇవేవీ బాధను ఆపలేవు. నాకూ అహం ఉందిగా…’ రాజేష్ వంక చూస్తూ అన్నాడు.
‘పోన్లేండి సార్! వాడిని
పట్టించుకోకండి. పని చేతకాదని, పెత్తనం ఇచ్చారు. వాడికేం బాధలున్నాయో. కొడుకుతో సరిపడదని
విన్నాను. అందుకేనేమో సోమవారం సోమవారం ఏడుపుమొహంతో వస్తాడు…’ అంటూ కొట్టిపారేశాడు.
తన ఆఫీసరు కూడా బాధలు పడతాడనే మాట కాస్త ఊరట కలిగించింది. మనసు ఎందుకో తేలికపడింది. బయట గాలి ఇంకా చల్లబడినట్టు తోచింది. ఒక్కసారిగా ఊపిరి పీల్చుకున్నాడు… వెనుక వైపు నుంచి ఆఫీసు వేడి, బయట నుంచి చల్లగాలి… రెండూ ఒక్కసారిగా ఒంటిని చుట్టుముట్టాయి. రాజేష్, తను, ఇన్‌చార్జి, ఆయన కొడుకు, ప్లాన్ వేయించుకున్న ఇంటి ఓనరు… అందరూ వేర్వేరు మెట్ల మీద కూర్చుని బాధపడుతున్నట్లు అనిపించింది. ఇదంతా మెదలబట్టి ‘నిజమేనబ్బా!’ అంటూ ఓ నవ్వు నవ్వాడు.
ఆఫీసు బయట అడుగుపెట్టేసరికి, చెట్ల చుట్టూ ఉన్న చల్లదనానికి ఒక్కసారిగా ఒళ్లు జలదరించింది. రాజేష్ కూడా బయటకు వచ్చి షట్టర్ క్లోజ్ చేసే పనిలో పడ్డాడు. ‘ఇవాళ శనివారం కదా! ఇంటికేనా లేకపోతే ఓ రౌండ్ అలా మందేసి వెళ్తావా!’ అంటూ కొత్తగా వచ్చిన చనువుతో అడిగాడు శేఖర్.
‘అబ్బే. ఎప్పుడో మానేశా సార్! తాగి ఉపయోగం ఏముంది, డబ్బులు దండగ! తాగుడులో పడితే పెగ్గుల లెక్క తెలియదు. దాంతో మర్నాడు హ్యాంగోవర్. ఇంట్లో చికాకులు. అందుకే మానేశా సార్. ఎప్పుడన్నా మరీ అకేషన్ ఉంటే తప్ప!’ తాళాల గుత్తి వాచ్‌మెన్‌కి ఇస్తూ చెప్పాడు. ‘ఎప్పుడన్నా ఓ రోజు, బాగా బాధనిపిస్తే. దాన్ని మర్చిపోవాలనుకుంటే, అప్పుడు కూడా తాగవా!’ అడిగాడు శేఖర్. తను చేసే పని అదేగా మరి!
రాజేష్ ఒక్క నిమిషం ఆగాడు. వాళ్ల మాటలు ఎవరన్నా వింటున్నారేమో అన్నట్లు అటూఇటూ చూశాడు. ఆ తర్వాత కొంచెం సిగ్గుపడుతూ… ‘మీరు అర్థం చేసుకుంటారన్న నమ్మకంతో చెబుతున్నా సార్! ఇంతవరకూ ఈ రహస్యం నా భార్యతో కూడా పంచుకోలేదు’ అంటూ తలవంచుకున్నాడు.
రాజేష్ ఏం చెప్పబోతున్నాడా అని ఆశ్చర్యం వేసింది. ఈ మలుపును తను ఊహించలేదు. అందుకే తన వంక చూస్తుండిపోయాడు. ఇదేమీ ఎరుగని గాలి, పసిపాపలా మారి… కాళ్ల చుట్టూ తిరుగుతోంది.
‘ఎప్పుడన్నా తట్టుకోలేని బాధ కలిగిందనుకోండి. దాన్ని రాత్రి దాకా బిగపెట్టుకుంటాను. అందరూ పడుకుంటారు కదా! అప్పుడు నా మూడేళ్ల కూతురు చేతిలో తల పెట్టుకుని వెక్కి వెక్కి ఏడుస్తాను. గుండె బరువంతా తీరిపోయేదాకా కొంచెంకొంచెంగా ఏడుస్తా. అందరూ గాఢనిద్రలో ఉంటారు. ఎవరూ లేచి ఎందుకు ఏడుస్తున్నావ్ అని కంగారుపడరు. సార్.. నా చిన్ని తల్లి మొహంలో అమాయకత్వం చూస్తూ ఏడుస్తుంటే… నా దుఃఖం అంతా కరిగిపోతున్నట్లు అనిపిస్తుంది. తన ఆదమరపు శ్వాస ముందు… నా బాధ్యతలు కష్టాలు తేలికపడతాయి. దాని లేత చేతుల్లో నా తలపెట్టుకున్నప్పుడు, అదే అభయహస్తంలా తోస్తుంది. ఫర్వాలేదు ఇంకొన్నాళ్లు బతకవచ్చు అనే భరోసా వస్తుంది. కాసేపటికి నా కన్నీరు ఆగిపోతుంది. దాన్ని వదిలించుకున్న మనసు తేలికపడుతుంది. ఇక నిద్రలోకి జారుకుంటాను. మర్నాడు లేవగానే నా కుటుంబాన్ని చూసేసరికి చాలా సంతోషంగా ఉంటుంది,’ అప్రయత్నంగా వచ్చిన కన్నీళ్లని అదిమిపెడుతూ చెప్పాడు రాజేష్. అదంతా వింటున్న శేఖర్ కళ్లు కూడా చెమ్మగిల్లాయి. రాజేష్ భుజం మీద చేయి వేసి తట్టాడు. ‘సోమవారం కలుద్దాం’ అని చెప్పి తన బండి వైపు బయల్దేరాడు.
బండి స్టార్ట్ చేసి ముందుకు
దూకించగానే రయ్యిమని గాలి ఎదురొచ్చింది. ఎందుకో ఇంటి దగ్గర ఉన్న తన ఆరేళ్ల పాప గుర్తుకొచ్చింది.
అది పడుకున్నప్పుడు, దాని మొహంలో తోచే ప్రశాంతత కనిపించింది. దాని లేత చేతుల స్పర్శ
అనుభవంలోకి వచ్చింది. దారిలో ఉన్న బార్‌ను దాటి, ఇంటి వైపు బండి పోనిచ్చాడు.
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి