28, డిసెంబర్ 2011, బుధవారం

"ఎవరు నువ్వు"

      "ఎవరు నువ్వు" అని అతడడిగిన ప్రశ్నని నాకు నేనే వేసుకున్నాను 'ఎవరునేను ?', 
ఒకప్పుడు నాకంటూ ఒక గుర్తింపు ఉండేది, ఫలానా వాళ్ళ అబ్బాయి అనో, ఫలానా
వీధిలో వుంటాడనో, ఫలానా కులస్తుడనో.. ఏదో ఒకదానితో నా గుర్తింపుని
జోడించుకునేవాడిని.
     కానీ ఇప్పుడు నాకంటూ ఒక గుర్తింపుతో పరిచయం కావలసినప్పుడు
ఏమని చెప్పేది ! ఆ... నేనొక రచయితనని చెప్పేదా ! 'నేనెప్పుడూ నీ పేరు వినలేదే'
అనేస్తాడు. మరేమని చెప్పేది --

'నువ్వు నీ చిన్న కుటుంబంతో పాటుగా పార్కులో నవ్వుతూ నడుచుకుంటూ వెళ్తున్నప్పుడు ఓ 
బెంచిపై కూర్చుని నీ వంక ఈర్ష్యగా చూసే బికారిని నేనని చెప్పనా!', 

'నీకిష్టమైన పదార్ధాలని ఆర్డర్ చేసి వాటిని నీస్నేహితులతో ఆస్వాదిస్తున్నప్పుడు రోడ్డుకవతల
నిల్చొని ఖాళీ కడుపుని తడుముకునే బిచ్చగాడినని చెప్పనా!...

నీలాగే నాకూ ఆశలున్నాయి, నీలాగే నాకూ జీవితముండేది..
కానీ ఆశలు ఆచరణలోకి రాలేదు, జీవితం మటుకు ముందుకు సాగిపోయింది. 
అందుకే నువ్వలా, నేనిలా !

        వ్యాపారంలో దివాళా తీయడం వేరు, జీవితంలో దివాళా తీయడం వేరు, ఎందుకంటే
డబ్బులు చేజారితే గంజి తాగి బ్రతకవచ్చు, కానీ ఆశలు చేజారితే అనామకుడిగా బ్రతకడం
కష్టం. కదులుతున్న రైలుని చూసి కౌగిలించుకోవాలనిపిస్తుంది, ప్రతి తాడూ ఉరితాడై
పలకరిస్తుంది.. కొందరు దీనిని suicide tendency  అంటారు, మరికొందరు నెరవేరని
కాంక్షల తీవ్రత అంటారు. ఎవరేమన్నా ఏదో మొండిపట్టుదల తాగుబోతులా తూలుతూ
నడిపిస్తుంటుంది.  నాకు తెలుసు ప్రస్తుతం నేను అనామకుడినని! పత్రికలలో తరచుగా
కనిపించే 'స్థానికులు అనుకుంటున్నారు', 'పలువురి అభిప్రాయం', 'గుర్తు తెలియని
వ్యక్తి మృతి' ...లాంటి వార్తల్లో ఉండేది నేనే.  త్వరలోనే ఈ stage
గడిచిపోతుందని ఇంతకుముందు అనుకునేవాడిని, కానీ అంతకంటే త్వరగా జీవితం
గడిచిపోయింది. సో! ఇకపై ఆ ఆశ కూడా లేదు ఎందుకంటే ఆశలన్నీ భగ్నమవుతాయన్న
పరిపక్వత ఇప్పుడు నాకు వచ్చేసింది.

        ఇంతకుముందు అనుకునేవాడిని, నలుగురూ నాగురించి ఏమనుకుంటున్నారో అని,
కొత్త బట్టలు వేసుకేల్తే నలుగురూ మెచ్చుకోవాలని, శత్రువులు ఈర్ష్యపడాలని, నా
మంచితనం పదిమందీ గుర్తించాలనీ, నన్ను పొగిడిన మాటలు పదిమందీ వినాలనీ, నేను
జబ్బుపడితే అందరూ పరామర్శించాలనీ.. ఏమిటో  నా పిచ్చితనం ! అప్పట్లో 'సూర్యా
మంచివాడన్నాడు' ఒకడు ' కాదు ఒట్టి పనికిమాలినవాడన్నాడు' ఇంకొకడు.
అన్నవాళ్ళందరూ కాలబర్భంలో కలిసిపోయారు - నేనిలా వర్తమానంలో వెర్రిమొహంతో!
పొగిడినవాడి మంచిమాటలు నాకు మేలు చేయలేదు, తెగిడినవాడి ద్వేషం నన్ను నాశనం
చేయలేదు, ఎందుకంటే - నా మేలూ నా వినాశనం నా చేతల్లోనే ఉండిపోయాయి కనుక !

30, నవంబర్ 2011, బుధవారం

28, అక్టోబర్ 2011, శుక్రవారం

నా ఆరవ కథ - " మనవాడు "

 అక్టోబర్ రెండు 2011న సాక్షి ఫండేలో ప్రచురింపబడిన నా  " మనవాడు " కథ ఇది:

‘‘ఈ రోజుల్లో హాస్పిటల్ పెట్టటం కూడా పెద్ద వ్యాపారమైపోయింది’’
మా పక్కింటి రావుగారు అన్నారు.
‘‘అబ్బే మా శివ మటుకు అలాంటివాడు కాదండీ’’ అంటూ నేను ముసిముసిగా నవ్వుతూ, చేతులు అడ్డంగా ఊపాను.

శివ అంటే ఎవరో కాదు, డాక్టర్ శివశంకర్ అనే పెద్ద కార్డియాలజిస్టు. మొన్నటి వరకూ ఢిల్లీలోని ఎయిమ్స్‌లో పనిచేసి, ఈ మధ్యనే మా ఊరికి వచ్చి, ఓ నర్సింగ్ హోమ్‌ని ప్రారంభించే పనిలో ఉన్నాడు.
నిజానికి అది నాకు సంబంధం లేని విషయం. కానీ ఎప్పుడైతే స్థానిక పత్రికలో శివశంకర్ ఈ ఊళ్లోనే జాన్సన్ అండ్ జాన్సన్ స్కూల్లో ఓ పదేళ్లు చదివాడని తెలియగానే, నాలో ఓ చిన్న అనుమానం మొదలైంది - అతను నాతో పాటుగా చదివిన వాళ్లలో ఉన్నాడేమోనని! ఎందుకంటే మా క్లాసులో శివశంకర్ అనే కుర్రవాడు ఉన్నట్టు నాకు లీలగా గుర్తు.

ఆ తర్వాత ఓ ఇద్దరు ముగ్గురు బాల్యమిత్రులని వాకబు చేసిన తర్వాత, అతనే ఇతనని రూఢి అయ్యింది. మొదట ఈ విషయాన్ని నమ్మబుద్ధి కాలేదు. ఎందుకంటే నాకు గుర్తున్నంతవరకూ శివశంకర్ ఓ ఏవరేజ్ స్టూడెంట్. ఆటల్లోనూ, అల్లరిలోనూ, అ ఆల్లోనూ మొదటుండే నేను, శివశంకర్ లాంటి ఏవరేజ్ విద్యార్థులని పెద్దగా పట్టించుకునేవాడిని కాదు.

పదో తరగతి తర్వాత శివశంకర్ ఏమైపోయాడో కూడా నేను పట్టించుకోలేదు. పై చదువుల కోసం హైదరాబాదుకి వెళ్లి, అక్కడే ఉంటున్నాడని మటుకు విన్నాను. ఆ తర్వాత మా స్నేహితుల మధ్య, అతని ప్రసక్తి కూడా రాలేదు. ఏళ్లు గడిచేకొద్దీ ఎవరికి వాళ్లం మా స్నేహితులమంతా మధ్యతరగతి జీవితాల్లో స్థిరపడ్డాం. ఇప్పుడు శివశంకర్ అన్న పేరు కూడా మా స్కూలు ఫొటోలతో పాటు మసకబారిపోయింది.

కానీ హఠాత్తుగా ఎప్పుడైతే మాతో పాటు చదివిన వ్యక్తి పెద్ద కార్డియాలజిస్టుగా పేరు సంపాదించి ఈ ఊళ్లోనే ప్రాక్టీసు ప్రారంభించబోతున్నాడని తెలిసిందో, మసగ్గా సాగిపోతున్న నా జీవనయానంలో ఏదో వెలుగు కనిపించినంత ఉద్రేకం కలిగింది. నా చుట్టాల్లో గానీ పరిచయస్తుల్లోగానీ ప్రముఖులంటూ ఎవరూ లేరు. పోనీ నా గురించి చెప్పుకోవడానికి ఏమన్నా ఉందా అంటే అదీ లేదు. కానీ ఇప్పుడు గర్వంగా చెప్పుకోగలను... డాక్టర్ శివశంకర్ నా బాల్యమిత్రుడని! ఈ దెబ్బతో ఒకప్పటి ‘శివగాడు’ ఇప్పుడు ‘మా శివ’ అయిపోయాడు.

గతంలోకి జారిపోయిన అతని జ్ఞాపకాలని తవ్వి తీసి, అందులో శివతో గడిపిన అతి కొద్ది సందర్భాలని దుమ్ము దులిపి, అందరి ముందూ అందంగా ప్రెజెంట్ చేయసాగాను. ఎవరితో ఏ సంభాషణ మొదలైనా అటు తిప్పీ ఇటు తిప్పీ మాటల మధ్యలోకి ‘మా శివ’ని తీసుకు రాసాగాను. నా అహం తృప్తికోసం శివశంకర్ అనే గొప్ప ఆయుధం ఇప్పుడు నాకు దొరికింది.

‘‘ఏమిటి గిరీశంగారూ! మొన్న ఆడిట్‌వాళ్లు ఆఫీసుకి వస్తారని తెలిసి కూడా, మీరు చెప్పాపెట్టకుండా సెలవు పెట్టారు. ఎంత ఇబ్బందిపడ్డామో తెలుసా?’’ అంటూ ఆఫీసరుగారు అందరి ముందూ అరుస్తున్నారు. నాకేం చెయ్యాలో తోచలేదు, అనుకోకుండా ఇంట్లోకి చుట్టాలు వచ్చిపడ్డారు. వాళ్లకోసమని సెలవు పెట్టక తప్పలేదు. ఆడిట్ ఉంది కాబట్టి మా ఆఫీసరు నాకు సెలవు మంజూరు చెయ్యడని తెలుసు. అందుకనే చెప్పాపెట్టకుండా మానేశాను. మధ్యలో ఆదివారం వచ్చింది కాబట్టి, ఈ విషయం చల్లబడిపోతుందనుకున్నాను. కానీ ఇలా మరింతగా రగులుకుంటుందనుకోలేదు. ఇప్పుడేదో ఒక అద్భుతమైన కారణం చెప్పకపోతే, అందరిముందూ నా పరువు పోవడం ఖాయం.

‘‘సారీ సార్! మా శివ తన నర్సింగ్‌హోమ్ ప్రారంభోత్సవానికి పిలవడం కోసమని ఎమ్.ఎల్.ఎ.గారి దగ్గరికి తీసుకువెళ్లమని బలవంతపెడితే వెళ్లక తప్పింది కాదు. అక్కడ ఆలస్యమైపోయింది’’ అంటూ అప్పటికప్పుడు ఓ కథల్లేశాను.
శివశంకర్, ఎమ్.ఎల్.ఎ.ల పేర్లు వినేసరికి ఆఫీసరుగారి మొహం ప్రసన్నమైపోయింది. ‘‘సర్లేవోయ్, ఎలాగోలా మేనేజ్ చేశాంలే. ఈసారి మటుకు అలాంటి అనుకోని పని ఏదన్నా వస్తే కాస్త ఫోన్ చేసన్నా చెప్పు’’ అంటూ తన చాంబర్‌లోకి వెళ్లిపోయాడు.

నిజానికి ఎమ్.ఎల్.ఎ.గారు హాస్పిటల్ ప్రారంభోత్సవానికి వస్తున్నారని పేపర్లో ప్రకటన చూసి ఉన్నాను గానీ, నేనింతవరకూ శివని కలవనేలేదు. ఒకవేళ కలిసినా, కలిసి తాము చిన్నప్పుడు ఒకే స్కూల్లో చదువుకున్న విషయం గుర్తుచేసినా, అతను గుర్తుపడతాడన్న నమ్మకం కూడా లేదు. అయినా సాలిపురుగు దారం లాంటి నాజూకైన బంధాన్ని, చేంతాడంత దృఢంగా జనానికి చూపించేశాను- తప్పదు! నాకంటూ ఎటువంటి గుర్తింపూ లేని ఈ జీవితంలో, ఓ ఆసరా కనిపించింది. అయినా నేనేమీ అబద్ధం చెప్పట్లేదు కదా. నాతో శివశంకర్ కలిసి చదువుకున్నాడన్న అర్ధసత్యాన్ని కాసింత ఆర్భాటంగా ప్రదర్శిస్తున్నాను. అంతే!

ఆ మర్నాడు ఎవరూ పిలవకపోయినా, ‘శివశంకర్ నర్సింగ్ హోమ్’ ప్రారంభోత్సవానికి బొకేతో సహా హాజరైపోయాను. శివశంకర్‌కి నన్ను నేను పరిచయం చేసుకోవడానికి ప్రయత్నించాను గాని, అక్కడ నాబోటివాళ్లు చాలామంది ఉండటం వలన కుదరనే లేదు. అయినా ఆ వారం రోజులూ నర్సింగ్ హోమ్ ప్రారంభోత్సవం గురించి ఇంట్లోనూ ఆఫీసులోనూ తెగ ఊదరగొట్టేశాను.

‘‘అప్పటికీ చెబుతూనే ఉన్నానండీ! ఇంత చిన్న ఫంక్షన్‌కి ఎమ్.ఎల్.ఎ.గారిని పిలిస్తే ఆయనతో పాటు వచ్చే కార్యకర్తలని కంట్రోల్ చేయడం కష్టమని. వింటేనా? ఆ వచ్చినవాళ్లని కంట్రోల్ చేసేసరికి తల ప్రాణం తోకలోకి వచ్చిందనుకోండి’’ అంటూ ఆఫీసరుగారి ముందు వదరుతుంటే, ఆయన మొహం నాపై ఆరాధనతో వెలిగిపోయింది. నాక్కావల్సిందదే!

అందరూ ఊహించినట్లుగానే అనతికాలంలో శివశంకర్ నర్సింగ్ హోమ్‌కి జనం తండోపతండాలుగా రాసాగారు. ఆయన ప్రతిష్ట పెరుగుతున్నకొద్దీ నేను ఆయన గురించి చెప్పే కబుర్లు కూడా పెరగసాగాయి. ‘‘చిన్నప్పుడు బాగా అల్లరి చేసేవాడమ్మా మా శివ. తనిలా గొప్ప డాక్టర్ అవుతాడని నేను ఊహించనేలేదు. నువ్వు కూడా తనలాగా పెద్ద డాక్టరవ్వాలి. సరేనా?’’ అంటూ పక్కింటి చింటూగాడిని కూర్చోపెట్టి చెబుతుంటే, ఆఫీసర్‌గారి దగ్గర నుండి ఫోన్ వచ్చింది.
‘‘గిరీశం! నిన్న మా మావయ్యగారికి గుండెల్లో నొప్పిగా ఉందంటేనూ శివశంకర్‌గారి దగ్గర అడ్మిట్ చేశాం. ఏవో రొటీన్ చెకప్‌లు చేసి, పెద్దగా కంగారు పడాల్సింది ఏమీలేదు, రేపు డిశ్చార్జ్ చేస్తామని చెప్పారు. కాస్త ఏమనుకోకుండా శివశంకర్‌గారితో మాట్లాడి, హాస్పిటల్ బిల్లులో ఏమన్నా రాయితీ ఇవ్వడానికి కుదురుతుందేమో చూడరాదూ’’ అంటూ.

ఆఫీసరుగారి మాటలు విన్న నాకు, ఒళ్లు చల్లబడిపోయింది. అదే వేరేవాళ్లయితే ఏదో ఒకటి చెప్పి మేనేజ్ చేసేసేవాడిని కానీ, అవతల మా ఆఫీసరుగారయ్యే! ‘‘అయ్యో ఎంత మాట. తప్పకుండా నేను మా శివతో మాట్లాడతాను సార్’’ అని ఫోనైతే పెట్టేశాను గానీ ఇప్పుడెలా? ఏదైతే అదైంది, ఒకసారి శివశంకర్‌ని కలవక తప్పదనిపించింది. ఏమో! నా అదృష్టం బాగుండి, అతను నన్ను గుర్తుపడితే మంచిదే కదా. అతనితో సంబంధాన్ని పెంచుకుని, ఇప్పటిదాకా చెబుతున్న అతిశయోక్తులను నిజం చేయవచ్చు.

ఆ మర్నాడు ఉదయం శివశంకర్‌గారి నర్సింగ్ హోమ్‌కి చేరుకుని, ఆయన గది బయట నిల్చున్న అటెండర్‌తో, ‘‘నేను డాక్టర్‌గారి బాల్య స్నేహితుడిని. నా పేరు గిరీశం. ఆయన్ని కలవడానికి వచ్చానని చెప్పు’’ అని గదమాయించాను. దానికతను నా వంక నిర్వికారంగా చూస్తూ, ‘‘లోపల పేషెంట్లని చూస్తున్నారు. కాసేపు ఆగండి’’ అని చెప్పాడు. అదే సమాధానాన్ని దాదాపు రెండు గంటల పాటు చెప్పిన తర్వాత గానీ లోపలికి పంపలేదు. ‘బయటకి రానీ నీ సంగతి చెబుతాను’ అన్నట్లు కోపంగా ఆ అటెండర్ వంక చూసి, ఆతృతగా తలుపు తోసుకుని లోపలికి అడుగుపెట్టాను.

ఓ అడుగు ఆ గదిలోకి వేయగానే చల్లటి ఏసీ స్పర్శ, నాది కాని స్థాయిలోకి అడుగుపెడుతున్నానని నాకు గుర్తుచేసింది. ఎదురుగుండా ఖరీదైన లెదర్ కుర్చీలో కూర్చున్న వ్యక్తే శివశంకర్ అని నాకు నమ్మబుద్ధి కాలేదు. నీలం రంగు నిక్కరు, పొట్టి చేతుల చొక్కాతో లీలామాత్రంగా నాకు గుర్తున్న పిల్లవాడు, అకస్మాత్తుగా డిజైనర్ దుస్తుల్లో కనబడేసరికి, మనసుకి అయోమయంగా తోచింది.
అద్దాల బీరువాల్లో అందంగా పేర్చిన బౌండు పుస్తకాలూ, డిజిటల్ మానిటర్లూ, విదేశాల్లో దిగిన ఫొటోలూ, షీల్డులూ, సన్మాన పత్రాలూ... గదిలో ఎటువైపుకి చూపు తిప్పినా, దాని యజమాని ఓ అసాధారణ వ్యక్తన్న విషయం స్ఫురణకి తెచ్చేలా ఉందా వాతావరణం.

‘విషయమేమిటో తొందరగా చెప్పండి. అవతల నాకు బోల్డు పనుంది’ అన్నట్టు అసహనంగా చూస్తున్న ఆయనకి అసంకల్పితంగా విష్ చేస్తూ, ఆయనకి ఎదురుగా ఉన్న కుర్చీలో కూర్చున్నాను. ఇక విషయం చెప్పక తప్పదు కదా అన్న తెగింపుతో, ‘‘నా పేరు గిరీశం. మీకు గుర్తుందో లేదో కానీ మనం జాన్సన్ అండ్ జాన్సన్ స్కూల్లో కలిసి పదేళ్లు చదువుకున్నాం’’ అని చెబుతూ, ఆయనలో ఏమన్నా కుతూహలం వ్యక్తమవుతుందా అని, ఆయన మొహాన్ని పరిశీలనగా చూశాను గానీ, ‘ఐతే, ఇప్పుడేంటట’ అన్నట్లుగా ఉంది ఆయన భావం.

‘‘టెన్త్ అయిపోయిన తర్వాత, మీరు హైదరాబాదు వెళ్లిపోయారని తెలిసింది. నేను మటుకు ఇక్కడే డిగ్రీ పూర్తి చేసి, ఓ ట్రాన్స్‌పోర్ట్ కంపెనీలో అకౌంటెంట్‌గా పనిచేస్తున్నాను. పెళ్లయి ఇద్దరు పిల్లలు ఉన్నారు’’ అంటూ సంభాషణని మరికాస్త పొడిగించడానికి ప్రయత్నించాను. వీలైనన్ని వ్యక్తిగత విషయాలు మాట్లాడితే చనువు పెరుగుతుందేమోనని నా ఆశ!

‘‘మంచిది, ఏదన్నా పనిమీద వచ్చారా?’’ గురుడు లైన్లో పడ్డట్టే అనిపించింది.
‘‘మరేం లేదు. మా ఆఫీసరుగారి మావయ్యగారిని మన హాస్పిటల్‌లోనే అడ్మిట్ చేశాం. ఆయన బిల్లులో ఏమన్నా కాస్త రాయితీ కల్పించడానికి అవకాశం ఉంటుందేమో రిక్వెస్ట్ చేద్దామని వచ్చాను’’- హమ్మయ్య, చెప్పాలనుకున్నది చెప్పేశాను. ఇక ఆయనెలా ప్రతిస్పందిస్తాడో!

ఆయన ఒక నిమిషం నా వంక సావకాశంగా చూశాడు. గురుడు సావధానంగా ఆలోచిస్తున్నాడంటే, తప్పకుండా సానుకూలంగా స్పందిస్తాడు. ‘గిరీశం! నీ పంట పండింది ఫో. ఈ దెబ్బతో ఆఫీసులో నీ పరపతి అమాంతం ఎదిగిపోతుంది’ అని సంబరపడిపోతుండగా ఆయన తన నిర్ణయాన్ని చెప్పడానికి ఉద్యుక్తుడవడంతో ఆయన చెప్పబోతున్నది ముందే తెల్సినవాడిలా చిరునవ్వులు చిందించాను.

‘‘సారీ గిరీశంగారూ! నేను నిజానికి చాలా రీజనబుల్‌గా చార్జ్ చేస్తాను. ఒకవేళ అవతలి మనిషి అది కూడా కట్టలేని పరిస్థితిలో ఉంటే, రాయితీ ఏం ఖర్మ, పూర్తిగా మాఫీ చేయటానికి కూడా నేను సిద్ధమే. కానీ ఓ పక్క ఆఫీసరుగారంటున్నారు. పైగా బిల్లు అమౌంటు కూడా ఏమంత పెద్ద మొత్తం కాదు. కనుక ఎలాంటి రాయితీ ఇవ్వడం కుదరదు’’ అంటూ డాక్టర్‌గారు చెప్పడం పూర్తి చేసేసరికి, పాలపొంగులా చప్పున చల్లారిపోయాను.

డాక్టరుగారి మాటలు వినేసరికి ఒక్కసారిగా నిస్సత్తువ ఆవహించింది. ఎన్నో రోజులుగా ఊహించుకుంటున్న కల ఒక్కసారిగా భగ్నమైపోయినట్లనిపించింది. నా ఓటమిలోంచి రోషం పొడుచుకొచ్చింది. పదేళ్ల పాటు కలిసి చదువుకున్నామన్న మానవత్వం కూడా లేకుండా మాట్లాడతాడా ఈ మనిషి? కాలం తనని కనికరించిందని ఎంత అహంభావం ఇతనికి! ఓ నాలుగు మాటలు దులిపేసి గానీ వీడిని వదిలిపెట్టకూడదనుకుంటూ ఎర్రబడ్డ మొహంతో అతనిని దెప్పిపొడవడానికి సిద్ధపడ్డాను.

సామాన్యంగా ఇలాంటప్పుడు మనం ఓ నాలుగు మాటలు వదలడానికి కష్టపడనక్కర్లేదు. ఎదుటి మనిషిని పొగడటానికైనా, అలా పొగిడిన మనిషినే ఓ రెండ్రోజుల తర్వాత పొడవడానికైనా మన దగ్గర మాటల మూటలెప్పుడూ సిద్ధంగా ఉంటాయి కదా!
‘‘డబ్బులు శాశ్వతం కాదండీ! మనిషికి మానవత్వం ఉండాలి. ఇవాళ కాస్త మంచి పొజిషన్‌కి రాగానే, మీరు మీ గతాన్ని మర్చిపోవడం భావ్యం కాదు. ఏదో బాల్య స్నేహితులన్న చనువుతో మీ దగ్గరికి వచ్చాను గానీ, మీరిలాంటి వాళ్లని తెలిస్తే అసలిక్కడ అడుగుపెట్టేవాడిని కాదు’’ అని నేనింకా ఏదో రొటీను డైలాగులు వదలబోతుండగా ఆయన సన్నగా నవ్వడం చూసి ఆగిపోయాను.

నేనంత శ్రద్ధగా తిడుతుంటే అవతలి మనిషి మొహమైనా మాడ్చుకోవాలి, లేకపోతే తనూ తిరిగి ఓ నాలుగు మాటలనాలి గానీ, ఇతనేంటి ఇలా సిగ్గులేకుండా నవ్వుతాడు అని నివ్వెరబోతుండగా మొదలుపెట్టాడయ్యా.
‘‘డబ్బులు శాశ్వతం కాదని మీరనుకున్నప్పుడు ఇంత చిన్న బిల్లు మీద రాయితీ కోసం నా దగ్గరికి ఎందుకొచ్చారు?’’ చెట్టు కొమ్మల మధ్య కొమ్ములు ఇరుక్కుపోయిన జింకని, సింహం తాపీగా చూసినట్టు చూస్తూ అడిగాడాయన.

‘‘ఎందుకేమిటి? మీరు నా బాల్య స్నేహితులు గనుక!’’ అన్నాను పౌరుషంగా.
‘‘బాల్య స్నేహితులా?’’ అన్నాడు ఆయన విరక్తిగా. ‘‘చిన్నప్పుడు మనం ఒకే స్కూల్లో చదువుకున్న విషయం నాకు మహా భేషుగ్గా గుర్తుంది. అంతేకాదు అప్పటి విషయాలన్నీ నాకింకా స్పష్టంగా గుర్తున్నాయి’’ నాలో మొదలైన ఇబ్బందిని స్పష్టంగా గమనిస్తున్నవాడిలా ఆయన చిరునవ్వుతో తన సంభాషణని కొనసాగించాడు.

‘‘అప్పట్లో మీరొక నాయకుడు. మీకంటూ ప్రత్యేకంగా ఓ బృందం ఉండేది. ఆ బృందంలో స్థానం సంపాదించాలంటే చదువులోనో, ఆటల్లోనో, కనీసం అల్లరిలోనైనా చురుకైనవాడై ఉండాలి. నేనంత చురుకైనవాడిని కాదు కనుక, మీరు నన్నో పురుగుని చూసినట్లు చూసేవారు. నన్ను అవహేళన చేసీ మీరు రాక్షసానందాన్ని పొందేవారు. ఒక రోజైతే మీలో ఎవరో నా షూస్‌లో కాళ్ల జెర్రిని పెట్టారు. అది నన్ను కుట్టిన నెప్పితో నేను విలవిల్లాడుతుంటే మీరు చాటున నిలబడి ముసిముసి నవ్వులు నవ్వుకున్నారు’’ ఆ నెప్పి మళ్లీ గుర్తుకొచ్చినవాడిలా బాధపడుతూ తన మాటలని కొనసాగించారు.

‘‘అదృష్టవశాత్తూ నేను హైదరాబాదుకి వెళ్లిన కొత్తలో కొంతమంది మంచి స్నేహితులు పరిచయమయ్యారు. వాళ్లు నాలో చదువు పట్ల ఆసక్తిని పెంచారు. ఒక్కో పరీక్షలో మంచి మార్కులు వస్తున్నకొద్దీ నాపై నాకు నమ్మకమూ, ఏవరేజ్‌గా మిగిలిపోకుండా ఏదో సాధించాలన్న పట్టుదలా పెరిగాయి. వాటితోనే నేను ఈ స్థాయికి చేరుకున్నాను. నెలనెలా లక్షల కొద్దీ సంపాదన వచ్చే అవకాశాలు కాదనుకుని, మధ్యతరగతి జనానికి ఖరీదైన వైద్యం అందుబాటులో ఉండటం కోసమని, ఈ చిన్న పట్నంలో నర్సింగ్ హోమ్‌ని ప్రారంభించాను. ఇప్పుడు చెప్పండి. ఎవరిది స్వార్థం? ఒకవేళ ఈ రోజున నేనీ హాస్పిటల్‌లో డాక్టరుగా కాక, ఓ సాధారణ కాంపౌండర్‌గా ఉండి ఉంటే మీరు నన్ను కలిసేవారా? కలిసినా ఇంత అభిమానం ఒలికించేవారా?’’

ఆయన అన్నదానిలో నిజం లేకపోలేదని నాకు తెలుసు. ఎందుకంటే ఆ మాటలన్నీ సూటిగా నా విచక్షణని తాకుతున్నాయి కాబట్టి. కానీ అహం అడ్డుగా ఉన్నప్పుడు తనది తప్పని ఒప్పుకునేదెవరు! అందుకనే నేను నా ప్రవర్తనని సమర్థించుకోవడానికి తొందరపడ్డాను. ‘‘మీరు అనుకుంటున్నట్లు నేను మనుషుల్ని వాళ్ల స్థాయిని బట్టి కాక వాళ్ల వ్యక్తిత్వాన్ని బట్టి గౌరవిస్తాను. ఒకవేళ మిమ్మల్ని ఈ హాస్పిటల్‌లో కాంపౌండర్‌గా చూసినా ఇదే స్థాయిలో అభిమానించేవాడిని.’’

‘‘అయితే విను’’ కరుకుగా అడ్డుపడింది ఆయన స్వరం. ‘‘నువ్విందాక దాటుకువచ్చిన అటెండర్ ఒకప్పుడు మనతో కలిసి చదివిన రవీంద్రే. అల్లరి చిల్లరిగా తిరుగుతూ చదువుని నిర్లక్ష్యం చేయడంతో జీవితంలో స్థిరత్వం లభించక దేశాలు పట్టిపోయాడు. చిన్నా చితకా ఉద్యోగాలు చేసుకుంటూ అర్ధాకలితో బతుకుతున్న అతన్ని పిలిపించి, ఈ ఉద్యోగం ఇచ్చాను. స్కూలు
నుండి బయటకి వచ్చిన తర్వాత పాతికేళ్లుగా అడపాదడపా అతను నీ కంటపడ్డా నువ్వతన్ని గుర్తించి ఉండవు. ఒకవేళ గుర్తించినా పలకరించి ఉండవనే నా నమ్మకం’’ అంటూ నా వాదనపై చావుదెబ్బ కొట్టిన తర్వాత ఇక నువ్వు బయల్దేరు అన్నట్లుగా లేచి నించున్నాడు.

అవమాన భారంతో తల గిర్రున తిరుగుతుంటే తప్ప తాగినవాడిలా బరువుగా అడుగులేసుకుంటూ, హాస్పిటల్ బయటకి వచ్చి నిలబడ్డాను. ఇప్పుడేం చేసేది! ‘మా శివగాడు ఓ ఐదు వేలు రాయితీ ఇచ్చాడు సార్’ అని ఆ మొత్తం నేనే కట్టెయ్యనా? అమ్మో! ఐదు వేలంటే మాటలా. పైగా ముందు ముందు అలా ఎన్నిసార్లు కట్టాల్సి వస్తుందో... ఈ పరిస్థితి నుండి ఎలా బయటపడాలా అని కణతలు అదిరేలా ఆలోచిస్తుండగా ఆఫీసరుగారి దగ్గర్నుండి ఫోన్ వచ్చింది... ‘‘ఏం గిరీశం! డాక్టరుగారితో మాట్లాడావా? ఆయనేమన్నారు?’’ అంటూ.

‘‘సారీ సార్. నేను మీతో అబద్ధం చెప్పాను. నిజానికి డాక్టరుగారితో నాకంతగా పరిచయం లేదు. ఏదో ఫాల్స్ ప్రెస్టేజ్ కోసమని ఆయన పేరుని పదే పదే సంభాషణల్లోకి తీసుకువచ్చేవాడిని. రాయితీ కోసమని వెళితే కాసింత గడ్డిపెట్టి పంపారు’’ అని చెప్తాననుకున్నారు కదా! అక్కడే పప్పులో కాలేశారు.

‘‘మా శివ మారిపోయాడు సార్. వాడు ఒట్టి డబ్బు మనిషైపోయాడు. మీ ఆఫీసరు మావయ్యే కాదు, రేపు నువ్వొచ్చి అడ్మిట్ అయినా రాయితీ ఇచ్చేది లేదు. లెక్కంటే లెక్కే అనేశాడు సార్. వాడిని చెడామడా నాలుగు దులిపేసి బయటకి వస్తున్నాను. ఇక వాడి మొహం చూడను’’ అని అలవోకగా ఓ కథ అల్లేశాను.

అంత అసంకల్పితంగా అన్ని అబద్ధాలు చెప్పగలిగిన నా తెలివికి మురిసిపోతూ ఆయన ప్రతిస్పందనకై ఎదురుచూశాను.
‘‘పోన్లేవోయ్. నువ్వు మటుకు ఏం చెయ్యగలవు? ఇవాళ రేపు ప్రపంచం ఇలానే ఉంది’’ అంటూ నిరాశగా ఫోన్ పెట్టేశాడు.
ఇప్పుడు మా ‘శివ’ కాస్తా ‘శివగాడు’ అయిపోయాడు.

కె.ఎల్.సూర్య

16, మే 2011, సోమవారం

ఐదవ కథ :





3, ఏప్రిల్ 2011, ఆదివారం

నాలుగో కథ : ప్రయత్నం

నా అనుభవాలు కొంత, వూహ మరింత చేర్చి వయసుతో పని లేకుండా దేనినైనా సాధించగలమన్న స్పూర్తిని హాస్యం ద్వారా తెలియచెప్పడానికి చేసిన 'ప్రయత్నం' ఇది..




27, మార్చి 2011, ఆదివారం

మూడవ కథ - వెంకట్రాయుడుగారి తోట

ఎప్పుడన్నా బస్సులో ప్రయాణం చేసేటప్పుడు హఠాత్తుగా ఓ పచ్చటి పొలం మధ్యలో వుండే  సమాధి కనబడ్డం సహజం, భూమితో మనిషికి వున్నా గాఢానుబందాన్ని ప్రతిబింబించే ఆ సందర్భం చుట్టూ అల్లుకున్న కథ ఇది




24, మార్చి 2011, గురువారం

రెండో కథ - పరిమితులు

నా మొదటి కథ వ్రాసిన దాదాపు తొమ్మిది సంవత్సరాలకి రెండో కథ ప్రచురితం అయ్యింది, నేను కూడా కథలు వ్రాయగలను అన్న విశ్వాసాన్నీ పాఠకులనుండి సదభిప్రాయాన్నీ కలిగించిన కథ ఇది.ఈ కథని ప్రచురించి నన్ను ప్రోత్సహించిన సాక్షి పత్రికకీ రాజిరెడ్డిగారికి కృతజ్ఞతలతో..



11, మార్చి 2011, శుక్రవారం

నా తొలి కథ - అంపశయ్య



దాదాపు పది సంవత్సరాల క్రితం ప్రచురితం అయిన తొలి కథ ఇది, ఇప్పుడు తిరిగి దీనిని చదివితే కలిగే భావాలు చెప్పడం కష్టం, ఎందుకంటే బాగుంది, బాగోలేదు, ఇష్టం అయిష్టం.. వగైరా భావాలన్నీ ఎన్నో పరిస్థితులపై ఆధారపడి ఉంటాయని నా నమ్మకం.
23 ఏళ్ళ వయసులో చావు గురించి వ్రాయడం నా పరిణతికి చిహ్నమని అప్పట్లో అనుకునేవాడిని, కానీ ఈనాటికి నాకు తెలియవచ్చింది ఏమిటంటే పరిణతి అనేది ఒక comparative పదమని ! అది నిన్నకీ రేపుకీ మధ్యలో మాత్రమే స్థిరంగా వుంటుంది.

1, మార్చి 2011, మంగళవారం

కులం ఎక్కడికీ పో(లే)దు బాస్ !

మొన్నా మధ్య circar express లో చెన్నైకి తిరిగి వస్తున్నాను. రాత్రి పది గంటలకనుకుంటా ఎవరో ఇద్దరు మనుషులు ఒకే స్టేషన్లో ఎక్కి నా ఎదురుగుండా వున్నా బెర్తులపై ఆసీనులయ్యారు. సహజంగానే మాటా మాటా కలుపుకున్నారు, చుట్టుప్రక్కల వారంతా పడుకున్నా ఎటువంటి సంకోచమూ లేకుండా బిగ్గరగా మాట్లాడ్డం మనకి అలవాటే కదా !
ఇంతలో ఒకాయన అంటాడు కదా - " నాకు ఆ రెండు అక్షరాలు అంటే ప్రాణం అండీ. "
దానికి రెండో ఆయన ఆ రెండు అక్షరాలని పూర్తి చేయడానికి తొందర పడ్డాడు " స్నేహం "ఆండీ ?
"అబ్బే కాదు " ముసిముసిగా నవ్వుతూ తిరస్కరించాడు మొదటాయన .
"నీతా "ఆండీ ? అని మళ్ళీ అడిగాడు రెండో వ్యక్తి .
" ఆహా అవన్నీ కాదండీ --" అంటూ ఓ కులం పేరు చెప్పాడు ఆ పెద్దాయన .
ఆ తర్వాత ఓ గంట వరకూ ఆ చుట్టూ ప్రక్కల ప్రాంతాలలో తమ కులానికి చెందినా ప్రసిద్ధులు ఎవరెవరు వున్నారో వారిద్దరూ తీరికగా నెమరు వేసుకున్నారు.
ఇప్పుడు చెప్పండి బాస్! మనం అభ్యుదయవాదులమంటూ ఎన్ని కబుర్లో చెబుతాము కానీ మన వ్యక్తిత్వంలో ఏదో ఓ మూల కులం హాయిగా కాపురముంటోంది, ఫలానా వ్యక్తి మన కులం వాడని తెలియగానే, మనసులో ఏదో ఒక తృప్తి , ఫలానా నటుడు మనవాడే, ఫలానా పళ్ళ డాక్టర్ మనవాడే..
అప్లికేషను ఫార్మ్స్ లో , ఎలక్షన్లలో, ఉద్యోగాలలో, పెళ్ళిళ్ళలో, కార్పరేట్ కాలేజీలలో.. కులం ఎక్కడ లేదు చెప్పండి !
కులాన్ని పట్టించుకోం అని మనం చెబుతూనే వున్నాం, కానీ అవి మాటల వరకే, ఎందుకంటే మన అహంకారం, మన వ్యక్తిత్వం, మన బంధాలు, మన సంస్కృతి, మన రాజకీయం.. అన్నీ కులం చుట్టూనే వున్నాయి - కులం ఎక్కడికీ పో(లే)దు బాస్ !

16, ఫిబ్రవరి 2011, బుధవారం

కొన్ని రోజుల క్రితం సాక్షి పత్రికలో Caso చేత గీయబడిన Escaping critisism అనే చిత్రాన్ని చూసాను, ఎందుకనో ఆ చిత్రం నాకు మహా బాగా నచ్చింది, మనుషుల స్వభావం ఏమిటంటే వాళ్లకి బాగా నచ్చిన వస్తువులని అతిగా వాడి అన్నా పాడు చేస్తారు లేదా అతిగా భద్రపరిచన్నా పాడు చేస్తారు.నేను కూడా ఆ చిత్రాన్ని నా ఇష్టంతో పాడు చేసాను, దాని ఫలితం ఈ దిగువన చూడగలరు ( ఫోటో షాపికి కృతఙ్ఞతలు )




13, ఫిబ్రవరి 2011, ఆదివారం

విశ్వనాథ్ 'సూత్రధారులు'


ఎన్నో ఏళ్ళ తర్వాత నిన్ననే విశ్వనాథ్ 'సూత్రధారులు' మళ్ళీ చూసాను, ఎంత బాగుందో ! తెలుగు సంస్కృతి నేపధ్యంలో పెత్తందారులపై బడుగు జనాల విప్లవాన్ని ఎంతో గొప్పగా చూపించాడు విశ్వనాథ్ m.v.s. Haranatha Rao డైలాగులు కూడా కొన్ని చోట్ల ఎంతో అద్భుతంగా పండాయి ( ముఖ్యంగా climax లో ), కానీ నాకు గుర్తున్నంత వరకూ అప్పట్లో ఈ సినిమా ఒక ఫ్లాప్, శంకరాభరణం సినిమాని ఆదరించామని మహ గొప్పగా చెప్పుకునే మనం ఎన్ని మంచి సినిమాలకి పాడె కట్టామో కదా!


9, ఫిబ్రవరి 2011, బుధవారం

మళ్ళీ మొదలు బాబూ

దాదాపు నాలుగు సంవత్సరాల తర్వాత బ్లాగులో మొదటి పోస్టింగ్ ప్రచురిస్తున్నాను, బహుశా దీని బట్టే నేను ఎంతటి కార్యసాధకుడినో చెప్పవచ్చు, అయితే ఇక ముందు ముందు ఇంతటి నైరాశ్యం లేకుండా ఉండడానికి ప్రయత్నిస్తాను