12, జులై 2022, మంగళవారం

నా 28వ కథ… ఓ రచయిత డైలమా!


సూరిబాబు సిక్‌ లీవ్‌ పెట్టి వారం రోజులు గడిచిపోయాయి. ఎప్పటి నుంచో తనకి కవి కావాలని ఆశ. ఎన్ని పుస్తకాలు చదివినా, ఎన్ని వ్యాసాలు ఔపోసన పట్టినా… ఆ లోటు ఉండిపోయింది. గుమాస్తా ఉద్యోగంతో కడుపు నిండుతున్నా… బతుకు తృప్తి లేకపోయింది. అందుకనే వారం రోజులు సెలవు పెట్టి మరీ, మనసులో రొద చేస్తున్న భావాలన్నింటినీ అక్షరాలుగా రాశి పోశాడు. వాటిలో కాస్త లయబద్ధంగా ఉన్న వాక్యాలు కవితలయ్యాయి, అంత ఓపిక లేనివి కథగా మారాయి. మొత్తానికి పేజీలు నిండాయి. మనసులో భారం కాస్త తగ్గింది. రేపు తనకి ఏదన్నా జరిగినా జీవితం మరీ వృధా అయిపోలేదన్న పిసరంత నమ్మకం వచ్చింది.

ఇవాల్టితో సెలవు ఆఖరు. రాసీరాసీ అలసిన మనసుకి కాస్త చల్లగాలి తగిలితే బాగుండు అనిపించింది. అందుకే సాయంవేళ షికారుకి బయల్దేరాడు. ఇంటి నుంచి ఖాళీ స్థలాలు ఉన్న ఒంటరి బాట పట్టాడు. నాలుగడులు వేశాడో లేదో…

‘ఏం సూరిబాబూ! ఏంటి సంగతి’ అంటూ గదమాయింపు వినబడింది. తనతో అంత చనువు ఎవరికీ లేదు కదా అనుకుంటూ చుట్టూ చూశాడు. ఓ గులాబీని చూసేసరికి ఎందుకో అనుమానం వచ్చింది.

‘అవును నేనే మాట్లాడుతున్నా! ఏంటి సంగతి’ అని మళ్లీ గదమాయించింది గులాబీ.

‘ఏంటి సంగతి!’ అని ఎదురు అడిగాడు సూరిబాబు.

‘సిగ్గు లేకుండా మళ్లీ ఎదురు ప్రశ్నిస్తున్నావా. అసలు నీకు మనస్సాక్షి అనేదే లేదా’ కోపంతో గులాబీ మరింత ఎర్రబడింది. దగ్గరికి వెళ్తే ముల్లతో పొడిచేట్టుంది.

సూరిబాబు నోట మాటరాలేదు.

‘నువ్వేదో కవిత్వం రాస్తున్నావు కదా అని సంబరపడ్డాను. తీరా చూస్తే ఏదో భయం, గుబులు అంటూ ఊదరగొట్టావు అంతేకానీ పూబాలల తల ఊపుల గురించి, నునులేత ఆకుల మీద నుంచి జారే మంచుబిందువుల గురించి రాయలేదేం? కనీసం నా గులాబీ పరిమళాలను కూడా పట్టించుకోలేదు. పోనీ గడ్డిపూవులోని అమాయకపు అందం గురించైనా రాయాలి కదా! ప్రకృతి పలవరింతలేని కవిత్వమూ ఓ కవిత్వమేనా?’ అంటూ వాయించేసింది.

సూరిబాబుకు ఏం మాట్లాడాలో పాలు పోలేదు. గులాబీ ఇంకా కేకలేస్తూనే ఉన్నా, ఆ కేకలు కాస్తా తిట్లుగా మారినా… మొహం ఎర్రగా చేసుకుని పక్కనుంచి జారుకున్నాడు.

‘బహశా ఇదంతా భ్రమే అయి ఉంటుంది. లేకపోతే గులాబీ మాట్లాడటం ఏంటి? నా నాన్‌ సెన్స్‌’ అనుకున్నాడు సూరిబాబు. క్రమంగా ఆ తిట్ల నుంచి కోలుకుని, అడుగు ముందుకేశాడు. చల్లగాలి తగులుతోంది. గుండెవేగం కాస్త నిదానించింది. అడుగులు అసంకల్పితంగా ముందుకు పడుతున్నాయి. ఇంతలో…

‘రేయ్‌ సూరిబాబూ!’ అంటూ ఇంకో పిలుపు.

చెట్ల వంక చూశాడు. అనుమానం కలగలేదు. మబ్బులతో సహా ఎన్ని దిక్కులు చూస్తున్నా గొంతు ఎక్కడిదో తట్టలేదు. ఇంతలో ‘ఓయ్‌ సూరిబాబూ నిన్నే!’ అంటూ ఓ క్యారీబ్యాగ్‌  నుంచి మాట వినిపించింది. సగం నేలలో కూలబడి, మిగతా సగం గాలిలో ఎగురుతూ శాపగ్రస్తురాలిలా ఉన్న క్యారీబ్యాగ్‌ మాటలు మొదలుపెట్టింది.

‘నీ దుంపతెగ. నీ కంటి ముందు ఎంత వినాశనం జరుగుతోందో చూశావా. నేను ఈ నేలలో కలవడానికి ఎన్ని వందల ఏళ్లు పడుతుందో తెలుసా! భూగోళం మండిపోతోంది. గాలి ఉడికిపోతోంది. ఇదంతా నీకు పట్టిందా. ఏదో గుబులంటావు, భయం అంటావు కానీ నీ ఇంటి బయటి భాగోతం గురించి రాయలేకపోయావే! కాలుష్యం గురించి రాయకపోతే మానే. కనీసం అవినీతి గురించీ, అన్యాయాలకీ వ్యతిరేకంగా నీ కలం ధిక్కార స్వరం కావాలి కదా. సమాజం కోసం రాయని నీ కలం పూచికపుల్లతో సమానం సూరిబాబోయ్‌’ అని వాయించేసింది క్యారీబ్యాగ్‌. ఆ మాటలు పూర్తయ్యేసరికి దుమ్ముకొట్టుకుపోయిన ప్లాస్టిక్‌ కవర్‌ లా మారిపోయింద సూరిబాబు మనసు.

సిగ్గుతో చివుకుపోయిన మొహంతో ముందుకు కదిలాడు. ‘అంతా భ్రమే’ అంటూ తారకమంత్రంలాగా పదేపదే సర్దిచెప్పుకుంటూ ముందుకు సాగాడు. ఎదురుగా తను చదువుకున్న కాలేజీ కనిపించింది. విశాలమైన కాలేజీ, చుట్టూ వేల చేతులను తడిమిన గోడలు.

‘ఏం సూరిబాబూ మొత్తానికి కవి అయ్యావుగా!’ అంటూ వినిపించింది.

అనుమానం లేదు. ఇప్పుడు కాలేజే మాట్లాడుతోంది. తనకు చదువు చెప్పిన కాలేజీ గుర్తుంచుకుని పలకరిస్తోంది. అందుకని ఒకింత గర్వంగా తలెత్తి చూశాడు.

‘నువ్వు కాలేజీ గోడల మీద బొగ్గుతో పిచ్చి రాతలు రాసినప్పుడే ఇలాంటి పేదో చేస్తావని అనుకున్నా. కానీ ఇలా పరువు తీస్తావనుకోలేదు’ కోపంగా కసిరింది కాలేజి శిఖరం.

‘నేనేం తప్పు చేశాను’ ఉక్రోషంగా అడిగాడు సూరిబాబు.

‘ఇంకా అడుగుతున్నావా! అసలు ఆ వాక్యాలేంటి. ఆ పదప్రయోగాలేంటి. మధ్యమధ్యలో బడు లాంటి శబ్దాలేంటి. భాష అంటే కొంచెమన్నా భయంభక్తీ ఉన్నాయా…’ అంటూ లెక్చర్ దంచింది.

కాలేజ్‌ బెల్‌ మోగాక పరుగుతీసే కుర్రాడిలా అక్కడి నుంచి జారుకున్నాడు సూరిబాబు. కాస్త దూరంలో పాలకేంద్రం కనిపించింది.

ఎలాగూ ఇక్కడిదాకా వచ్చాను కదా… ఓ పాల ప్యాకెట్‌ పట్టుకుపోదాం అనుకుని కౌంటర్‌ ముందు నిలబడ్డాడు. ఏదో అనుమానం. ఎవరో తనని తీక్షణంగా చూస్తున్న అయోమయం. నిజమే. పక్కనే కొట్టంలోంచి గేదె తనని అదేపనిగా చూస్తోంది. ‘ఇంత బతుకూ బతికి దీని చేతిలో కూడా తిట్లు తినాలా’ అనుకుంటూ పక్కకి ఒరిగి నిలబడ్డాడు. అయినా దాని గొణుగుడు వినిపించకపోలేదు.

‘ఏదో గుమాస్తా ఉద్యోగం చేస్తున్నావు. మూడు పూటలకి సరిపడా నాలుగురాళ్లు పోగేస్తున్నావులే అనుకున్నా. ఈ రాతలేంటి సూరిబాబూ. నీ కవిత్వాన్ని కౌంటర్‌లో పెడితే పాలచుక్క కూడా రాదు. పాలవాడూ, పేపర్‌ వాడూ నీ క్రియేటివిటీ చూసి అరువిస్తారా. పిల్లల బాధ్యత చూసుకోవడానికి నీ రాతలేమన్నా దస్తావేజులా? ఏం తమాషాగా ఉందా! నాకున్న బాధ్యత కూడా నీకు లేదా!’ అంటూ తోకని కొరడాగా మార్చి ఒక్కటి జాడించింది.

ఆ దెబ్బకి అవమానపడి, తన మీద తనకే అసహ్యం వేసి ముందుకు కదిలాడు సూరిబాబు. తెలియకుండానే రైలు పట్టాల దగ్గరకు చేరుకున్నాడు. వాటిని చూసేసరికి ఎందుకో దుఃఖం ముంచుకొచ్చింది. చిన్నప్పటి నుంచీ తను పడ్డ కష్టాలు, మధ్యమధ్యలో రచయితగా నిలదొక్కుకోవడానికి చేసిన ప్రయత్నాలు… అన్నీ గుర్తుకొచ్చాయి. కన్నీటి చారతో పట్టాలు అస్పష్టంగా కనిపించాయి.

‘రేయ్‌ వెనక్కి పోరా నాయనా’ అంటూ కసిరాయి రైలు పట్టాలు. ‘అసలే పాసింజర్ బండి వచ్చే టైమైంది. పొరపాటున ఇక్కడ ఏమన్నా జరిగితే నాకు లేనిపోని అపనింద. నీ రాతలు కనీసం బతికే ధైర్యాన్ని కూడా ఇవ్వలేదని చుట్టుపక్కల జనం అంతా ఈసడించుకుంటారు. ఓ చిన్న బాక్స్‌ ఐటమ్‌ తో నీ బతుకు ముగిసిపోతుంది. ఆ తర్వాత నీ మీద ఆధారపడినవాళ్లంతా ఏడవాల్సిందే. ఇప్పుడీ హడావుడి అవసరమా. పోరా నాయనా’ అంటూ కూతపెట్టాయి.

సూరిబాబు మనసు బొగ్గునిప్పులా భగ్గుమని వెలిగి చల్లారిపోయింది. చకచకా ఇంటి ముఖం పట్టాడు. దారిలో పాలకేంద్రం, కాలేజీ శిఖరం, క్యారీబ్యాగులూ, పచ్చని మొక్కలూ వినిపిస్తున్న రొదకు పిచ్చెత్తిపోతూ పరుగుపరుగున తన ఇంటి ముందుకు చేరుకున్నాడు.

‘అలా రా దారికి!’ అంది ఇంటిగుమ్మం. ‘బుద్ధిగా ఆఫీస్‌ ఫైళ్లని నమ్ముకో. మిగతా పుస్తకాలన్నీ కాటాకి వేసేయ్‌. పొద్దున్నే తలదువ్వుకుని బస్సులో కూర్చో. సాయంత్రం ఇంటికి వచ్చేటప్పుడు పకోడీలు తెచ్చుకో. మరీ రచయితగా గుర్తింపు కావాలంటే కోటరీ పెంచుకో. కానీ రాతల అవసరమే లేదబ్బా! అలా కాకుండా నీ మానాన నువ్వు రాసుకుంటూ పోతే… అందరి మధ్యా అనాథవైపోతావ్‌. రేపటి నుంచి ఆఫీసుకు వెళ్దూగాని. త్వరగా తినేసి పడుకో!’ అంటూ లోపలికి ఆహ్వానించింది.

సూరిబాబు నీరసించిపోయాడు. ఆఫీసర్ల తిట్లూ, అప్పులవాళ్ల ఫోన్లు, పక్కింటి వాళ్లతో గొడవలూ… వీటన్నింటికంటే నిజమో కాదో తెలియని ఇప్పటి మాటలకు డీలాపడిపోయాడు. ఆ రాత్రి ఎంతలా దొర్లినా నిద్రపట్టలేదు. ఉదయం అలారం మోగక ముందే లేచి దాన్ని ఆపేశాడు. ‘దయచేసి ఇంకో వారం సిక్‌ లీవ్‌ మంజూరు చేయగలరు. ఆరోగ్యం ఇంకో కుదుటపడలేదు’ అంటూ ఆఫీసరుకు మెసేజ్‌ చేసి పుస్తకమూ, పెన్నూ చేతిలోకి తీసుకున్నాడు. ఈసారి తను ఇంకా ఏమేం వినాల్సి వస్తుందో!




 

కామెంట్‌లు లేవు: