10, జులై 2024, బుధవారం

ఊరట!

 

ఇంటి ప్లాన్‌ పూర్తయ్యింది. ఓ రెండడుగులు వెనక్కి వేసి, దూరం నుంచి దాన్ని చూసుకున్నాడు శేఖర్‌. అడ్డగీతలూ, నిలువుగీతలూ కలిసి ఓ అందమైన ఇంటి కోసం తుదిరూపాన్ని ఇచ్చాయి. దాని క్లయింట్‌ మామూలు వాడు కాదు. ఊరి నడిబొడ్డున వెయ్యి గజాల స్థలానికి సొంతదారు. ఆ మాట విన్నప్పుడల్లా శేఖర్‌ మనసులో లెక్కలు మొదలైపోతాయి. వెయ్యి X అంటూ ఊహించలేనంత సొమ్ము… ఓ నోటిఫికేషన్‌ లాగా మెదడులోకి దూసుకు వస్తుంది. దాన్ని కాస్త పక్కకి నెట్టి, ఇంజనీరుగా తన బాధ్యతను పూర్తిచేయడం మొదలుపెట్టేవాడు. ఇప్పటికి పదిహేను రోజులుగా ఆ ప్లాన్‌ కోసం మెదడును వేడెక్కించాడు. తన సంప్రదాయ జ్ఞానం సరిపోదేమో అని ప్రపంచవ్యాప్తంగా ఉన్న రిఫరెన్సుల కోసం గూగుల్‌ చేశాడు. ఆఖరికి కళ్లు మూసుకున్నా, డిజైన్‌లో ఏదో ఓ అంశం చటుక్కున కనురెప్పల తెరల మీదకు దూసుకు వచ్చేది. పూజగదిని ఇంకాస్త మార్మికంగా మార్చే అవకాశం ఉందా? స్విమ్మింగ్‌ పూల్‌ కాస్త పక్కకు ఉండాలా? ఉఫ్‌… అన్నీ సవాళ్లే. తన మెదడే ఓ గేమ్‌ షోలాగా మారిపోయిన ఫీలింగ్‌.

ఈలోగా ఇటు ప్లాన్‌ వేయించుకుంటున్న యజమాని నుంచి ఫోన్లు. అది తన డ్రీమ్‌ హౌజ్‌ అని ఊదరగొడతాడు. తన జీవితం దానితో ముడిపడి ఉందని, అప్పగించిన బాధ్యత ఎంత పదిలమో పదేపదే గుర్తుచేస్తాడు. ఇరవై ఏళ్లుగా తను పడ్డ కష్టానికి ప్రతిఫలం అంటూ తన గతాన్ని రీళ్లు రీళ్లుగా వినిపిస్తాడు. చివరికి… ప్లాన్‌లో తనకు తోచిన రిక్వైర్‌మెంట్స్‌ ఏకరవు పెడతాడు. వాటి ప్రకారం మళ్లీ మార్పులూ చేర్పులూ! అవన్నీ చేస్తుండగానే ఆఫీసర్‌ క్యాబిన్‌లోకి వస్తాడు. ‘నువ్వు ఈ ప్లాన్‌ బాగా హ్యాండిల్‌ చేయగలవు’ అంటూ పక్కకి వచ్చి నిలబడతాడు. ప్లాన్‌లోకి తొంగిచూస్తూ ‘ఇది ఇంకాస్త డిఫరెంట్‌ గా చేస్తే బాగుంటుందేమో ప్రయత్నించు’ అని మేనేజ్‌మెంట్‌ లౌక్యాన్ని ఉపయోగిస్తాడు. అదృష్టవశాత్తు ఆఫీసర్‌ వారం రోజులుగా రావడం లేదు. దాంతో తుదిమెరుగులు త్వరగానే పూర్తయ్యాయి. ఇవాళ తను రాగానే, ప్లాన్‌ సబ్‌మిట్ చేసేయవచ్చు…

ఆలోచనలన్నీ పక్కకు పెట్టి మరోసారి తదేకంగా తన ప్లాన్ వంక చూసుకున్నాడు. బాగానే వచ్చింది అన్న తృప్తి కలిగింది. ఇన్ని పరిమితుల మధ్యా… తనను తాను నిరూపించుకున్నాడనే తోచింది. ఒక్క క్షణం అలా కుర్చీలో కూలబడిపోయాడు. తల వెనక్కి వాలింది. అప్పటిదాకా బిగపెట్టుకున్న ఒత్తిడి, విడుదల అయిపోయినట్టు… ఉఫ్‌ అంటూ సీలింగ్‌ వంక చూస్తుండిపోయాడు.

అంత కష్టపడినా, ఆ ఇంటి మీద తన పేరు ఉండదు. దాని గృహప్రవేశానికి పిలుపు రాదు. ఆ ఫంక్షన్లో ఇంటి యజమాని చేతులు బారచాచుతూ, అతిథులను ఇల్లంతా తిప్పే సమయంలో కూడా… ‘అతను’ ఎలా జాగ్రత్తగా, ఎంత తెలివిగా ప్లాన్‌ చేయించుకున్నాడో చెబుతాడు. అంతేకానీ శేఖర్ అన్న పేరు చచ్చినా వినిపించదు. అలాంటివన్నీ గుర్తుకు వచ్చినప్పుడు ఓ చిన్నపాటి బాధ. అది జెలసీ అనీ, తప్పు అనీ… ఆ బాధని అక్కడికక్కడే తొక్కిపెట్టేస్తాడు. దాంతో బాధ ఇంకాస్త పదును తేలుతుంది. ఉద్యోగధర్మం, ప్రతిఫలాపేక్ష లాంటి కబుర్లతో దాన్ని చదును చేసే ప్రయత్నం చేస్తాడు. ఊహూ… అయినా ఎందుకో ఆ బాధ అలా సలుపుతూనే ఉంటుంది. ఈలోగా మరో ప్రాజెక్ట్‌ వస్తుంది. దానిలో నిమగ్నం అయిపోయాకే… పాత గాయం మానుతుంది.

*****

‘సార్‌ రమ్మంటున్నారు’ అన్న పిలుపు వచ్చింది. చటుక్కున లేచి నిలబడ్డాడు. ఆఫీసర్‌ తన క్యాబిన్లోకి రాకుండా నేరుగా పిలిపించుకుంటున్నాడంటే అర్థం… ప్లాన్‌ తీసుకుని రమ్మనే! వెంటనే ప్రింట్‌ ఔట్‌ తీసుకుని బయల్దేరాడు. లోపలికి అడుగుపెట్టగానే అర్థమైంది… ఇవాళ తనకు గడ్డురోజు అని. ఆఫీసర్‌ మూడ్‌ తేడాగా ఉంది. రెండు సందర్భాల్లో ఆయన చాలా చిరాకుగా ఉంటాడు. ఒకటి- సోమవారం. వీకెండ్‌ ప్రభావమో ఏమో కానీ, ఆ రోజు కదిపితే చాలు భగ్గుమంటాడు. రెండు- తను ప్లాన్‌ తీసుకుని గదిలోకి అడుగుపెట్టే రోజు. ప్రతిసారీ తన ఇంట్లో పరిస్థితులు వాకబు చేస్తూ, మందుపార్టీల గురించి ఛలోక్తులు విసిరే మనిషి… తన చేతిలో ప్లాన్‌ చూడగానే ఎండుపుల్లలాగా బిగదీసుకుపోతాడు. హావభావాలేవీ ఉండవు. గొంతు గంభీరంగా మారిపోతుంది. ప్లాన్‌ చూపిస్తూ ఎంతసేపు వివరణ ఇస్తున్నా… ఊ, ఊ అంటూ పొడి మూలుగులతోనే సరిపెడతాడు.

ఆయన ప్లాన్‌ వంక చూసే పావుగంట, ఇరవై నిమిషాలు… ప్రపంచంలోనే తనంత అల్సజీవి ఉండడు అనిపిస్తుంది. ఆ అల్పత్వం గురించి ఆయన మౌనంగా లెక్చర్‌ ఇస్తున్నట్టు తోస్తుంది. ఒకో క్షణం ఉక్కపోతతో, గుండెదడతో గడిచిన తర్వాత… చిట్టచివరికి ఆ ప్లాన్‌ మీద నిశబ్దంగా తన సంతకం చేసి తన వైపు వేస్తాడు. అంటే ప్లాన్‌ బాగానే ఉన్నట్టు అర్థం! సంతకం చేయకుండా నిట్టూర్చి వెనక్కి ఇచ్చాడంటే మళ్లీ ప్రయత్నించమన్నట్టు. లోపం చెప్పడు, తన అభిప్రాయం చెప్పడు. ఇక అంతే!

కానీ ఇవాళ అలా కాదని తన నమ్మకం. ప్లాన్‌ను చూడగానే ఆయన కళ్లు మెరవాల్సిందే! ఆ ఫీలింగ్‌ తనకు కనిపించి తీరుతుంది. తన హోదాల బెట్టును పక్కన పెట్టి… ‘బాగుంది శేఖర్. వెల్‌డన్’ అని అన్నా అనవచ్చు. సంతోషంతో కాసేపు, క్యాబిన్‌లో కూర్చోపెట్టుకుని పిచ్చాపాటీ మాట్లాడవచ్చు. ఏమో ఇంకా తన టైమ్‌ బాగుంటే… ‘వచ్చే మీటింగ్‌లో నీ ఇంక్రిమెంట్‌ గురించి మాట్లాడి చూస్తాను’ అన్నా అనవచ్చు. కానీ ప్లాన్‌ కి నో అని మాత్రం అనడు. ఆ మాత్రం నమ్మకం, తను చేసిన పని మీద ఉంది. ఆ నమ్మకంతో మనసు కాస్త తేలికపడింది.

ఆఫీసర్‌ క్యాబిన్‌లోకి అడుగుపెట్టి, ప్లాన్‌ ఆయన చేతిలో పెట్టాడు. దాన్ని టేబుల్‌ మీద పరుచుకున్న మనిషిలో ఎప్పటిలాగా ఎలాంటి స్పందనా లేదు. ఓ పొగడ్త కోసం తనలో ఆశ చావలేదు. చివరికి ఓ పదినిమిషాల తర్వాత, సంతకం పెట్టకుండానే… ప్లాన్‌ తనవైపు టేబుల్‌ మీద గిరాట వేశాడు.

ఒక్కసారిగా ఒళ్లు చల్లబడిపోయింది. కిందపడిపోతానేమో అన్నంతగా నిస్సత్తువ వచ్చేసింది. అంతలోనే లాగిపెట్టిన బాణంలాగా… కోపం ఎగదన్నింది. ‘ఏమన్నా ప్రాబ్లమా సార్‌!’ ఎర్రబడ్డ మొహంతోనే వినయంగా అడిగాడు. ‘ఇంకొంచెం బెటర్‌గా ప్రయత్నించండి’ అంటూ నిర్లిప్తంగా జవాబు వచ్చింది. ‘బాగానే చేశానండీ. ఏ విషయంలో మార్పులు చేయాలో చెబితే, మారుస్తాను’ పట్టువదలకుండా అడిగాడు. రెండువారాల శ్రమంతా గుర్తుకు వచ్చి ఏడుపు తన్నుకొస్తోంది. పిల్లాడి అనారోగ్యం, ఒక్కసారిగా చుట్టుముట్టిన అప్పులు, భార్యతో గొడవ… వీటన్నింటినీ పంటి బిగువున భరిస్తూ, సాముగారడీ చేసేవాడిలాగా పూర్తిచేసిన పని అది. దానిలో ఒక్క గీతను కూడా మార్చే ఓపిక లేదిక.

‘ఒకసారి చూసుకోండి. ఎలాంటి మార్పులు చేయాలో మీకే అర్థమవుతుంది. మీతో దగ్గరే ఉండి దిద్దించుకునేట్టయితే… నేనే చేసుకోవచ్చు కదా!’ విసురుగా విరుచుకుపడింది జవాబు. తను ఇకమీదట చెప్పే ఒకో మాటకూ… అంతకు పది రెట్లు తీక్షణమైన స్పందన వస్తుందని తెలుసు. అందుకే మారు మాటాడకుండా తన క్యాబిన్‌లోకి వచ్చేశాడు. ఆ రోజుకు ఇక పని చేయకూడదని నిశ్చయించుకున్నాడు. కంపెనీకి తను విధించగలిగే శిక్ష అది ఒక్కటే.

రోజు గడుస్తోంది. పాత మెయిల్స్ చూసుకుంటూ, పాత మిత్రులను వాట్సాప్‌ లో పలకరిస్తూ కాలక్షేపం చేస్తున్నాడు. పాత గుర్తులతో కొత్త గాయాన్ని కప్పిపుచ్చే ప్రయత్నమది. కానీ గుండె మండుతూనే ఉంది. రక్తపోటుతో ఊపిరితిత్తులు బరువెక్కుతున్నాయి. ఛాతీలో సన్నగా నొప్పి! బాధంతా ఫౌంటెన్‌లా చిమ్ముతున్నట్టు… జివ్వుమని తలనొప్పి.

సాయంత్రం అయిపోయింది. అయినా ఇంటికి వెళ్లాలనిపించడం లేదు. ఆఫీసు వదిలిన పావుగంటలో ఇంటికి చేరకపోతే, ఫోన్లు వస్తాయని తెలుసు. మరికాస్త ఆలస్యం అయితే తగవు తప్పదనీ తెలుసు. ఇవాళ తన బాధ ఆ భయాన్ని కూడా దాటేసింది. అయిదు, ఆరు, ఏడు గంటలైపోయింది. అప్పుడు కనిపించాడు… కారిడార్‌లో కూర్చున్న ఆఫీస్ అసిస్టెంట్‌- రాజేష్‌! వాళ్లిద్దరి మధ్యా గుడ్‌మార్నింగ్‌ చెప్పుకోవడానికి మించి మరో పరిచయం లేదు. ఆఫీసులో చిన్నాచితకా పనుల కోసం అతన్ని ఏర్పాటు చేశారు.

పగలంతా కూర్చున్న అలసటను తీర్చుకునేందుకు… శేఖర్‌ తన క్యాబిన్‌లోంచి బయటకు వచ్చాడు. అది చూసి ఏమన్నా కావాలా అన్నట్లు లేచి నిలబడ్డాడు రాజేష్‌. తనను చూసిన వెంటనే అలా లేచి నిలబడటం కాస్త ఇబ్బందిగా తోచింది. అలాగని లేవకపోయినా, ఇబ్బందిగా తోచేదేమో! ఏం అవసరం లేదన్నట్లు అభయహస్తం చూపిస్తూ… ‘ఇంకా బయల్దేరలేదే!’ అంటూ అడిగాడు. ‘మీరున్నారు కద సర్‌! అందరూ వెళ్లిపోయాక తాళాలు వేసి బయట సెక్యూరిటీకి ఇచ్చి వెళ్లాలి,’ అంటూ మొహమాటంగా సంజాయిషీ వినిపించింది.

‘రోజూ ఆలస్యంగా వెళ్తే, ఇంట్లో విసుక్కోరా!’ నవ్వుతూ అడిగాడు. ఇవాళ ఎందుకో తనతో మాట్లాడాలనిపించింది. ఇంకాస్త రిలీఫ్‌ కోసం! ‘అలవాటైపోయింది సార్‌. పెళ్లయిన కొత్తలో తను చాలా భయపడేది. తనని చూసి నాకూ బాధనిపించేది. ఇప్పుడు అలవాటైపోయింది సార్‌!’ నవ్వుతో బాధను కప్పిపుచ్చుతూ చెప్పాడు రాజేష్‌. శేఖర్‌ ఒక్క క్షణం సందిగ్ధంలో పడిపోయాడు. ఆ వ్యక్తిగత విషయం విన్న వెంటనే అక్కడి నుంచి లేచి వెళ్లకపోతే బాగోదు. అలాగని నిశబ్దంగా కూర్చోలేడు. అందుకే ‘ఏం చదువకున్నావేంటి’ అంటూ పరమ సాధారణమైన ప్రశ్న వేశాడు.

‘బీ.టెక్‌!’ సిగ్గుపడుతూ చెప్పాడు. ఆ మాట విన్నాక ఎదుటి మనిషి కనబొమలు ముడిపడతాయని రాజేష్‌ కు తెలుసు. అందుకే తన ప్రస్తుత పరిస్థితికి సంజాయిషీ ఇవ్వడం మొదలుపెట్టాడు ‘మాది చాలా నార్మల్‌ ఫ్యామిలీ సార్‌. ఇంట్లో పరిస్థితులు అంతంత మాత్రమే. బుద్ధిగా చదువుకుంటేనే బాగుపడతావని నాన్న ఎప్పుడూ చెబుతుండేవాడు. అయినా శ్రద్ధ లేకపోయింది. సినిమాలు, షికార్లు అంటూ తిరిగేవాడిని. ఎమ్‌సెట్‌లో మంచి ర్యాంక్‌ రాలేదు. ఎలాగొలా బీటెక్ చేయిస్తేనన్నా మంచి ఉద్యోగం వస్తుందేమో అని నాన్న ఆశ. ఉన్న డబ్బులన్నీ పెట్టి మేనేజ్‌మెంట్‌ కోటాలో సీట్‌ ఇప్పించాడు. ఎలాగొలా నెట్టుకొద్దాం అనుకున్నా. అదీ ఒంటపట్టలా. కాలేజ్ లెక్చరర్లు కూడా అంతంత మాత్రమే. మొత్తానికి అయిదేళ్లకి అయింది అనిపించా! బయటకు వచ్చేసరికి పరిస్థితులు బాగోలేదు. రికమెండ్‌ చేసేవాళ్లు ఎవరూ లేరు. బీ.టెక్‌ తో పాటు వేరే కోర్సులు ఏం చేయలేదు. చూస్తూచూస్తుండగానే ఇంకో రెండేళ్లు గడిచిపోయాయి. అటు ఫ్రెషర్‌ నీ కాదు, ఇటు అనుభవమూ లేదు. ఏ ఉద్యోగం అయినా చేద్దామని సిద్ధపడ్డాక ఇది దొరికింది. చూస్తూ చూస్తుండగా ఐదేళ్లు గడిచిపోయాయి. ఇక లైఫ్‌ ఇంతే!’ ఎటో చూస్తూ పూర్తిచేశాడు. తన గతం అంతా ఎందుకలా ధారగా చెప్పుకోవాలనిపించిందో. తను అందరూ అనుకునేంత పనికిమాలినవాడిని కాదని నిరూపించుకోవడానికా! జీవితాంతం వెంటాడే పరాజయాన్ని, పదిమందితో పంచుకుని దాన్ని పలచన చేసుకోవడానికా! ఏదైతేనేం మొత్తానికి చెప్పేశాడు. ఆ తర్వాత ఎందుకో శేఖర్‌ వంక చూడాలనిపించలేదు.

రాజేష్‌ అంతలా బేలగా బయటపడిపోతాడని ఊహించలేదు. దాంతో సాంత్వనగా ఓ నాలుగు ముక్కలు చెప్పాల్సిన పరిస్థితి వచ్చింది. ‘నేనూ చాలా కష్టాలే పడ్డానబ్బా. అయినా చదువులో ఎప్పుడూ వెనకబడింది లేదు. సివిల్స్‌ పరీక్షలు ఒక్క మార్కులో మిస్ అయ్యాను. ఇదిగో… చివరికి ఇక్కడికి వచ్చి పడ్డాను. పేరుకే ఇంజనీర్‌. ఉండేది మాత్రం ఇరుకు అద్దె ఇల్లు. ఏం చేస్తాం! ఓ మామూలు గుమాస్తాగా స్థిరపడాలని ఎవడు మాత్రం కోరుకుంటాడు. పెద్దయ్యాక నువ్వు ఏమవుతావు అని అడిగితే… ఎవరూ నేను గుమాస్తా అవుతా అని చెప్పడుగా! కానీ జిగ్‌ సా పజిల్‌ లాగా, ఎక్కడో ఒకచోట ఇమిడిపోతాం. మొదట్లో పెనుగులాడినా… అక్కడే స్థిరపడిపోతాం.’ అంటూ బడబడా చెప్పేశాడు. తన జీవితం గురించి అంత లోతుగా… అందులో ఓ అపరిచితుడితో చెప్పగలనని అనుకోలేదు. పెనుతుఫానులో ఒకే చెట్టు మీద వాలిన పక్షుల్లా ఉన్నారు వాళ్లు. ఈలోగా సందులు గొందుల వెంబడి తిరుగుతూ చల్లబడిన గాలి… నిదానంగా ఆఫీసులోకి ప్రవేశించింది. గడియారం వంక చూశాడు శేఖర్‌. ఎనిమిది గంటలయ్యింది. లేచి నిలబడ్డాడు. కానీ ఇంకాస్త దుగ్ధను పంచుకోవాలనిపించింది.

‘మొదట్లో చాలా డిప్రెషన్‌కు లోనయ్యా రాజేష్‌. ఎక్కడికో ఎగిరి వెళ్లిపోవాలన్న తపన. కానీ రెక్కలు విరిచేసిన ఫీలింగ్‌. వ్యక్తిత్వ వికాస పుస్తకాలు చదివా, మోడ్రన్‌ స్వామీజీల ప్రవచనాలు విన్నా… ఆ కాసేపు జీవితం మారిపోతుందన్న నమ్మకం కలిగేది. ఏవో ప్రణాళికలు మెదిలేవి. కానీ మర్నాడు ఆఫీసుకు వచ్చి సిస్టమ్‌ ముందు కూర్చోగానే, కాడిని తలకెత్తుకున్నట్టే. మళ్లీ అదే బతుకు’ తన క్యాబిన్‌ వైపు చిన్నగా నడుస్తూ అన్నాడు.

‘అసలు మన సిస్టమ్ లోనే లోపం ఉంది సార్‌. మన చదువులూ, ఉద్యోగాలూ, ప్రభుత్వాలూ… అన్నీ ఘోరమే!’ పక్కనే నడుస్తూ వత్తాసు పలికాడు రాజేష్‌. ‘ఏం చేయలేమబ్బా! సిస్టంకి ఎదురు తిరిగావంటే తిండి కూడా దొరకదు. పోనీ… అందరూ కలిసి ఈ సిస్టమ్‌ మార్చారే అనుకో… ఆ… కొన్నాళ్లకి మళ్లీ లోటుపాట్లు మొదలవుతాయి. ఏ సిస్టంలో అయినా మనిషేగా ఉండేది. అధికారం కోసం వైకుంఠపాళి, హోదాల పొగరు, కర్కశత్వం, అణచివేత… అన్నీ మొదలవుతాయి. కత్తి పేరే మారుతుంది. దాని వాడి తగ్గదు. దాన్ని పట్టుకునేవాడు బలవంతుడు. దాని గాటు తట్టుకునేవాడు బలహీనుడు. అంతే లెక్క! ఇవన్నీ ఆలోచించీ ఆలోచించీ బీపీ పెరిగిపోయిందబ్బా!’ తన కంప్యూటర్ షట్‌ డౌన్ చేస్తూ నవ్వాడు శేఖర్‌.

క్యాబిన్‌లో స్విచ్‌లు ఆఫ్‌ చేసి, ఇద్దరూ బయటకు నడిచారు. ఫ్రంట్‌ ఆఫీస్‌ వైపు అడుగులు వేస్తూ స్వగతం చెప్పుకుంటున్నట్టుగా… ‘మనిషిలోనే తేడా ఉంది. ఆకలి, సెక్స్‌… రెండూ హాయిగా తీరిపోతున్నాయిగా… దాని కోసం ప్రకృతి ఇచ్చిన తెలివినంతా ఇప్పుడు అహంతృప్తి కోసమే వాడుకుంటున్నాడు. నువ్వు బతికుండాలన్న విషయాన్ని గుర్తు చేయడానికి మనకు అహం వచ్చింది. ఇప్పుడు అదే మన జీవితం అయిపోయింది.’ రిసెప్షన్‌ దగ్గర ఒక్క నిమిషం ఆగాడు. అంత పెద్ద పెద్ద మాటలు వాడినందుకు సంజాయిషీ ఇస్తున్నట్టుగా ‘ఇదంతా తెలిసినా… ఓదార్పు పెద్దగా కలగదబ్బా. ఇదిగో ఇలా ఆఫీసర్ చేతిలో అవమాన పడ్డప్పుడు, ఇంట్లో మాటామాటా పెరిగినప్పుడు… ఇవేవీ బాధను ఆపలేవు. నాకూ అహం ఉందిగా…’ రాజేష్ వంక చూస్తూ అన్నాడు.

‘పోన్లేండి సార్‌! వాడిని పట్టించుకోకండి. పని చేతకాదని, పెత్తనం ఇచ్చారు. వాడికేం బాధలున్నాయో. కొడుకుతో సరిపడదని విన్నాను. అందుకేనేమో సోమవారం సోమవారం ఏడుపుమొహంతో వస్తాడు…’ అంటూ కొట్టిపారేశాడు.

తన ఆఫీసరు కూడా బాధలు పడతాడనే మాట కాస్త ఊరట కలిగించింది. మనసు ఎందుకో తేలికపడింది. బయట గాలి ఇంకా చల్లబడినట్టు తోచింది. ఒక్కసారిగా ఊపిరి పీల్చుకున్నాడు… వెనుక వైపు నుంచి ఆఫీసు వేడి, బయట నుంచి చల్లగాలి… రెండూ ఒక్కసారిగా ఒంటిని చుట్టుముట్టాయి. రాజేష్‌, తను, ఇన్‌చార్జి, ఆయన కొడుకు, ప్లాన్‌ వేయించుకున్న ఇంటి ఓనరు… అందరూ వేర్వేరు మెట్ల మీద కూర్చుని బాధపడుతున్నట్లు అనిపించింది. ఇదంతా మెదలబట్టి ‘నిజమేనబ్బా!’ అంటూ ఓ నవ్వు నవ్వాడు.

ఆఫీసు బయట అడుగుపెట్టేసరికి, చెట్ల చుట్టూ ఉన్న చల్లదనానికి ఒక్కసారిగా ఒళ్లు జలదరించింది. రాజేష్‌ కూడా బయటకు వచ్చి షట్టర్‌ క్లోజ్‌ చేసే పనిలో పడ్డాడు. ‘ఇవాళ శనివారం కదా! ఇంటికేనా లేకపోతే ఓ రౌండ్‌ అలా మందేసి వెళ్తావా!’ అంటూ కొత్తగా వచ్చిన చనువుతో అడిగాడు శేఖర్‌.

‘అబ్బే. ఎప్పుడో మానేశా సార్‌! తాగి ఉపయోగం ఏముంది, డబ్బులు దండగ! తాగుడులో పడితే పెగ్గుల లెక్క తెలియదు. దాంతో మర్నాడు హ్యాంగోవర్‌. ఇంట్లో చికాకులు. అందుకే మానేశా సార్‌. ఎప్పుడన్నా మరీ అకేషన్ ఉంటే తప్ప!’ తాళాల గుత్తి వాచ్‌మెన్‌కి ఇస్తూ చెప్పాడు. ‘ఎప్పుడన్నా ఓ రోజు, బాగా బాధనిపిస్తే. దాన్ని మర్చిపోవాలనుకుంటే, అప్పుడు కూడా తాగవా!’ అడిగాడు శేఖర్‌. తను చేసే పని అదేగా మరి!

రాజేష్‌ ఒక్క నిమిషం ఆగాడు. వాళ్ల మాటలు ఎవరన్నా వింటున్నారేమో అన్నట్లు అటూఇటూ చూశాడు. ఆ తర్వాత కొంచెం సిగ్గుపడుతూ… ‘మీరు అర్థం చేసుకుంటారన్న నమ్మకంతో చెబుతున్నా సార్‌! ఇంతవరకూ ఈ రహస్యం నా భార్యతో కూడా పంచుకోలేదు’ అంటూ తలవంచుకున్నాడు.

రాజేష్‌ ఏం చెప్పబోతున్నాడా అని ఆశ్చర్యం వేసింది. ఈ మలుపును తను ఊహించలేదు. అందుకే తన వంక చూస్తుండిపోయాడు. ఇదేమీ ఎరుగని గాలి, పసిపాపలా మారి… కాళ్ల చుట్టూ తిరుగుతోంది.

‘ఎప్పుడన్నా తట్టుకోలేని బాధ కలిగిందనుకోండి. దాన్ని రాత్రి దాకా బిగపెట్టుకుంటాను. అందరూ పడుకుంటారు కదా! అప్పుడు నా మూడేళ్ల కూతురు చేతిలో తల పెట్టుకుని వెక్కి వెక్కి ఏడుస్తాను. గుండె బరువంతా తీరిపోయేదాకా కొంచెంకొంచెంగా ఏడుస్తా. అందరూ గాఢనిద్రలో ఉంటారు. ఎవరూ లేచి ఎందుకు ఏడుస్తున్నావ్‌ అని కంగారుపడరు. సార్‌.. నా చిన్ని తల్లి మొహంలో అమాయకత్వం చూస్తూ ఏడుస్తుంటే… నా దుఃఖం అంతా కరిగిపోతున్నట్లు అనిపిస్తుంది. తన ఆదమరపు శ్వాస ముందు… నా బాధ్యతలు కష్టాలు తేలికపడతాయి. దాని లేత చేతుల్లో నా తలపెట్టుకున్నప్పుడు, అదే అభయహస్తంలా తోస్తుంది. ఫర్వాలేదు ఇంకొన్నాళ్లు బతకవచ్చు అనే భరోసా వస్తుంది. కాసేపటికి నా కన్నీరు ఆగిపోతుంది. దాన్ని వదిలించుకున్న మనసు తేలికపడుతుంది. ఇక నిద్రలోకి జారుకుంటాను. మర్నాడు లేవగానే నా కుటుంబాన్ని చూసేసరికి చాలా సంతోషంగా ఉంటుంది,’ అప్రయత్నంగా వచ్చిన కన్నీళ్లని అదిమిపెడుతూ చెప్పాడు రాజేష్‌. అదంతా వింటున్న శేఖర్‌ కళ్లు కూడా చెమ్మగిల్లాయి. రాజేష్ భుజం మీద చేయి వేసి తట్టాడు. ‘సోమవారం కలుద్దాం’ అని చెప్పి తన బండి వైపు బయల్దేరాడు.

బండి స్టార్ట్‌ చేసి ముందుకు దూకించగానే రయ్యిమని గాలి ఎదురొచ్చింది. ఎందుకో ఇంటి దగ్గర ఉన్న తన ఆరేళ్ల పాప గుర్తుకొచ్చింది. అది పడుకున్నప్పుడు, దాని మొహంలో తోచే ప్రశాంతత కనిపించింది. దాని లేత చేతుల స్పర్శ అనుభవంలోకి వచ్చింది. దారిలో ఉన్న బార్‌ను దాటి, ఇంటి వైపు బండి పోనిచ్చాడు.


12, జులై 2022, మంగళవారం

నా 28వ కథ… ఓ రచయిత డైలమా!


సూరిబాబు సిక్‌ లీవ్‌ పెట్టి వారం రోజులు గడిచిపోయాయి. ఎప్పటి నుంచో తనకి కవి కావాలని ఆశ. ఎన్ని పుస్తకాలు చదివినా, ఎన్ని వ్యాసాలు ఔపోసన పట్టినా… ఆ లోటు ఉండిపోయింది. గుమాస్తా ఉద్యోగంతో కడుపు నిండుతున్నా… బతుకు తృప్తి లేకపోయింది. అందుకనే వారం రోజులు సెలవు పెట్టి మరీ, మనసులో రొద చేస్తున్న భావాలన్నింటినీ అక్షరాలుగా రాశి పోశాడు. వాటిలో కాస్త లయబద్ధంగా ఉన్న వాక్యాలు కవితలయ్యాయి, అంత ఓపిక లేనివి కథగా మారాయి. మొత్తానికి పేజీలు నిండాయి. మనసులో భారం కాస్త తగ్గింది. రేపు తనకి ఏదన్నా జరిగినా జీవితం మరీ వృధా అయిపోలేదన్న పిసరంత నమ్మకం వచ్చింది.

ఇవాల్టితో సెలవు ఆఖరు. రాసీరాసీ అలసిన మనసుకి కాస్త చల్లగాలి తగిలితే బాగుండు అనిపించింది. అందుకే సాయంవేళ షికారుకి బయల్దేరాడు. ఇంటి నుంచి ఖాళీ స్థలాలు ఉన్న ఒంటరి బాట పట్టాడు. నాలుగడులు వేశాడో లేదో…

‘ఏం సూరిబాబూ! ఏంటి సంగతి’ అంటూ గదమాయింపు వినబడింది. తనతో అంత చనువు ఎవరికీ లేదు కదా అనుకుంటూ చుట్టూ చూశాడు. ఓ గులాబీని చూసేసరికి ఎందుకో అనుమానం వచ్చింది.

‘అవును నేనే మాట్లాడుతున్నా! ఏంటి సంగతి’ అని మళ్లీ గదమాయించింది గులాబీ.

‘ఏంటి సంగతి!’ అని ఎదురు అడిగాడు సూరిబాబు.

‘సిగ్గు లేకుండా మళ్లీ ఎదురు ప్రశ్నిస్తున్నావా. అసలు నీకు మనస్సాక్షి అనేదే లేదా’ కోపంతో గులాబీ మరింత ఎర్రబడింది. దగ్గరికి వెళ్తే ముల్లతో పొడిచేట్టుంది.

సూరిబాబు నోట మాటరాలేదు.

‘నువ్వేదో కవిత్వం రాస్తున్నావు కదా అని సంబరపడ్డాను. తీరా చూస్తే ఏదో భయం, గుబులు అంటూ ఊదరగొట్టావు అంతేకానీ పూబాలల తల ఊపుల గురించి, నునులేత ఆకుల మీద నుంచి జారే మంచుబిందువుల గురించి రాయలేదేం? కనీసం నా గులాబీ పరిమళాలను కూడా పట్టించుకోలేదు. పోనీ గడ్డిపూవులోని అమాయకపు అందం గురించైనా రాయాలి కదా! ప్రకృతి పలవరింతలేని కవిత్వమూ ఓ కవిత్వమేనా?’ అంటూ వాయించేసింది.

సూరిబాబుకు ఏం మాట్లాడాలో పాలు పోలేదు. గులాబీ ఇంకా కేకలేస్తూనే ఉన్నా, ఆ కేకలు కాస్తా తిట్లుగా మారినా… మొహం ఎర్రగా చేసుకుని పక్కనుంచి జారుకున్నాడు.

‘బహశా ఇదంతా భ్రమే అయి ఉంటుంది. లేకపోతే గులాబీ మాట్లాడటం ఏంటి? నా నాన్‌ సెన్స్‌’ అనుకున్నాడు సూరిబాబు. క్రమంగా ఆ తిట్ల నుంచి కోలుకుని, అడుగు ముందుకేశాడు. చల్లగాలి తగులుతోంది. గుండెవేగం కాస్త నిదానించింది. అడుగులు అసంకల్పితంగా ముందుకు పడుతున్నాయి. ఇంతలో…

‘రేయ్‌ సూరిబాబూ!’ అంటూ ఇంకో పిలుపు.

చెట్ల వంక చూశాడు. అనుమానం కలగలేదు. మబ్బులతో సహా ఎన్ని దిక్కులు చూస్తున్నా గొంతు ఎక్కడిదో తట్టలేదు. ఇంతలో ‘ఓయ్‌ సూరిబాబూ నిన్నే!’ అంటూ ఓ క్యారీబ్యాగ్‌  నుంచి మాట వినిపించింది. సగం నేలలో కూలబడి, మిగతా సగం గాలిలో ఎగురుతూ శాపగ్రస్తురాలిలా ఉన్న క్యారీబ్యాగ్‌ మాటలు మొదలుపెట్టింది.

‘నీ దుంపతెగ. నీ కంటి ముందు ఎంత వినాశనం జరుగుతోందో చూశావా. నేను ఈ నేలలో కలవడానికి ఎన్ని వందల ఏళ్లు పడుతుందో తెలుసా! భూగోళం మండిపోతోంది. గాలి ఉడికిపోతోంది. ఇదంతా నీకు పట్టిందా. ఏదో గుబులంటావు, భయం అంటావు కానీ నీ ఇంటి బయటి భాగోతం గురించి రాయలేకపోయావే! కాలుష్యం గురించి రాయకపోతే మానే. కనీసం అవినీతి గురించీ, అన్యాయాలకీ వ్యతిరేకంగా నీ కలం ధిక్కార స్వరం కావాలి కదా. సమాజం కోసం రాయని నీ కలం పూచికపుల్లతో సమానం సూరిబాబోయ్‌’ అని వాయించేసింది క్యారీబ్యాగ్‌. ఆ మాటలు పూర్తయ్యేసరికి దుమ్ముకొట్టుకుపోయిన ప్లాస్టిక్‌ కవర్‌ లా మారిపోయింద సూరిబాబు మనసు.

సిగ్గుతో చివుకుపోయిన మొహంతో ముందుకు కదిలాడు. ‘అంతా భ్రమే’ అంటూ తారకమంత్రంలాగా పదేపదే సర్దిచెప్పుకుంటూ ముందుకు సాగాడు. ఎదురుగా తను చదువుకున్న కాలేజీ కనిపించింది. విశాలమైన కాలేజీ, చుట్టూ వేల చేతులను తడిమిన గోడలు.

‘ఏం సూరిబాబూ మొత్తానికి కవి అయ్యావుగా!’ అంటూ వినిపించింది.

అనుమానం లేదు. ఇప్పుడు కాలేజే మాట్లాడుతోంది. తనకు చదువు చెప్పిన కాలేజీ గుర్తుంచుకుని పలకరిస్తోంది. అందుకని ఒకింత గర్వంగా తలెత్తి చూశాడు.

‘నువ్వు కాలేజీ గోడల మీద బొగ్గుతో పిచ్చి రాతలు రాసినప్పుడే ఇలాంటి పేదో చేస్తావని అనుకున్నా. కానీ ఇలా పరువు తీస్తావనుకోలేదు’ కోపంగా కసిరింది కాలేజి శిఖరం.

‘నేనేం తప్పు చేశాను’ ఉక్రోషంగా అడిగాడు సూరిబాబు.

‘ఇంకా అడుగుతున్నావా! అసలు ఆ వాక్యాలేంటి. ఆ పదప్రయోగాలేంటి. మధ్యమధ్యలో బడు లాంటి శబ్దాలేంటి. భాష అంటే కొంచెమన్నా భయంభక్తీ ఉన్నాయా…’ అంటూ లెక్చర్ దంచింది.

కాలేజ్‌ బెల్‌ మోగాక పరుగుతీసే కుర్రాడిలా అక్కడి నుంచి జారుకున్నాడు సూరిబాబు. కాస్త దూరంలో పాలకేంద్రం కనిపించింది.

ఎలాగూ ఇక్కడిదాకా వచ్చాను కదా… ఓ పాల ప్యాకెట్‌ పట్టుకుపోదాం అనుకుని కౌంటర్‌ ముందు నిలబడ్డాడు. ఏదో అనుమానం. ఎవరో తనని తీక్షణంగా చూస్తున్న అయోమయం. నిజమే. పక్కనే కొట్టంలోంచి గేదె తనని అదేపనిగా చూస్తోంది. ‘ఇంత బతుకూ బతికి దీని చేతిలో కూడా తిట్లు తినాలా’ అనుకుంటూ పక్కకి ఒరిగి నిలబడ్డాడు. అయినా దాని గొణుగుడు వినిపించకపోలేదు.

‘ఏదో గుమాస్తా ఉద్యోగం చేస్తున్నావు. మూడు పూటలకి సరిపడా నాలుగురాళ్లు పోగేస్తున్నావులే అనుకున్నా. ఈ రాతలేంటి సూరిబాబూ. నీ కవిత్వాన్ని కౌంటర్‌లో పెడితే పాలచుక్క కూడా రాదు. పాలవాడూ, పేపర్‌ వాడూ నీ క్రియేటివిటీ చూసి అరువిస్తారా. పిల్లల బాధ్యత చూసుకోవడానికి నీ రాతలేమన్నా దస్తావేజులా? ఏం తమాషాగా ఉందా! నాకున్న బాధ్యత కూడా నీకు లేదా!’ అంటూ తోకని కొరడాగా మార్చి ఒక్కటి జాడించింది.

ఆ దెబ్బకి అవమానపడి, తన మీద తనకే అసహ్యం వేసి ముందుకు కదిలాడు సూరిబాబు. తెలియకుండానే రైలు పట్టాల దగ్గరకు చేరుకున్నాడు. వాటిని చూసేసరికి ఎందుకో దుఃఖం ముంచుకొచ్చింది. చిన్నప్పటి నుంచీ తను పడ్డ కష్టాలు, మధ్యమధ్యలో రచయితగా నిలదొక్కుకోవడానికి చేసిన ప్రయత్నాలు… అన్నీ గుర్తుకొచ్చాయి. కన్నీటి చారతో పట్టాలు అస్పష్టంగా కనిపించాయి.

‘రేయ్‌ వెనక్కి పోరా నాయనా’ అంటూ కసిరాయి రైలు పట్టాలు. ‘అసలే పాసింజర్ బండి వచ్చే టైమైంది. పొరపాటున ఇక్కడ ఏమన్నా జరిగితే నాకు లేనిపోని అపనింద. నీ రాతలు కనీసం బతికే ధైర్యాన్ని కూడా ఇవ్వలేదని చుట్టుపక్కల జనం అంతా ఈసడించుకుంటారు. ఓ చిన్న బాక్స్‌ ఐటమ్‌ తో నీ బతుకు ముగిసిపోతుంది. ఆ తర్వాత నీ మీద ఆధారపడినవాళ్లంతా ఏడవాల్సిందే. ఇప్పుడీ హడావుడి అవసరమా. పోరా నాయనా’ అంటూ కూతపెట్టాయి.

సూరిబాబు మనసు బొగ్గునిప్పులా భగ్గుమని వెలిగి చల్లారిపోయింది. చకచకా ఇంటి ముఖం పట్టాడు. దారిలో పాలకేంద్రం, కాలేజీ శిఖరం, క్యారీబ్యాగులూ, పచ్చని మొక్కలూ వినిపిస్తున్న రొదకు పిచ్చెత్తిపోతూ పరుగుపరుగున తన ఇంటి ముందుకు చేరుకున్నాడు.

‘అలా రా దారికి!’ అంది ఇంటిగుమ్మం. ‘బుద్ధిగా ఆఫీస్‌ ఫైళ్లని నమ్ముకో. మిగతా పుస్తకాలన్నీ కాటాకి వేసేయ్‌. పొద్దున్నే తలదువ్వుకుని బస్సులో కూర్చో. సాయంత్రం ఇంటికి వచ్చేటప్పుడు పకోడీలు తెచ్చుకో. మరీ రచయితగా గుర్తింపు కావాలంటే కోటరీ పెంచుకో. కానీ రాతల అవసరమే లేదబ్బా! అలా కాకుండా నీ మానాన నువ్వు రాసుకుంటూ పోతే… అందరి మధ్యా అనాథవైపోతావ్‌. రేపటి నుంచి ఆఫీసుకు వెళ్దూగాని. త్వరగా తినేసి పడుకో!’ అంటూ లోపలికి ఆహ్వానించింది.

సూరిబాబు నీరసించిపోయాడు. ఆఫీసర్ల తిట్లూ, అప్పులవాళ్ల ఫోన్లు, పక్కింటి వాళ్లతో గొడవలూ… వీటన్నింటికంటే నిజమో కాదో తెలియని ఇప్పటి మాటలకు డీలాపడిపోయాడు. ఆ రాత్రి ఎంతలా దొర్లినా నిద్రపట్టలేదు. ఉదయం అలారం మోగక ముందే లేచి దాన్ని ఆపేశాడు. ‘దయచేసి ఇంకో వారం సిక్‌ లీవ్‌ మంజూరు చేయగలరు. ఆరోగ్యం ఇంకో కుదుటపడలేదు’ అంటూ ఆఫీసరుకు మెసేజ్‌ చేసి పుస్తకమూ, పెన్నూ చేతిలోకి తీసుకున్నాడు. ఈసారి తను ఇంకా ఏమేం వినాల్సి వస్తుందో!




 

నా 27వ కథ… ఊర్మిళ సిండ్రోమ్

 

శూన్యం… దాన్ని గమనిస్తున్నవాడికి కూడా తనది బతుకో కాదో తెలియనంతంగా కమ్ముకున్న నిశబ్దం. ఇంతలో… అకస్మాత్తుగా మెలకువ వచ్చింది. కళ్లు, వెలుతురుకు అలవాటుపడుతూనే, చుట్టూ ఉన్న వస్తువులను గుర్తుపట్టడం మొదలుపెట్టాయి. తను మంచం మీద ఉన్నాడు. పక్కనే మానిటర్లు కనిపిస్తున్నాయి. మెలకువ రాగానే అవన్నీ ఒక్కసారిగా బీప్‌బీప్‌ మంటూ పిచుకల్లాగా అరవడం మొదలుపెట్టాయి. ఆ వెంటనే ఓ నలుగరు నర్సులు… ఇద్దరు డాక్టర్లు పరుగెత్తుకుంటూ వస్తారని ఎదురు చూశాడు. ఒకప్పుడు తను సినిమాల్లో చూసింది అలాంటి సన్నివేశాలే కదా! కానీ… అందుకు విరుద్ధంగా ఓ కుర్ర డాక్టరు యథాలాపంగా లోపలికి వచ్చాడు. మానిటర్‌ వంక తాపీగా చూసి… మంచానికి తగిలించి ఉన్న కేస్‌షీట్‌లో ఏదో రాసుకుంటూ ఉండిపోయాడు. కాసేపటికి నడుముకి ఉన్న వాకీటాకీని తీసి… ‘పేషెంట్‌ రెడీ ఫర్‌ డెలివరీ’ అని ఎవరికో చెప్పాడు.

అంతా అయోమయంగా ఉంది. తను ఫలానా పేరు ఉన్న మనిషిని అన్న స్పృహ వచ్చింది. తన ఉద్యోగ బాధ్యతలు, భార్య రూపం అన్నీ ఒక్కసారిగా స్ఫురించాయి. కానీ వేళ్ల దగ్గర నరికేసిన చెట్టులా… తను ఇక్కడికి రాక ముందు జరిగిన సంగతులేవీ గుర్తుకురావడం లేదు. ఈ అయోమయం మధ్య డాక్టరు తీరు ఒకటి! చాలా రోజుల తర్వాత కనిపించిన వెలుతురుకంటే ఈ డాక్టర్‌ ప్రవర్తనే గమ్మత్తుగా ఉంది. అయినా ఉండబట్టలేక ‘నాకేం అయింది’ అంటూ బలవంతంగా ఓ రెండు ముక్కలు అడిగాడు.

‘మీరు ఊర్మిళ సిండ్రోమ్‌ బారిన పడ్డారు. దాని బారిన పడ్డ వాళ్లు, నాలుగేళ్ల నుంచి ఏడేళ్ల వరకు కోమాలోకి వెళ్లిపోతారు. స్పృహలోకి వచ్చాక మళ్లీ మామూలు మనిషి కావడానికి ఇంకొన్ని రోజులు పడుతుంది. అంతవరకు మిమ్మల్ని చూసుకునే వెసులుబాటు మాకు లేదు. వేరే పేషెంట్లు ట్రీట్‌మెంట్‌ కోసం సిద్ధంగా ఉన్నారు. మీరిక ఇంటికి వెళ్లక తప్పదు’ అంటూ తరుచుగా చెప్పే పాఠాన్ని వల్లించేశాడు కుర్ర డాక్టరు. ఈలోగా ఓ వీల్‌చైర్‌ తోసుకుంటూ కొంతమంది వచ్చేశారు. తనను అందులో కూర్చోబెట్టి, ఓ వ్యాన్‌లోకి ఎక్కించేచారు. అందులో తనలానే ఇంకో పదిమంది ఉన్నారు. తెల్లటి బట్టలు, అంతే తెల్లగా పాలిపోయిన మొహాలు…. పాత శరీరంతో కొత్త లోకంలోకి వస్తున్న అయోమయం!

వ్యాన్ ఓ పదినిమిషాలు నడిచాక… టైర్ల కింద గతుకులు మొదలయ్యాయి. వాటిని తట్టుకునేందుకు పళ్లు బిగపెడుతున్న అతనికి ఏదో స్ఫురించింది. తన ఇల్లు దగ్గరకు వచ్చిన్నట్టుంది. అది ఇంటికి వెళ్లే దారిలాగానే ఉంది. హైవే నుంచి రెండు కిలోమీటర్ల లోపలకి ఉంటుంది తన ఇల్లు. ఏరికోరి కొనుక్కున్నాడు. కానీ ఎంతకీ రోడ్డు పడలేదు. ‘రోడ్డు రోడ్డూ ఎందుకు పడవు’ అంటే ఏడేడు లోకాల్లో ఉన్న సాంకేతిక కారణాలన్నీ వినిపించేవి. చివరికి ఆరేళ్ల తర్వాత… ఓ ఎలక్షన్ల సందర్భంగా రోడ్డు పడింది. మొదటి రోజు ఆ కొత్త రోడ్డు మీద ప్రయాణం చేస్తున్నప్పుడు ఎంత సంతోషం కలిగిందో! ‘ఈ బతుక్కి ఇంతకంటే ఏం కావాలి!’ అన్నంత తృప్తిగా తోచింది. కానీ ఓ నెలరోజుల్లోనే తలా ఓ రంగు కేబుళ్ల కోసం… తలా ఓ డిపార్టుమెంటు తవ్విపారేసింది. మళ్లీ కంకర తేలింది.

‘మీ ఇల్లు వచ్చింది’ అంటూ ఎవరో భుజాన్ని ముందుకు తోశారు. వ్యాన్‌ తలుపులు తెరుచుకున్నాయి. బేడీలు లేని ఖైదీలాగా అందులోంచి కాలు కింద పెట్టాడు. రోడ్డు మారలేదు. కానీ వీధిలో ఇళ్లు అన్నీ మారిపోయాయి. చాలావాటికి కిటికీలు లేవు. ఉన్న కిటికీలను కూడా తెరవడానికి వీల్లేకుండా, అడ్డంగా చెక్కలు కొట్టేశారు. ప్రతి ఇంటి పైనా… ఓ పొగగొట్టం మాత్రం కనిపిస్తోంది. ఎదురుగా ఉన్న తన ఇంటికీ అలాంటి మార్పే.

తన ఇంటివైపు ఒకో అడుగే నిదానంగా, బలహీనంగా అడుగులు వేస్తుండగా ‘తొందరగా రండి’ అంటూ తలుపు దగ్గర నుంచి అరుపు వినిపించింది. ఆ పిలుస్తున్న మనిషి, తన భార్యే అని పోల్చుకోవడానికి మెదడు తడబడింది. ఓ నాలుగేళ్లలోనే మనిషి ఎంతలా మారిపోయింది. వేరే తరంలోకి అడుగుపెట్టినంతగా వయసు పైబడిపోయింది. అన్నింటికీ మించి తను తిరిగి వచ్చాడన్న సంతోషం లేశమైనా లేదు. పైగా ఏదో కలవరం!

భార్యను దాటుకుని ఇంట్లోకి అడుగుపెడుతుంటే… అది తన ఇల్లే అని శరీరంలో అణువణువునా పేరుకుపోయిన అలవాటు చెబుతోంది. కానీ ఎందుకో నమ్మబుద్ధి కావడం లేదు. గోడలు పొగచూరుకుపోయి ఉన్నాయి. వాటి మీద ఒక్క ఫొటో కూడా లేదు. ఎదురుగుండా ఉన్న తన పుస్తకాల బీరువా ఖాళీగా ఉంది. దశాబ్దాల తరబడి తనకి ఇష్టమై.. ఒక్కొక్కటిగా సేకరించిన వందల పుస్తకాల్లో ఏదీ అక్కడ లేదు.

‘లోపలికి వెళ్లి స్నానం చేసి రండి’ అంటూ టవల్‌ చేతిలో పెట్టింది భార్య. యాంత్రికంగా తనకు తెలిసిన దోవ వైపు నడిచాడు. బీరువాలో తన బట్టలు అలాగే ఉన్నాయి. అద్దంలో తన రూపమూ పెద్దగా మారలేదు. ఆ రెండూ చూసుకుని డైనింగ్‌ టేబుల్‌ ముందు కూలబడ్డాడు. టీ కప్పుతో వచ్చిన భార్యను చూసి కోపం, జాలి ఒకేసారి కలిగాయి. పరామర్శగా ఒక్క మాట కూడా అనదేం? అయినా ఈ మనిషేమిటి ఇంతలా మారిపోయింది! చివరికి ఇక తనే ఏదో మాట్లాడాలని నిశ్చయించుకున్నాడు.

‘గోడలేంటి అలా మసిబారిపోయి ఉన్నాయి. ఇంటింటికీ ఆ గొట్టాలెందుకు’ అంటూ సంభాషణ మొదలుపెట్టాడు.

‘పొల్యూషన్‌. బయట పొల్యూషన్‌ ఎక్కువైపోయింది. దాంతో గోడలన్నీ పొగచూరిపోయాయి. కిటికీలు తీసినా ప్రమాదమే. ఇప్పటికే అందరి ఊపిరీ ఆ కాలుష్యంతో నిండిపోయింది’ వంటింట్లో పని చేస్తూనే చెప్పుకొచ్చింది. భార్య. ఎందుకో ఆమె గొంతు కూడా బాగా పాడైపోయింది. ఎవరన్నా వింటారేమో, ఏమన్నా అంటారేమో అన్నట్టు… సన్నగా వణుకుతూ మాట్లాడుతోంది.

‘మరి పుస్తకాలు! నాకు ఊహ తెలిసినప్పటి నుంచి పోగేసుకుంటూ వచ్చిన పుస్తకాలవి. వాటిని ఎక్కడ పెట్టారు’ కాస్త కటువుగానే అడిగాడు.

‘అదేంటీ మీకు గుర్తులేదా!’ వంటింట్లోంచి ఆశ్చర్యంగా తొంగిచూస్తూ అడిగింది. ఆపై గుర్తుచేస్తున్నట్టు ‘మీరే వాటిని… మీ చేతులతో కుప్పపోసి తగటబెట్టేశారు’ అని చెప్పుకొచ్చింది.

అతనికి నోట మాట రాలేదు. ‘అసంభవం! అవంటే నాకు ప్రాణం. వాటినెందుకు తగలబెట్టుకుంటాను. నాకేమన్నా పిచ్చా!’ బలహీనతతో, రోషంతో ఒళ్లంతా చెమటలు పడుతుండగా అడిగాడు.

‘మీకు పుస్తకాలంటే ప్రాణమే. మొదట్లో అందరూ ఎగతాళి చేసేవాళ్లు. పుస్తకాలు కూడు పెడతాయా, కొనుక్కుని ఎవరన్నా పుస్తకాలు చదువుతారా… అంటూ రకరకాలుగా అనేవాళ్లు. కానీ ఎందుకో రోజురోజుకీ, మాటలకు మించిన అసహనం మొదలైంది. భక్తి పుస్తకం కనిపిస్తే కొంతమందికి నచ్చేది కాదు. హేతువాదం కనిపిస్తే కొందరు సహించేవాళ్లు కాదు. ప్రతి పుస్తకం ఎవరో ఒకరిలో ద్వేషం కలిగించేది. మిమ్మల్ని నానా మాటలూ అనేవాళ్లు. చివరికి మీరు విసిగిపోయారు. వాటిని ఎవరికైనా ఇచ్చేయాలనుకున్నారు. కానీ ఎవరూ ముందుకు రాలేదు. పాతపేపర్ల వాడు కూడా పుస్తకాలని ముట్టుకునేందుకు భయపడ్డాడు. చివరికి ఓ రోజు కుప్పగా పోసి కాల్చేశారు’ చెప్పుకొచ్చింది.

అతనిలో ఏదో జుగుప్స మొదలైంది. అది తనమీదో, మరొకరి మీదో తెలియలేదు. బీరువా వంక చూస్తూ ఉండిపోయాడు. అక్కడ ఖాళీ అయిన బరువు తన మనసులోకి చేరినట్టుగా ఊపిరి భారమైంది. ఈలోగా భార్య లోపలి నుంచి ఒక రంగురంగుల గౌన్ తీసుకువచ్చింది.

‘మీరు ఊర్మిళా సిండ్రోమ్‌ నుంచి బయటపడ్డారు కాబట్టి, ప్రభుత్వం నుంచి వస్తున్న ఊర్మిళా పెన్షన్‌ ఇక రాదు. రేపు మీ పాత ఆఫీసుకు వెళ్లి రిపోర్టు చేయాల్సిందే. మీ మానసిక స్థితి సరిగ్గా ఉందనిపిస్తే ఉద్యోగంలో చేర్చుకుంటారు. లేకపోతే లేదు. అదే కనుక జరిగితే కొత్త ఉద్యోగం వెతుక్కోవాలిక. సిండ్రోమ్‌ నుంచి బయటపడిన వాళ్లకి అంత తేలికగా ఉద్యోగాలు దొరకవు’ చివరి వాక్యాలకి వచ్చేసరికి ఆమె గొంతు మరింతగా వణికింది. ఆమె చేతిలో ఉన్న రంగురంగుల గౌన్‌ వంకే చూస్తుండిపోయాడు.

‘తెలుపు, నీలం, ఆకుపచ్చ, కాషాయం… మీరు ఏ రంగు బట్టలు వేసుకున్నా… ఏదో ఒక వర్గానికి అనుకూలంగా భావిస్తారు. అందుకే అన్ని రంగులూ కలిపి ఈ గౌన్‌ కుట్టి ఉంచాను. రేపు దీన్ని వేసుకుని వెళ్లండి.’ అంటూ ఓసారి ఆ గౌన్‌ను అతని కళ్ల ముందు ఆడించి, లోపలికి తీసుకువెళ్లిపోయింది. ఆమె వెళ్లినవైపే చేస్తుండిపోయాడు. ఇంతలో ఒక్కసారిగా తన కూతురు గుర్తుకువచ్చింది. అప్పటివరకూ ఆమె గురించి అడగలేదనే గిల్టీనెస్‌తో ఒక్కసారిగా గొంతుక పెంచి ‘అవునూ అమ్మాయి కనిపించడం లేదు. ఎక్కడికి వెళ్లింది. ఎలా ఉంది. ఏం చేస్తోంది…’ అంటూ హడావుడిగా ప్రశ్నలు గుప్పించాడు.

‘అది టీచర్‌గా పనిచేస్తోంది. ఇంకో గంటలో వచ్చేస్తుంది!’ అని ముక్తసరిగా బదులిచ్చింది భార్య.

అప్పుడే పిల్ల చదువు పూర్తయిపోయిందన్నమాట. సంతోషమే. ఉద్యోగం కూడా చేస్తోంది. మరీ మంచిది. ఈ హడావుడి సద్దుమణిగాక తన పెళ్లి గురించి ఆలోచించాలి… అనుకుంటూనే మరోసారి ఇల్లంతా కలియచూశాడు. గోడలు పొగచూరిపోయి ఉన్నాయి. కాలమేదో పిచ్చి గీతలు గీసినట్టు కొన్ని చోట్ల చెమ్మతో వింత ఆకారాలు ఏర్పడ్డాయి. తన ఒంట్లో నుంచే వస్తున్నంత ఘాటుగా ముక్క వాసన. ఆ ఇల్లు వదిలి దూరంగా పారిపోవాలన్నంత ఉద్విగ్నత కలుగుతోంది. కొత్త కదా! ఆ వాతావరణం నిదానంగా అలవాటు అవుతుందేమో. ఆ ఇంటిని, తనతో ముడిపెట్టుకుంటూ నిదానంగా మగతలోకి జారిపోయాడు. డైనింగ్‌ టేబుల్‌ మీదే ఒరిగిపోయాడు.

***

ఏవో గుసగుసలు వినిపిస్తున్నాయి. మొదట్లో అవి కలలోనేమో అనుకున్నాడు. బయటనుంచే అనే మెలకువ రావడంతో… మత్తుగా లేచి చూశాడు. ఎదురుగుండా ఓ పాతికేళ్ల అమ్మాయి. భార్యతో ఏదో మాట్లాడుతోంది. అతనిలో వచ్చిన కదలికను గమనించిన భార్య ‘ఇదిగో అమ్మాయి వచ్చింది’ అంటూ తండ్రికి కూతురును పరిచయం చేసింది. అతన్ని చూసిన కూతురులో ఎలాంటి సంతోషమూ కనిపించలేదు. ఆ మాటకి వస్తే అసలు ఏ భావమూ లేదు. మరీ విచిత్రం… ఆమె కళ్లు గాజుగోలీల్లాగా నిశ్చలంగా ఉన్నాయి. తను ఎటన్నా చూడాలంటే తల మొత్తం కదులుతోంది.

ఒకప్పుడు ఆ అమ్మాయి ఎలా ఉండేది! నవ్వుతూ, తుళ్లుతూ, ఏడిపిస్తూ… కొమ్మ నుంచి కొమ్మకు గెంతే పాలపిట్టలా ఉండేది. అలాంటి తనకి ఏమైంది. ఎందుకో ఆ పిల్లని చూస్తే అతనికి భయం వేసింది. శరీరభాగాలన్నీ కలిపి కుట్టిన ఫ్రాంకన్‌స్టైన్‌ పాత్ర గుర్తుకువచ్చింది. ఆమె తనను దాటుకుని లోపలికి వెళ్తుంటే, అప్రయత్నంగా వెనక్కి జరిగి, కుర్చీలో మరింతగా ఒదిగిపోయాడు.

కిటికీ అద్దాలలోంచి, వంటింటి పొగగొట్టంలోంచి వస్తున్న వెలుగు తగ్గిపోయి… చీకటి పడిన సూచన వచ్చింది. ఆ మసకలో ఇల్లు మరింత పాడుబడినట్టు కనిపించింది. తన కలల సౌధం, రోజూ అలసిన రెక్కలను సేదతీర్చుకునేందుకు ఏర్పరుచుకున్న గూడు… తగలబెట్టేసిన పుస్తకాల్లాగే మసిబారిపోయి ఉంది.

‘చూడండీ… రేపు అమ్మాయి మిమ్మల్ని మీ ఆఫీసుకు తీసుకువెళ్తుంది. జాగ్రత్త. దారిలో తలవంచుకునే ఉండండి. ఎవరితోనూ ఏం మాట్లాడవద్దు. ఎవరిని కదిపినా… లెఫ్ట్‌, రైట్‌… ఏదో ఒకవైపు నడవమని రెచ్చగొడతారు. దేనికీ లోబడకుండా తటస్థంగా ఉంటానంటే కుదరదు. అలాగని మీరు ఏదన్నా ఎంచుకుంటే సమస్య తీరిపోదు. రెండో పక్షానికి శత్రువుగా మారిపోతారు. సూటిపోటి మాటలతో మిమ్మల్ని వేధిస్తారు, అవమానిస్తారు. అందుకనే ఏం మాట్లాడవద్దు. ఆఖరికి మీ చిరునవ్వు, కోపాన్ని బట్టి కూడా మీ అభిప్రాయాన్ని అంచనా వేసే ప్రయత్నం చేస్తారు. గమ్మున ఉండిపోండి’ అంటూ జాగ్రత్తలు చెప్పింది భార్య. అప్పుడు అర్థమైంది కూతురు అలా ఎందుకు మారిపోయిందో! తను నిశ్చలత్వానికి అలవాటు పడిపోయినట్టుంది. రుషులకు స్థితప్రజ్ఞత వస్తుందంటారు. బండబారిపోయినా… అలాంటి స్థితి వస్తుందేమో!

ఇంతలో భార్య ఓ ఫైల్‌ తీసుకుని అతని దగ్గరకు వచ్చింది. ‘రేపు మీరు తీసుకువెళ్లాల్సిన డాక్యుమెంట్స్ ఇవి. ఓసారి చూసుకోండి’ అని దాన్ని అతని చేతిలో పెట్టింది. ఫైల్‌ తెరిచి ఉలిక్కిపడ్డాడు. AP16AW3522. ఆ సర్టిఫికెట్లలో, తన పేరు ఉండాల్సిన స్థానంలో బండి నెంబరు ఉంది. ‘ఏంటిది’ ఏడుపుగొంతుతో అడిగాడు. తన గొంతు కూడా నీరసంగా, వణుకుడుగా మారిపోవడాన్ని అతను గమనించకపోలేదు.

‘మీరు కోమాలో ఉండగా మన పేర్లన్నీ మార్చేసుకున్నాం. ఇలా ఏవో తోచిన నెంబర్లే పేరుగా పెట్టించాం. అప్పుడిక పేరుని బట్టి మీ కులం, ప్రాంతం అంచనా వేసే అవకాశం ఉండదు కదా. ఏ రిస్కూ ఉండదు’ నిదానంగా చెప్పింది భార్య. ఇంతకీ తన పేరు ఏమని మార్చుకుందో! ఆ ఆలోచనకి నవ్వు, ఏడుపు రెండూ ఒకేసారి వచ్చాయి. ఆమె పేరును అడగబుద్ధి కూడా కాలేదు. ఏ ఇంటి నెంబరునో తన పేరుగా మార్చుకుని ఉంటుంది. భార్యాపిల్లల పేర్లు ఇప్పుడు కొత్తగా తెలుసుకోవాలి.

రాత్రి చిక్కబడింది. మసిగోడల మీద నల్లగా ప్రసరిస్తున్న ట్యూబ్‌లైట్‌ వెలుగే దిక్కయింది. జావ తాగి మంచం మీదకు చేరుకున్నాడు. ఎవరో గొంతు నొక్కేస్తున్నట్టుగా, కీచుమని గోలపెడుతూ ఫ్యాన్ తిరుగుతోంది. ‘అన్నట్టు ఇవాళే పేపర్లో చదివాను. ఊర్మిళా సిండ్రోమ్‌ ఎందుకు వస్తోందో కనిపెట్టారట’ మంచం మీద సర్దుకుంటూ చెప్పింది భార్య.

‘ఎందుకో!’ అడిగాడు తను. కానీ ఎక్కడో… ఆ కారణం తనకు ముందే తెలుసు అన్న ఫీలింగ్‌.

‘జీవించాలనే ఆశ పూర్తిగా తగ్గిపోయిన వాళ్లలో ఇది కనిపిస్తోందట. రోజురోజుకీ దాని బారిన పడే వాళ్ల సంఖ్య పెరిగిపోతోందట’ ఆందోళనగా చెప్పుకొచ్చింది భార్య. అయితే తన అంచనా నిజమే!

క్షణాలు గడిచేకొద్దీ నిద్రో, మైకమో తెలియని మత్తు కమ్ముకురావడం మొదలుపెట్టింది. మిగిలిన కాస్త మెలకువలో సంధిప్రేలాపనలా ఓ ప్రశ్న అడిగాడు. ‘అవునూ! మన హాల్లో మేకులన్నీ అలా ఖాళీగా ఉన్నాయే. ఒక్క ఫోటో కూడా లేదు ఎందుకని?’

ఆ ప్రశ్నకు జవాబుగా ముందు ఓ నిట్టూర్పు వినిపిచింది. తర్వాత ఇక తప్పదన్నట్టు ‘ఏ ఫోటో తగిలించమంటారు! నవ్వుతూ ఉన్న పాత ఫోటోలు పెడితే, గతం గుర్తుకువచ్చి బాధ కలుగుతుంది. ఇప్పటి ఫోటోలు తగిలిద్దామంటే… మన మొహాలలో బతికి ఉన్న కళ కొంచెమైనా లేదు కదా! వాటిని గోడకి తగిలించి చూసుకునే ధైర్యం ఎక్కడిది…’

తను ఏదో చెబుతోంది. అతను నిదానంగా మగతలోకి జారుకుంటున్నాడు. మళ్లీ లేవాలన్న ఆశ కూడా లేకపోయింది!

https://magazine.saarangabooks.com/%e0%b0%8a%e0%b0%b0%e0%b1%8d%e0%b0%ae%e0%b0%bf%e0%b0%b3-%e0%b0%b8%e0%b0%bf%e0%b0%82%e0%b0%a1%e0%b1%8d%e0%b0%b0%e0%b1%8b%e0%b0%ae%e0%b1%8d%e2%80%8c/?fbclid=IwAR1yNWbmGMRkvSfzWHYE2SZQNNBhkcLhHZ5I6Ue8tnBcPauTEqIxt9WrF4k

నా 26వ కథ… 50 అంగుళాల జీవితం





 

16, డిసెంబర్ 2019, సోమవారం

29, ఏప్రిల్ 2019, సోమవారం

14, డిసెంబర్ 2018, శుక్రవారం

17, జులై 2018, మంగళవారం

20, మే 2018, ఆదివారం

నా 21వ కథ వ్యాపకం

వ్యాపకం

డిసెంబర్ 2017

BB.R.Cell Point… ఆ బోర్డుని చూడగానే ప్రసాద్‌ అడుగులు నెమ్మదించాయి. నుదుటికి పట్టిన చెమటని తుడుచుకుంటూ అటువైపు నడవటం మొదలుపెట్టాడు. ఈ పూట తను తిరిగిన సెల్‌ఫోన్‌ షాపుల్లో అది పదవదో, పన్నెండవదో అయి ఉంటుంది. ఇక్కడైనా తన సమస్యకి పరిష్కారం దొరుకుతుందో లేదో తెలియదు. దొరకదు అని విచక్షణ చెబుతోంది. దొరుకుతుందేమో అన్న ఆశ, విచక్షణకి అడ్డుపడుతోంది. ప్రసాద్‌ షాప్‌ దగ్గరికి చేరుకునేసరికి ఎవరెవరో నిల్చొని ఉన్నారు. వాళ్లంతా వెళ్లిపోయేదాకా ఓపికపట్టాడు. ఈలోగా, షాపునిండా వేళ్లాడదీసి ఉన్న ఫోన్ కవర్లూ, మెమరీ కార్డులూ, సెల్‌ఫోన్‌ డొప్పలని చూస్తూ నిల్చొన్నాడు. తన దగ్గర ఉన్న ఫోన్‌లో ఎలాంటి సౌకర్యాలు ఉన్నాయి? దాన్ని ఎలా అలంకరించాలి? అన్న బాదరబందీ ఎప్పుడూ ప్రసాద్‌కి లేకపోయింది. తన ఫోన్‌తో అతనికి ఉన్న అనుబంధం వేరు. ఇప్పుడు తనకి వచ్చిన సమస్యా వేరు!
“చెప్పండి!” అన్నాడు షాపతను ఒకింత చిరునవ్వుతో ప్రసాద్‌ వంక చూస్తూ.
ప్రసాద్‌, నిదానంగా తన జేబులోంచి ఒక మాసిపోయిన ఫోన్‌ని బయటకు తీశాడు, ‘ఇందులో బాల్ ఫాల్‌ అనే గేమ్ ఉంది’ అని చెబుతుండగానే షాపతను చనువుగా ఆ ఫోన్‌ని చేతిలోకి తీసుకుని అందులో ఆప్షన్లన్నీ చకచకా చూసేసి “అవును! బాగానే పనిచేస్తోందిగా,” అనేశాడు.
“అది కాదు! మొన్న ఒకసారి అనుకోకుండా రెస్టోర్‌ ఫ్యాక్టరీ సెట్టింగ్స్‌ అన్న ఆప్షన్‌ నొక్కాను. దాంతో ఇంతవరకూ బాల్‌ ఫాల్‌ గేమ్‌లో నేను చేసిన స్కోర్లన్నీ పోయాయి,” ఆ విషయాన్ని ఎంత నిదానంగా చెబుదామన్నా అతని శ్వాస ఎగిసిపడుతోంది. కళ్లు మసకబారుతున్నాయి.
అప్పటివరకూ ఫోన్లో ఆప్షన్లన్నీ ఎడాపెడా నొక్కుతున్న షాపతను ఒక్కసారిగా తలెత్తి చూశాడు. గేమ్‌లో స్కోర్లు పోయాయని బాధపడుతున్న సదరు కస్టమరు చిన్నపిల్లవాడేం కాదు. కుర్రవాడు అంతకన్నా కాదు. నుదుటినుంచి చెంపల దాకా జుత్తు నెరిసిన యాభై ఏళ్ల పెద్దాయన. వెన్ను వంగిపోయి, భుజాలు జారిపోయిన పెద్దమనిషి. షాపతనికి అర్థమైపోయింది…వచ్చినవాడు రోజువారీ కస్టమరు కాదని! తన చిన్నపాటి జీవితంలో ఇలాంటి చిత్రమైన కస్టమర్లు అరుదుగా తగుల్తారు. ఊళ్లో పదిమందికీ చెప్పుకోవడానికీ, పదికాలాల పాటు నవ్వుకోవడానికీ తగిన సందర్భం ఇది. తనలోని కుతూహలాన్నీ, వెటకారాన్నీ బలవంతంగా అణచుకుంటూ ‘‘మీరు నొక్కిన ఆప్షన్‌ వల్ల టెంపరరీ డేటా అంతా డిలీట్‌ అయిపోయింది సర్‌! అది తిరిగి రావడం కష్టం,’’ అన్నాడు.
“అంటే నేను బాల్ ఫాల్‌లో చేసిన స్కోర్స్‌ తిరిగి కనిపించే అవకాశమే లేదంటారా?” నిరాశగా అడిగాడు ప్రసాద్‌.
“లేదు! అలా డిలీట్ అయిపోయిన డేటాని ఫోరెన్సిక్‌ ల్యాబ్లో తప్ప వేరెవరూ బయటకి తీయలేరు,” అన్నాడు షాపతను. ప్రసాద్‌ని చూడగానే అతనికి ఎందుకో జాలి మొదలైంది.
ప్రసాద్ ఒక్క నిమిషం పాటు ఏమీ మాట్లాడలేదు. తను ఇవాళంతా విన్న ‘కుదరదు’ అన్న జవాబే ఇక్కడా వినిపించింది. కాకపోతే ‘ఫోరెన్సిక్‌ ల్యాబ్‌’ అన్న మాటే కాస్త కొత్త విషయం. సాలోచనగా షాపతని వంక చూస్తూ “ఫోరెన్సిక్‌ ల్యాబ్లో పని జరుగుతుందన్నమాట. అదెక్కడ ఉందో కాస్త చెబుతారా,” అన్నాడు.
ఆ మాటలకి షాపతని మనసులో తెలియని భయం మొదలైంది. మనలోని అమాయకత్వం, అజ్ఞానపు స్థాయిని చేరుకున్నప్పుడు, ఎదుటివారిలో కలిగే భయం అది. దాంతో ప్రసాద్‌ని వదిలించుకోవడానికి కిందకి వంగి ఏదో సర్దుకుంటూ ఉండిపోయాడు షాపతను. ఒక్క క్షణం అతనివంక బేలగా చూసిన ప్రసాద్ బస్టాపు దగ్గరకి కాళ్లీడ్చుకుంటూ బయల్దేరాడు. ఆ సమయానికి వచ్చిన బస్సు ఖాళీగా ఉందా, సౌకర్యంగా ఉందా అని చూసుకోలేదు. వచ్చిన బస్సుని చటుక్కున ఎక్కేసి ఓ మారుమూల సీట్లో కూలబడిపోయాడు. కళ్లు మూసుకున్నాడన్న మాటే కానీ అతని రెప్పల తెర మీద రకరకాల రంగులు. రంగురంగుల బంతులు కిందకి పడుతున్నాయి. ‘బాల్ ఫాల్‌’ ఆటతో తన అనుబంధం అంతా స్ఫురణకు వస్తోంది.
***
          పోయిన ఏడాది క్రిస్‌మస్‌నాటి రోజులివి. వరుసగా సెలవులు రావడంతో, తన భార్య బెంగళూరులో కూతురుకి సాయంగా ఉండేందుకు వెళ్లిపోయింది. ఆ రాత్రి ఏదో రోడ్డు పక్కన తినేసి తన అపార్టుమెంటుకి చేరుకున్నాడు. శనివారం రాత్రి కావడంతో అపార్టుమెంటు పైనుంచి కోలాహలంగా నవ్వులు వినిపిస్తున్నాయి. బహుశా ఏదో మందు పార్టీ పెట్టుకుని ఉంటారు. తనకా మందు తాగే అలవాటు లేదు. అందుకని అలాంటి పార్టీలలోకి వెళ్లి నాలుగు మాటలు కలిపి నాలుగు చుక్కలు పుచ్చుకునే ప్రయత్నం ఎప్పుడూ చేయనే లేదు. ఉండుండి వినిపిస్తున్న నవ్వులకు ఉడుక్కుంటూ టీవీ ఆన్‌ చేసి కూర్చున్నాడు. 200 ఛానళ్లలో ఏ ఒక్కదానిలోనూ తనకు నచ్చిన ప్రోగ్రాం కనిపించలేదు. రిమోట్ నొక్కీ నొక్కీ చిరాకేసిపోయింది.
భార్య లేకపోవడంతో ఇల్లంతా బోసిపోయినట్లుంది. ఏదో తెలియని నిస్తేజం. అలాగని భార్యతో తను ఎన్నడూ సఖ్యంగా ఉన్నది లేదు. రోజంతా సీరియల్స్‌తో గడిపే తన భార్య ప్రవర్తన ప్రసాద్‌కి నచ్చదు. ఎప్పుడూ బుద్ధావతారంలా కూలబడి ఉండే ప్రసాద్‌ నిస్సత్తువ అతని భార్యకీ సయించదు. కుటుంబం అనే బంధం కోసం ఇద్దరూ కలిసి కాపురం చేస్తున్నారంతే! ఇద్దరూ ఒక ఇంట్లో కలిసి ఉండటం అలవాటుగా మారిపోయింది. ఉంటే ముభావంగా ఉండిపోవడం, లేదా వాదులాడుకోవడం…ఈ రెండు పరిస్థితులే వాళ్ల మధ్య ఉంటాయి. తమ మధ్య పుట్టిన కూతురిని కూడా అంతే నిర్లిప్తంగా పెంచి, పెద్ద చేసి, పెళ్లి చేసి పంపారు. తన కూతురు బాగా చదువుకుంటోందా, ఆమెకి మంచి సంబంధం కుదురుతోందా అని చూసుకోవడంతోనే సరిపోయింది ప్రసాద్‌కి. అల్లుడితో కలిసి ఎప్పుడన్నా కూతురు ఇంటికి వస్తే సందడిగానే ఉంటుంది. కానీ, ఆ సందడిలో సంతోషం కనిపించదు. కూతురితో పాటు వచ్చిన అల్లుడు తన హోదాని హుందాగా నిభాయిస్తుంటాడు. అతనికి ఏ లోటూ రాకూడదంటూ కూతురు క్షణక్షణం హెచ్చరిస్తూ ఉంటుంది. ఆ ప్రొటోకాల్స్‌ అంటే చిరాకెత్తిపోయిన ప్రసాద్, వాళ్లున్నప్పడు నక్కినక్కి తిరుగుతూ ఉంటాడు.
అపార్టుమెంటు పై నుంచి ఒక్కసారిగా నవ్వుల తాకిడి పెరిగింది. పార్టీ మంచి రసపట్టుకు చేరుకున్నట్లుంది. నవ్వులు అలలు అలలుగా రగులుతున్నాయి. ప్రసాద్‌ దృష్టి టీపాయ్ మీద ఉన్న ఫోన్‌ మీద పడింది. ఉబుసుపోక దాన్ని చేతిలోకి తీసుకుని ఒక్కో బటన్‌నీ నొక్కడం మొదలుపెట్టాడు. తన దృష్టిలో అదో బేసిక్ ఫోన్‌. కూతురి మాటల్లో అదో డబ్బా ఫోన్. కాలక్షేపంగా దాన్నే పరిశీలించడం మొదలుపెట్టాడు ప్రసాద్‌. అప్పుడు కనిపించింది అతనికి ‘బాల్ ఫాల్‌’ ఆట. గేమ్‌ మొదలుపెట్టగానే రంగురంగుల బంతులు స్క్రీన్‌ మీదకి రావడం మొదలుపెట్టాయి. వాటినేం చేయాలో తెలియలేదు ప్రసాద్‌కి. అటో రెండు బటన్లూ, ఇటో రెండు బటన్లూ నొక్కాడే కానీ, ‘గేమ్ ఓవర్’ అంటూ ఆట ముగిసిపోయింది. అలా ఒకటి రెండుసార్లు జరిగిన తరువాత ఆట ఎలా ఆడాలో కాస్త ఒంటపట్టినట్లే ఉంది. స్క్రీన్‌ నుంచి కిందకి పడే బంతుల్లో ఒకే రంగు ఉన్న బంతులు ఐదింటిని సేకరించి పైకి విసరాలి. అలా ఐదైదు బంతులను పైకి విసరగానే కొన్ని పాయింట్లు వస్తాయి. ఈలోపల బంతులు కాస్తా స్క్రీన్‌ అడుగుకి వచ్చేస్తే ఆట ముగిసిపోతుంది. ఆటైతే ఎక్కువ సేపు సాగలేదు కానీ, అది ఎందుకనో తన జీవితంలోకి ప్రవేశించినట్లు అనిపించింది ప్రసాద్‌కి. ఆ రోజు ఎవరో కొత్త మిత్రుడితో పరిచయం అయినంత తృప్తి కలిగింది. ఆ రాత్రికి సోఫాలోనే గాఢంగా నిద్రపోయాడు.
మర్నాడు అందరిలాగానే తను కూడా పదిన్నర దాటాక ఆఫీసుకి చేరుకున్నాడు. ఆసరికి ఎవరికి వాళ్లు తమ క్యాబిన్లలో సర్దుకుంటున్నారు. ఇప్పుడు తన ఆఫీసులో మనిషి మనిషికీ మధ్య క్యాబిన్‌ గోడలు వెలిశాయి. ఒకో క్యాబిన్లో ఒకో మనిషీ, అతనికెదురుగా ఓ కంప్యూటరూ! ఆ కంప్యూటర్‌ అంటే ఎందుకనో తనకి మొదటినుంచీ చిరాకే. తనది కాని భాగమేదో తన శరీరానికి అతుక్కుపోయిన భావన. కానీ తప్పలేదు! ప్రస్తుతానికి కంప్యూటర్‌ లేనిదే ఆఫీసు పని నడవదు. ఆ పనికి అవసరమయ్యేంత మేరకే కంప్యూటర్‌తో కాపురం చేస్తుంటాడు. అతని అదృష్టమో దురదృష్టమో కానీ నెలకి నలభైవేలు జీతం తీసుకుంటున్నా…చేయాల్సిన పని పెద్దగా ఉండదు. కొత్తగా నేర్చుకోవలసిన విషయాలూ ఉండవు. ఎలాగోలా మరో ఎనిమిదేళ్లు గడిపేస్తే ఈ ఉద్యోగపర్వాన్ని ముగించేయవచ్చు అన్నదే అతని లక్ష్యంగా మిగిలిపోయింది.
ఏడాది చివరి రోజులు కావడంతో క్యాబిన్లన్నీ సందడిగా ఉన్నాయి. ప్రతి ఒక్కరిలో తెలియని ఉత్సాహం. ఏదో పార్టీ కోసమో, వీడ్కోలు కోసమో ఎదురుచూస్తున్నట్లు ఉత్సుకత. తన ఆఫీసు క్యాబిన్లలో ఇలాంటి సందడి కొత్తేమీ కాదు. పండుగలనో, పుట్టినరోజులనో…నెలలో నాలుగు రోజులు ఇలాంటి హడావిడి ఉంటుంది. కాకపోతే ప్రసాదే వీటికి కాస్త దూరంగా ఉంటాడు. ఆ మాటల ఒరవడిలో తట్టుకుని నిలబడం అతనికి చేతకాదు. తనని తాను మార్కెట్‌ చేసుకునే కళ అతనికి ఎందుకనో అబ్బలేదు. కంప్యూటర్‌ని ఆన్‌ చేసి నిస్తేజంగా కూర్చున్న ప్రసాద్‌కి ఎందుకనో ‘బాల్ ఫాల్‌’ ఆట గుర్తుకు వచ్చింది. ఇవాళ ఎలాగూ పెద్దగా పనిలేదు.  ప్యాంటు జేబులోంచి నిదానంగా తన డబ్బా ఫోన్‌ని బయటకు తీశాడు. ఆట ఆడటం మొదలుపెట్టాడు. ఇప్పటివరకూ అడ్డుగోడలుగా తోచిన క్యాబిన్లు ఎందుకో ఇప్పుడు ప్రపంచం నుంచి రక్షణగా తోచాయి!
బాల్ ఫాల్‌ నిదానంగా ప్రసాద్‌ జీవితంలో భాగమైపోయింది. మొదట్లో రెండుమూడు వందల స్కోర్లు/స్కోరు సాధించడమే గగనంగా ఉండేది. కానీ క్రమంగా అవి వేలకి చేరుకున్నాయి. అంతకుముందుకన్నా ఎక్కువ స్కోరు సాధించిన ప్రతిసారీ… ‘మీరో కొత్త రికార్డుని సృష్టించారు. అభినందనలు’ అనే సందేశం అతనికి భలే ఉత్సాహాన్ని ఇచ్చేది. ఆట ఆడే ప్రతిసారీ ఓ కొత్త రికార్డుని సాధించాలని తెగ తపనపడిపోయేవాడు. తన గతంతో తానే పోటీపడేవాడు. మొదట్లో అతని ఖాళీ సమయాలను బాల్‌ ఫాల్ భర్తీ చేసింది. బస్సుల్లో వెళ్లేటప్పుడో, ఆఫీసులో బోర్‌ కొట్టినప్పుడో బాల్‌ ఫాల్‌ బయటకి తీసేవాడు. కానీ రాన్రానూ అది అతని జీవితంలోని ప్రతి పార్శ్వంలోనూ చొచ్చుకుపోయింది. రాత్రిపూట నిద్రపట్టకపోతే భార్యకి కనిపించకుండా అటువైపు తిరిగి ఆడేవాడు. అల్లుడు ఇంటికి వస్తే గదిలో తలుపేసుకుని ఆడేవాడు. భార్య కూతురింటికి వెళ్తే, తీరిక సమయాన్ని బాల్‌ఫాల్‌తో గడిపేసేవాడు. ఆ ఆటలో తను ఎంత నైపుణ్యాన్ని సాధించాడంటే, ఒకోసారి అతని వేగానికి ఆట మధ్యలోనే స్ట్రక్‌ అయిపోయేది. లేదా ఆటలోని రంగురంగుల బంతులు కాస్తా ఒక్కసారిగా గజిబిజి అయిపోయేవి. ఫోన్లో అలాంటి చిన్నచిన్న ఇబ్బందులు వస్తే ‘రెస్టోర్‌ ఫ్యాక్టరీ సెట్టింగ్స్‌’ నొక్కమని ఎవరో చెప్పినట్లు గుర్తు. అందుకే ఆ పిచ్చి పని చేశాడు. దాంతో తన రికార్డులన్నీ చెదిరిపోయాయి.
***
          బస్సు తన స్టాప్ దగ్గర ఆగింది. మనిషి ఇంటివైపు నడుస్తున్నాడన్నమాటే కానీ తల తెగ తిరిగిపోతోంది. ఒళ్లంతా వేడెక్కిపోయి ఒకటే సలపరంగా ఉంది. ఇంట్లోకి అడుగుపెడుతుండగానే “ఆదివారం పూట చెప్పా పెట్టకుండా ఎక్కడికి వెళ్లిపోయారు?” సోఫాలోనుంచే ప్రసాద్‌ వాళ్లావిడ అడిగింది.
‘‘ముందా టీవీ కట్టిపారేయ్‌!’’ కోపంగా అరిచాడతను. మనిషిలో ఏదో తెలియని ఉద్రేకం. ఎవరినో ఏదో చేయాలన్న ఉన్మాదం. అతని అరుపుకి నిశ్చేష్టురాలైన భార్య చేతిలోంచి రిమోట్‌ను లాక్కొని ఒక్కసారిగా నేలకేసి కొట్టాడు. ఆపై తూలుకుంటూ వెళ్లి మంచం మీద వాలిపోయాడు. పడుకున్నాడన్నమాటే కానీ ఒకటే కలలు! కలల నిండా రంగురంగుల బంతులు. కొన్ని మందుబాటిళ్ల మీద పడుతున్నాయి. కొన్ని టీవీలోంచి దూసుకువస్తున్నాయి. మరికొన్ని తన క్యాబిన్లో దొర్లాడుతున్నాయి. ప్రతి కలలోనూ బంతులే…సందర్భమే మారుతోంది. ఒకోసారి మనుషుల మొహాలు కూడా బంతుల్లా మారిపోతున్నాయి. వారి శరీరాలు బంతుల్లా ఊరిపోయి దొర్లిపోతున్నాయి.
బంతులు…బంతులు…ఆ బంతుల్లో తను తలమునకలై ఉంటే, ఎవరో తనని తట్టి లేపుతున్నట్లు తోచింది. కళ్లు తెరిచి చూశాడు.  ఎదురుగా ఉన్న భార్యను పోల్చుకునేందుకు కూడా కాస్త సమయం పట్టింది. ఆమె కళ్లల్లో కన్నీళ్లు. ఏదో మాట్లాడుతోంది.  కానీ అవేవీ వినిపించడం లేదు. పైపెచ్చు ఆమె చీర మీద కూడా బంతులు జీరాడుతున్నట్లు తోచి అయోమయంగా వాటి వంక చూడసాగాడు. బంతులు…రంగు బంతులు తన కళ్లని నింపేస్తున్నాయి. నేల మీద ఎగిరెగిరిపడుతున్నాయి. ఫ్యాన్‌ నుంచి రాలి పడుతున్నాయి. అన్ని బంతులని చూసి ప్రసాద్‌కి తల పగిలిపోతోంది. వగరుస్తూ మంచానికి ఓ మూలగా చేరి పడుకుండిపోయాడు. బంతుల నుంచి తప్పించుకునేందుకా అన్నట్లు కాళ్లని పొట్ట లోపలికంటూ ముడుచుకుని పడుకుండిపోయాడు.
మర్నాడు ఉదయానికల్లా కూతురూ అల్లుడూ వచ్చేసినట్లున్నారు. తను కళ్లు తెరిచి చూసేసరికి కూతురు, భార్య ఆందోళనగా మాట్లాడుకుంటున్నారు. అల్లుడి గంభీరత్వం మాత్రం ఎప్పటిలానే ఉంది.  ప్రసాద్‌కి చచ్చేంత నీరసంగా ఉంది. బయటకి మూలుగుతున్నాడేమో కూడా తెలియదు. కళ్ల ముందు బంతులు లేకపోయినా, వాటి తాలూకు రంగులు మాత్రం ఇంకా నిలిచే ఉన్నాయి. కనిపించే దృశ్యాలను అవి అస్పష్టంగా మార్చేస్తున్నాయి.
“లోకల్‌ డాక్టర్ల వల్ల లాభం లేదండీ. ఏదేదో మాట్లాడుతున్నారని అంటున్నారు కదా! అది జ్వరం వల్లా ఏంటన్నది తేల్చుకోవడం మంచిది,” అంటూ అల్లుడు ఏదేదో చెబుతున్నాడు.
ప్రసాద్‌కి హఠాత్తుగా తన ఫోన్‌ గుర్తుకువచ్చింది. ఓసారి దాన్ని చూసుకోవాలనిపించింది. నిదానంగా ప్యాంటు జేబులోంచి ఫోన్ బయటకి తీశాడు. ఎన్నడూ లేనిది అల్లుడు చనువుగా ముందుకు వచ్చి “ఇప్పుడది ఎందుకు మావయ్యగారూ! రెస్ట్ తీసుకోండి,” అంటూ ఆ ఫోన్‌ తీసుకోబోయాడు. అంతే! అతని చెంప ఛెళ్లుమంది. ఏం జరిగిందో అర్థం కావడానికి ప్రసాద్‌ చుట్టూ ఉన్నవారికి కాస్త సమయం పట్టింది. తనేం చేశాడో ప్రసాద్‌కి కూడా వెంటనే స్ఫురించలేదు. ఆపై వాళ్లనిక చూడలేనట్లు అవతలికి తిరిగి పడుకుండిపోయాడు. వాళ్లావిడ గట్టిగట్టిగా తిడుతోంది. తిట్టుకీ తిట్టుకీ మధ్య కూతురి ఏడుపు వినిపిస్తోంది. ప్రసాద్ కళ్లు గట్టిగా మూసుకున్నాడు. ఇంతలో ‘సర్దుకుపోవడం చేతకాదు’ అంటున్న భార్య మాట మాత్రం స్పష్టంగా వినిపించింది. ‘నిజంగానే తను ప్రపంచంతో సర్దుకుపోలేకపోయాడా, లేక ప్రపంచమే తనని కలుపుకోకుండా ముందుకు సాగిపోతోందా! అదీ ఇదీ కాకపోతే మధ్యేమార్గంగా ఇంకేదన్నా ఉందా!’ అన్న ఆలోచన తట్టింది ప్రసాద్‌కి. ఆలోచన రావడం మొదలు, మళ్లీ రంగురంగుల బంతులు కదలాడసాగాయి.  బంతులతో పాటు ‘రెస్టోర్‌ ఫ్యాక్టరీ సెట్టింగ్స్‌’ అన్న పదం అస్పష్టంగా కనిపించింది. తలలో ఏదో వరద పోటెత్తిన భావన. భళ్లున వాంతి చేసుకున్నాడు. కంటి ముందు ఇక బంతులు కనిపించడం మానేశాయి. తల పక్కకి వాలిపోయింది.
**** (*) ****

8, నవంబర్ 2017, బుధవారం