12, జులై 2022, మంగళవారం

నా 28వ కథ… ఓ రచయిత డైలమా!


సూరిబాబు సిక్‌ లీవ్‌ పెట్టి వారం రోజులు గడిచిపోయాయి. ఎప్పటి నుంచో తనకి కవి కావాలని ఆశ. ఎన్ని పుస్తకాలు చదివినా, ఎన్ని వ్యాసాలు ఔపోసన పట్టినా… ఆ లోటు ఉండిపోయింది. గుమాస్తా ఉద్యోగంతో కడుపు నిండుతున్నా… బతుకు తృప్తి లేకపోయింది. అందుకనే వారం రోజులు సెలవు పెట్టి మరీ, మనసులో రొద చేస్తున్న భావాలన్నింటినీ అక్షరాలుగా రాశి పోశాడు. వాటిలో కాస్త లయబద్ధంగా ఉన్న వాక్యాలు కవితలయ్యాయి, అంత ఓపిక లేనివి కథగా మారాయి. మొత్తానికి పేజీలు నిండాయి. మనసులో భారం కాస్త తగ్గింది. రేపు తనకి ఏదన్నా జరిగినా జీవితం మరీ వృధా అయిపోలేదన్న పిసరంత నమ్మకం వచ్చింది.

ఇవాల్టితో సెలవు ఆఖరు. రాసీరాసీ అలసిన మనసుకి కాస్త చల్లగాలి తగిలితే బాగుండు అనిపించింది. అందుకే సాయంవేళ షికారుకి బయల్దేరాడు. ఇంటి నుంచి ఖాళీ స్థలాలు ఉన్న ఒంటరి బాట పట్టాడు. నాలుగడులు వేశాడో లేదో…

‘ఏం సూరిబాబూ! ఏంటి సంగతి’ అంటూ గదమాయింపు వినబడింది. తనతో అంత చనువు ఎవరికీ లేదు కదా అనుకుంటూ చుట్టూ చూశాడు. ఓ గులాబీని చూసేసరికి ఎందుకో అనుమానం వచ్చింది.

‘అవును నేనే మాట్లాడుతున్నా! ఏంటి సంగతి’ అని మళ్లీ గదమాయించింది గులాబీ.

‘ఏంటి సంగతి!’ అని ఎదురు అడిగాడు సూరిబాబు.

‘సిగ్గు లేకుండా మళ్లీ ఎదురు ప్రశ్నిస్తున్నావా. అసలు నీకు మనస్సాక్షి అనేదే లేదా’ కోపంతో గులాబీ మరింత ఎర్రబడింది. దగ్గరికి వెళ్తే ముల్లతో పొడిచేట్టుంది.

సూరిబాబు నోట మాటరాలేదు.

‘నువ్వేదో కవిత్వం రాస్తున్నావు కదా అని సంబరపడ్డాను. తీరా చూస్తే ఏదో భయం, గుబులు అంటూ ఊదరగొట్టావు అంతేకానీ పూబాలల తల ఊపుల గురించి, నునులేత ఆకుల మీద నుంచి జారే మంచుబిందువుల గురించి రాయలేదేం? కనీసం నా గులాబీ పరిమళాలను కూడా పట్టించుకోలేదు. పోనీ గడ్డిపూవులోని అమాయకపు అందం గురించైనా రాయాలి కదా! ప్రకృతి పలవరింతలేని కవిత్వమూ ఓ కవిత్వమేనా?’ అంటూ వాయించేసింది.

సూరిబాబుకు ఏం మాట్లాడాలో పాలు పోలేదు. గులాబీ ఇంకా కేకలేస్తూనే ఉన్నా, ఆ కేకలు కాస్తా తిట్లుగా మారినా… మొహం ఎర్రగా చేసుకుని పక్కనుంచి జారుకున్నాడు.

‘బహశా ఇదంతా భ్రమే అయి ఉంటుంది. లేకపోతే గులాబీ మాట్లాడటం ఏంటి? నా నాన్‌ సెన్స్‌’ అనుకున్నాడు సూరిబాబు. క్రమంగా ఆ తిట్ల నుంచి కోలుకుని, అడుగు ముందుకేశాడు. చల్లగాలి తగులుతోంది. గుండెవేగం కాస్త నిదానించింది. అడుగులు అసంకల్పితంగా ముందుకు పడుతున్నాయి. ఇంతలో…

‘రేయ్‌ సూరిబాబూ!’ అంటూ ఇంకో పిలుపు.

చెట్ల వంక చూశాడు. అనుమానం కలగలేదు. మబ్బులతో సహా ఎన్ని దిక్కులు చూస్తున్నా గొంతు ఎక్కడిదో తట్టలేదు. ఇంతలో ‘ఓయ్‌ సూరిబాబూ నిన్నే!’ అంటూ ఓ క్యారీబ్యాగ్‌  నుంచి మాట వినిపించింది. సగం నేలలో కూలబడి, మిగతా సగం గాలిలో ఎగురుతూ శాపగ్రస్తురాలిలా ఉన్న క్యారీబ్యాగ్‌ మాటలు మొదలుపెట్టింది.

‘నీ దుంపతెగ. నీ కంటి ముందు ఎంత వినాశనం జరుగుతోందో చూశావా. నేను ఈ నేలలో కలవడానికి ఎన్ని వందల ఏళ్లు పడుతుందో తెలుసా! భూగోళం మండిపోతోంది. గాలి ఉడికిపోతోంది. ఇదంతా నీకు పట్టిందా. ఏదో గుబులంటావు, భయం అంటావు కానీ నీ ఇంటి బయటి భాగోతం గురించి రాయలేకపోయావే! కాలుష్యం గురించి రాయకపోతే మానే. కనీసం అవినీతి గురించీ, అన్యాయాలకీ వ్యతిరేకంగా నీ కలం ధిక్కార స్వరం కావాలి కదా. సమాజం కోసం రాయని నీ కలం పూచికపుల్లతో సమానం సూరిబాబోయ్‌’ అని వాయించేసింది క్యారీబ్యాగ్‌. ఆ మాటలు పూర్తయ్యేసరికి దుమ్ముకొట్టుకుపోయిన ప్లాస్టిక్‌ కవర్‌ లా మారిపోయింద సూరిబాబు మనసు.

సిగ్గుతో చివుకుపోయిన మొహంతో ముందుకు కదిలాడు. ‘అంతా భ్రమే’ అంటూ తారకమంత్రంలాగా పదేపదే సర్దిచెప్పుకుంటూ ముందుకు సాగాడు. ఎదురుగా తను చదువుకున్న కాలేజీ కనిపించింది. విశాలమైన కాలేజీ, చుట్టూ వేల చేతులను తడిమిన గోడలు.

‘ఏం సూరిబాబూ మొత్తానికి కవి అయ్యావుగా!’ అంటూ వినిపించింది.

అనుమానం లేదు. ఇప్పుడు కాలేజే మాట్లాడుతోంది. తనకు చదువు చెప్పిన కాలేజీ గుర్తుంచుకుని పలకరిస్తోంది. అందుకని ఒకింత గర్వంగా తలెత్తి చూశాడు.

‘నువ్వు కాలేజీ గోడల మీద బొగ్గుతో పిచ్చి రాతలు రాసినప్పుడే ఇలాంటి పేదో చేస్తావని అనుకున్నా. కానీ ఇలా పరువు తీస్తావనుకోలేదు’ కోపంగా కసిరింది కాలేజి శిఖరం.

‘నేనేం తప్పు చేశాను’ ఉక్రోషంగా అడిగాడు సూరిబాబు.

‘ఇంకా అడుగుతున్నావా! అసలు ఆ వాక్యాలేంటి. ఆ పదప్రయోగాలేంటి. మధ్యమధ్యలో బడు లాంటి శబ్దాలేంటి. భాష అంటే కొంచెమన్నా భయంభక్తీ ఉన్నాయా…’ అంటూ లెక్చర్ దంచింది.

కాలేజ్‌ బెల్‌ మోగాక పరుగుతీసే కుర్రాడిలా అక్కడి నుంచి జారుకున్నాడు సూరిబాబు. కాస్త దూరంలో పాలకేంద్రం కనిపించింది.

ఎలాగూ ఇక్కడిదాకా వచ్చాను కదా… ఓ పాల ప్యాకెట్‌ పట్టుకుపోదాం అనుకుని కౌంటర్‌ ముందు నిలబడ్డాడు. ఏదో అనుమానం. ఎవరో తనని తీక్షణంగా చూస్తున్న అయోమయం. నిజమే. పక్కనే కొట్టంలోంచి గేదె తనని అదేపనిగా చూస్తోంది. ‘ఇంత బతుకూ బతికి దీని చేతిలో కూడా తిట్లు తినాలా’ అనుకుంటూ పక్కకి ఒరిగి నిలబడ్డాడు. అయినా దాని గొణుగుడు వినిపించకపోలేదు.

‘ఏదో గుమాస్తా ఉద్యోగం చేస్తున్నావు. మూడు పూటలకి సరిపడా నాలుగురాళ్లు పోగేస్తున్నావులే అనుకున్నా. ఈ రాతలేంటి సూరిబాబూ. నీ కవిత్వాన్ని కౌంటర్‌లో పెడితే పాలచుక్క కూడా రాదు. పాలవాడూ, పేపర్‌ వాడూ నీ క్రియేటివిటీ చూసి అరువిస్తారా. పిల్లల బాధ్యత చూసుకోవడానికి నీ రాతలేమన్నా దస్తావేజులా? ఏం తమాషాగా ఉందా! నాకున్న బాధ్యత కూడా నీకు లేదా!’ అంటూ తోకని కొరడాగా మార్చి ఒక్కటి జాడించింది.

ఆ దెబ్బకి అవమానపడి, తన మీద తనకే అసహ్యం వేసి ముందుకు కదిలాడు సూరిబాబు. తెలియకుండానే రైలు పట్టాల దగ్గరకు చేరుకున్నాడు. వాటిని చూసేసరికి ఎందుకో దుఃఖం ముంచుకొచ్చింది. చిన్నప్పటి నుంచీ తను పడ్డ కష్టాలు, మధ్యమధ్యలో రచయితగా నిలదొక్కుకోవడానికి చేసిన ప్రయత్నాలు… అన్నీ గుర్తుకొచ్చాయి. కన్నీటి చారతో పట్టాలు అస్పష్టంగా కనిపించాయి.

‘రేయ్‌ వెనక్కి పోరా నాయనా’ అంటూ కసిరాయి రైలు పట్టాలు. ‘అసలే పాసింజర్ బండి వచ్చే టైమైంది. పొరపాటున ఇక్కడ ఏమన్నా జరిగితే నాకు లేనిపోని అపనింద. నీ రాతలు కనీసం బతికే ధైర్యాన్ని కూడా ఇవ్వలేదని చుట్టుపక్కల జనం అంతా ఈసడించుకుంటారు. ఓ చిన్న బాక్స్‌ ఐటమ్‌ తో నీ బతుకు ముగిసిపోతుంది. ఆ తర్వాత నీ మీద ఆధారపడినవాళ్లంతా ఏడవాల్సిందే. ఇప్పుడీ హడావుడి అవసరమా. పోరా నాయనా’ అంటూ కూతపెట్టాయి.

సూరిబాబు మనసు బొగ్గునిప్పులా భగ్గుమని వెలిగి చల్లారిపోయింది. చకచకా ఇంటి ముఖం పట్టాడు. దారిలో పాలకేంద్రం, కాలేజీ శిఖరం, క్యారీబ్యాగులూ, పచ్చని మొక్కలూ వినిపిస్తున్న రొదకు పిచ్చెత్తిపోతూ పరుగుపరుగున తన ఇంటి ముందుకు చేరుకున్నాడు.

‘అలా రా దారికి!’ అంది ఇంటిగుమ్మం. ‘బుద్ధిగా ఆఫీస్‌ ఫైళ్లని నమ్ముకో. మిగతా పుస్తకాలన్నీ కాటాకి వేసేయ్‌. పొద్దున్నే తలదువ్వుకుని బస్సులో కూర్చో. సాయంత్రం ఇంటికి వచ్చేటప్పుడు పకోడీలు తెచ్చుకో. మరీ రచయితగా గుర్తింపు కావాలంటే కోటరీ పెంచుకో. కానీ రాతల అవసరమే లేదబ్బా! అలా కాకుండా నీ మానాన నువ్వు రాసుకుంటూ పోతే… అందరి మధ్యా అనాథవైపోతావ్‌. రేపటి నుంచి ఆఫీసుకు వెళ్దూగాని. త్వరగా తినేసి పడుకో!’ అంటూ లోపలికి ఆహ్వానించింది.

సూరిబాబు నీరసించిపోయాడు. ఆఫీసర్ల తిట్లూ, అప్పులవాళ్ల ఫోన్లు, పక్కింటి వాళ్లతో గొడవలూ… వీటన్నింటికంటే నిజమో కాదో తెలియని ఇప్పటి మాటలకు డీలాపడిపోయాడు. ఆ రాత్రి ఎంతలా దొర్లినా నిద్రపట్టలేదు. ఉదయం అలారం మోగక ముందే లేచి దాన్ని ఆపేశాడు. ‘దయచేసి ఇంకో వారం సిక్‌ లీవ్‌ మంజూరు చేయగలరు. ఆరోగ్యం ఇంకో కుదుటపడలేదు’ అంటూ ఆఫీసరుకు మెసేజ్‌ చేసి పుస్తకమూ, పెన్నూ చేతిలోకి తీసుకున్నాడు. ఈసారి తను ఇంకా ఏమేం వినాల్సి వస్తుందో!




 

నా 27వ కథ… ఊర్మిళ సిండ్రోమ్

 

శూన్యం… దాన్ని గమనిస్తున్నవాడికి కూడా తనది బతుకో కాదో తెలియనంతంగా కమ్ముకున్న నిశబ్దం. ఇంతలో… అకస్మాత్తుగా మెలకువ వచ్చింది. కళ్లు, వెలుతురుకు అలవాటుపడుతూనే, చుట్టూ ఉన్న వస్తువులను గుర్తుపట్టడం మొదలుపెట్టాయి. తను మంచం మీద ఉన్నాడు. పక్కనే మానిటర్లు కనిపిస్తున్నాయి. మెలకువ రాగానే అవన్నీ ఒక్కసారిగా బీప్‌బీప్‌ మంటూ పిచుకల్లాగా అరవడం మొదలుపెట్టాయి. ఆ వెంటనే ఓ నలుగరు నర్సులు… ఇద్దరు డాక్టర్లు పరుగెత్తుకుంటూ వస్తారని ఎదురు చూశాడు. ఒకప్పుడు తను సినిమాల్లో చూసింది అలాంటి సన్నివేశాలే కదా! కానీ… అందుకు విరుద్ధంగా ఓ కుర్ర డాక్టరు యథాలాపంగా లోపలికి వచ్చాడు. మానిటర్‌ వంక తాపీగా చూసి… మంచానికి తగిలించి ఉన్న కేస్‌షీట్‌లో ఏదో రాసుకుంటూ ఉండిపోయాడు. కాసేపటికి నడుముకి ఉన్న వాకీటాకీని తీసి… ‘పేషెంట్‌ రెడీ ఫర్‌ డెలివరీ’ అని ఎవరికో చెప్పాడు.

అంతా అయోమయంగా ఉంది. తను ఫలానా పేరు ఉన్న మనిషిని అన్న స్పృహ వచ్చింది. తన ఉద్యోగ బాధ్యతలు, భార్య రూపం అన్నీ ఒక్కసారిగా స్ఫురించాయి. కానీ వేళ్ల దగ్గర నరికేసిన చెట్టులా… తను ఇక్కడికి రాక ముందు జరిగిన సంగతులేవీ గుర్తుకురావడం లేదు. ఈ అయోమయం మధ్య డాక్టరు తీరు ఒకటి! చాలా రోజుల తర్వాత కనిపించిన వెలుతురుకంటే ఈ డాక్టర్‌ ప్రవర్తనే గమ్మత్తుగా ఉంది. అయినా ఉండబట్టలేక ‘నాకేం అయింది’ అంటూ బలవంతంగా ఓ రెండు ముక్కలు అడిగాడు.

‘మీరు ఊర్మిళ సిండ్రోమ్‌ బారిన పడ్డారు. దాని బారిన పడ్డ వాళ్లు, నాలుగేళ్ల నుంచి ఏడేళ్ల వరకు కోమాలోకి వెళ్లిపోతారు. స్పృహలోకి వచ్చాక మళ్లీ మామూలు మనిషి కావడానికి ఇంకొన్ని రోజులు పడుతుంది. అంతవరకు మిమ్మల్ని చూసుకునే వెసులుబాటు మాకు లేదు. వేరే పేషెంట్లు ట్రీట్‌మెంట్‌ కోసం సిద్ధంగా ఉన్నారు. మీరిక ఇంటికి వెళ్లక తప్పదు’ అంటూ తరుచుగా చెప్పే పాఠాన్ని వల్లించేశాడు కుర్ర డాక్టరు. ఈలోగా ఓ వీల్‌చైర్‌ తోసుకుంటూ కొంతమంది వచ్చేశారు. తనను అందులో కూర్చోబెట్టి, ఓ వ్యాన్‌లోకి ఎక్కించేచారు. అందులో తనలానే ఇంకో పదిమంది ఉన్నారు. తెల్లటి బట్టలు, అంతే తెల్లగా పాలిపోయిన మొహాలు…. పాత శరీరంతో కొత్త లోకంలోకి వస్తున్న అయోమయం!

వ్యాన్ ఓ పదినిమిషాలు నడిచాక… టైర్ల కింద గతుకులు మొదలయ్యాయి. వాటిని తట్టుకునేందుకు పళ్లు బిగపెడుతున్న అతనికి ఏదో స్ఫురించింది. తన ఇల్లు దగ్గరకు వచ్చిన్నట్టుంది. అది ఇంటికి వెళ్లే దారిలాగానే ఉంది. హైవే నుంచి రెండు కిలోమీటర్ల లోపలకి ఉంటుంది తన ఇల్లు. ఏరికోరి కొనుక్కున్నాడు. కానీ ఎంతకీ రోడ్డు పడలేదు. ‘రోడ్డు రోడ్డూ ఎందుకు పడవు’ అంటే ఏడేడు లోకాల్లో ఉన్న సాంకేతిక కారణాలన్నీ వినిపించేవి. చివరికి ఆరేళ్ల తర్వాత… ఓ ఎలక్షన్ల సందర్భంగా రోడ్డు పడింది. మొదటి రోజు ఆ కొత్త రోడ్డు మీద ప్రయాణం చేస్తున్నప్పుడు ఎంత సంతోషం కలిగిందో! ‘ఈ బతుక్కి ఇంతకంటే ఏం కావాలి!’ అన్నంత తృప్తిగా తోచింది. కానీ ఓ నెలరోజుల్లోనే తలా ఓ రంగు కేబుళ్ల కోసం… తలా ఓ డిపార్టుమెంటు తవ్విపారేసింది. మళ్లీ కంకర తేలింది.

‘మీ ఇల్లు వచ్చింది’ అంటూ ఎవరో భుజాన్ని ముందుకు తోశారు. వ్యాన్‌ తలుపులు తెరుచుకున్నాయి. బేడీలు లేని ఖైదీలాగా అందులోంచి కాలు కింద పెట్టాడు. రోడ్డు మారలేదు. కానీ వీధిలో ఇళ్లు అన్నీ మారిపోయాయి. చాలావాటికి కిటికీలు లేవు. ఉన్న కిటికీలను కూడా తెరవడానికి వీల్లేకుండా, అడ్డంగా చెక్కలు కొట్టేశారు. ప్రతి ఇంటి పైనా… ఓ పొగగొట్టం మాత్రం కనిపిస్తోంది. ఎదురుగా ఉన్న తన ఇంటికీ అలాంటి మార్పే.

తన ఇంటివైపు ఒకో అడుగే నిదానంగా, బలహీనంగా అడుగులు వేస్తుండగా ‘తొందరగా రండి’ అంటూ తలుపు దగ్గర నుంచి అరుపు వినిపించింది. ఆ పిలుస్తున్న మనిషి, తన భార్యే అని పోల్చుకోవడానికి మెదడు తడబడింది. ఓ నాలుగేళ్లలోనే మనిషి ఎంతలా మారిపోయింది. వేరే తరంలోకి అడుగుపెట్టినంతగా వయసు పైబడిపోయింది. అన్నింటికీ మించి తను తిరిగి వచ్చాడన్న సంతోషం లేశమైనా లేదు. పైగా ఏదో కలవరం!

భార్యను దాటుకుని ఇంట్లోకి అడుగుపెడుతుంటే… అది తన ఇల్లే అని శరీరంలో అణువణువునా పేరుకుపోయిన అలవాటు చెబుతోంది. కానీ ఎందుకో నమ్మబుద్ధి కావడం లేదు. గోడలు పొగచూరుకుపోయి ఉన్నాయి. వాటి మీద ఒక్క ఫొటో కూడా లేదు. ఎదురుగుండా ఉన్న తన పుస్తకాల బీరువా ఖాళీగా ఉంది. దశాబ్దాల తరబడి తనకి ఇష్టమై.. ఒక్కొక్కటిగా సేకరించిన వందల పుస్తకాల్లో ఏదీ అక్కడ లేదు.

‘లోపలికి వెళ్లి స్నానం చేసి రండి’ అంటూ టవల్‌ చేతిలో పెట్టింది భార్య. యాంత్రికంగా తనకు తెలిసిన దోవ వైపు నడిచాడు. బీరువాలో తన బట్టలు అలాగే ఉన్నాయి. అద్దంలో తన రూపమూ పెద్దగా మారలేదు. ఆ రెండూ చూసుకుని డైనింగ్‌ టేబుల్‌ ముందు కూలబడ్డాడు. టీ కప్పుతో వచ్చిన భార్యను చూసి కోపం, జాలి ఒకేసారి కలిగాయి. పరామర్శగా ఒక్క మాట కూడా అనదేం? అయినా ఈ మనిషేమిటి ఇంతలా మారిపోయింది! చివరికి ఇక తనే ఏదో మాట్లాడాలని నిశ్చయించుకున్నాడు.

‘గోడలేంటి అలా మసిబారిపోయి ఉన్నాయి. ఇంటింటికీ ఆ గొట్టాలెందుకు’ అంటూ సంభాషణ మొదలుపెట్టాడు.

‘పొల్యూషన్‌. బయట పొల్యూషన్‌ ఎక్కువైపోయింది. దాంతో గోడలన్నీ పొగచూరిపోయాయి. కిటికీలు తీసినా ప్రమాదమే. ఇప్పటికే అందరి ఊపిరీ ఆ కాలుష్యంతో నిండిపోయింది’ వంటింట్లో పని చేస్తూనే చెప్పుకొచ్చింది. భార్య. ఎందుకో ఆమె గొంతు కూడా బాగా పాడైపోయింది. ఎవరన్నా వింటారేమో, ఏమన్నా అంటారేమో అన్నట్టు… సన్నగా వణుకుతూ మాట్లాడుతోంది.

‘మరి పుస్తకాలు! నాకు ఊహ తెలిసినప్పటి నుంచి పోగేసుకుంటూ వచ్చిన పుస్తకాలవి. వాటిని ఎక్కడ పెట్టారు’ కాస్త కటువుగానే అడిగాడు.

‘అదేంటీ మీకు గుర్తులేదా!’ వంటింట్లోంచి ఆశ్చర్యంగా తొంగిచూస్తూ అడిగింది. ఆపై గుర్తుచేస్తున్నట్టు ‘మీరే వాటిని… మీ చేతులతో కుప్పపోసి తగటబెట్టేశారు’ అని చెప్పుకొచ్చింది.

అతనికి నోట మాట రాలేదు. ‘అసంభవం! అవంటే నాకు ప్రాణం. వాటినెందుకు తగలబెట్టుకుంటాను. నాకేమన్నా పిచ్చా!’ బలహీనతతో, రోషంతో ఒళ్లంతా చెమటలు పడుతుండగా అడిగాడు.

‘మీకు పుస్తకాలంటే ప్రాణమే. మొదట్లో అందరూ ఎగతాళి చేసేవాళ్లు. పుస్తకాలు కూడు పెడతాయా, కొనుక్కుని ఎవరన్నా పుస్తకాలు చదువుతారా… అంటూ రకరకాలుగా అనేవాళ్లు. కానీ ఎందుకో రోజురోజుకీ, మాటలకు మించిన అసహనం మొదలైంది. భక్తి పుస్తకం కనిపిస్తే కొంతమందికి నచ్చేది కాదు. హేతువాదం కనిపిస్తే కొందరు సహించేవాళ్లు కాదు. ప్రతి పుస్తకం ఎవరో ఒకరిలో ద్వేషం కలిగించేది. మిమ్మల్ని నానా మాటలూ అనేవాళ్లు. చివరికి మీరు విసిగిపోయారు. వాటిని ఎవరికైనా ఇచ్చేయాలనుకున్నారు. కానీ ఎవరూ ముందుకు రాలేదు. పాతపేపర్ల వాడు కూడా పుస్తకాలని ముట్టుకునేందుకు భయపడ్డాడు. చివరికి ఓ రోజు కుప్పగా పోసి కాల్చేశారు’ చెప్పుకొచ్చింది.

అతనిలో ఏదో జుగుప్స మొదలైంది. అది తనమీదో, మరొకరి మీదో తెలియలేదు. బీరువా వంక చూస్తూ ఉండిపోయాడు. అక్కడ ఖాళీ అయిన బరువు తన మనసులోకి చేరినట్టుగా ఊపిరి భారమైంది. ఈలోగా భార్య లోపలి నుంచి ఒక రంగురంగుల గౌన్ తీసుకువచ్చింది.

‘మీరు ఊర్మిళా సిండ్రోమ్‌ నుంచి బయటపడ్డారు కాబట్టి, ప్రభుత్వం నుంచి వస్తున్న ఊర్మిళా పెన్షన్‌ ఇక రాదు. రేపు మీ పాత ఆఫీసుకు వెళ్లి రిపోర్టు చేయాల్సిందే. మీ మానసిక స్థితి సరిగ్గా ఉందనిపిస్తే ఉద్యోగంలో చేర్చుకుంటారు. లేకపోతే లేదు. అదే కనుక జరిగితే కొత్త ఉద్యోగం వెతుక్కోవాలిక. సిండ్రోమ్‌ నుంచి బయటపడిన వాళ్లకి అంత తేలికగా ఉద్యోగాలు దొరకవు’ చివరి వాక్యాలకి వచ్చేసరికి ఆమె గొంతు మరింతగా వణికింది. ఆమె చేతిలో ఉన్న రంగురంగుల గౌన్‌ వంకే చూస్తుండిపోయాడు.

‘తెలుపు, నీలం, ఆకుపచ్చ, కాషాయం… మీరు ఏ రంగు బట్టలు వేసుకున్నా… ఏదో ఒక వర్గానికి అనుకూలంగా భావిస్తారు. అందుకే అన్ని రంగులూ కలిపి ఈ గౌన్‌ కుట్టి ఉంచాను. రేపు దీన్ని వేసుకుని వెళ్లండి.’ అంటూ ఓసారి ఆ గౌన్‌ను అతని కళ్ల ముందు ఆడించి, లోపలికి తీసుకువెళ్లిపోయింది. ఆమె వెళ్లినవైపే చేస్తుండిపోయాడు. ఇంతలో ఒక్కసారిగా తన కూతురు గుర్తుకువచ్చింది. అప్పటివరకూ ఆమె గురించి అడగలేదనే గిల్టీనెస్‌తో ఒక్కసారిగా గొంతుక పెంచి ‘అవునూ అమ్మాయి కనిపించడం లేదు. ఎక్కడికి వెళ్లింది. ఎలా ఉంది. ఏం చేస్తోంది…’ అంటూ హడావుడిగా ప్రశ్నలు గుప్పించాడు.

‘అది టీచర్‌గా పనిచేస్తోంది. ఇంకో గంటలో వచ్చేస్తుంది!’ అని ముక్తసరిగా బదులిచ్చింది భార్య.

అప్పుడే పిల్ల చదువు పూర్తయిపోయిందన్నమాట. సంతోషమే. ఉద్యోగం కూడా చేస్తోంది. మరీ మంచిది. ఈ హడావుడి సద్దుమణిగాక తన పెళ్లి గురించి ఆలోచించాలి… అనుకుంటూనే మరోసారి ఇల్లంతా కలియచూశాడు. గోడలు పొగచూరిపోయి ఉన్నాయి. కాలమేదో పిచ్చి గీతలు గీసినట్టు కొన్ని చోట్ల చెమ్మతో వింత ఆకారాలు ఏర్పడ్డాయి. తన ఒంట్లో నుంచే వస్తున్నంత ఘాటుగా ముక్క వాసన. ఆ ఇల్లు వదిలి దూరంగా పారిపోవాలన్నంత ఉద్విగ్నత కలుగుతోంది. కొత్త కదా! ఆ వాతావరణం నిదానంగా అలవాటు అవుతుందేమో. ఆ ఇంటిని, తనతో ముడిపెట్టుకుంటూ నిదానంగా మగతలోకి జారిపోయాడు. డైనింగ్‌ టేబుల్‌ మీదే ఒరిగిపోయాడు.

***

ఏవో గుసగుసలు వినిపిస్తున్నాయి. మొదట్లో అవి కలలోనేమో అనుకున్నాడు. బయటనుంచే అనే మెలకువ రావడంతో… మత్తుగా లేచి చూశాడు. ఎదురుగుండా ఓ పాతికేళ్ల అమ్మాయి. భార్యతో ఏదో మాట్లాడుతోంది. అతనిలో వచ్చిన కదలికను గమనించిన భార్య ‘ఇదిగో అమ్మాయి వచ్చింది’ అంటూ తండ్రికి కూతురును పరిచయం చేసింది. అతన్ని చూసిన కూతురులో ఎలాంటి సంతోషమూ కనిపించలేదు. ఆ మాటకి వస్తే అసలు ఏ భావమూ లేదు. మరీ విచిత్రం… ఆమె కళ్లు గాజుగోలీల్లాగా నిశ్చలంగా ఉన్నాయి. తను ఎటన్నా చూడాలంటే తల మొత్తం కదులుతోంది.

ఒకప్పుడు ఆ అమ్మాయి ఎలా ఉండేది! నవ్వుతూ, తుళ్లుతూ, ఏడిపిస్తూ… కొమ్మ నుంచి కొమ్మకు గెంతే పాలపిట్టలా ఉండేది. అలాంటి తనకి ఏమైంది. ఎందుకో ఆ పిల్లని చూస్తే అతనికి భయం వేసింది. శరీరభాగాలన్నీ కలిపి కుట్టిన ఫ్రాంకన్‌స్టైన్‌ పాత్ర గుర్తుకువచ్చింది. ఆమె తనను దాటుకుని లోపలికి వెళ్తుంటే, అప్రయత్నంగా వెనక్కి జరిగి, కుర్చీలో మరింతగా ఒదిగిపోయాడు.

కిటికీ అద్దాలలోంచి, వంటింటి పొగగొట్టంలోంచి వస్తున్న వెలుగు తగ్గిపోయి… చీకటి పడిన సూచన వచ్చింది. ఆ మసకలో ఇల్లు మరింత పాడుబడినట్టు కనిపించింది. తన కలల సౌధం, రోజూ అలసిన రెక్కలను సేదతీర్చుకునేందుకు ఏర్పరుచుకున్న గూడు… తగలబెట్టేసిన పుస్తకాల్లాగే మసిబారిపోయి ఉంది.

‘చూడండీ… రేపు అమ్మాయి మిమ్మల్ని మీ ఆఫీసుకు తీసుకువెళ్తుంది. జాగ్రత్త. దారిలో తలవంచుకునే ఉండండి. ఎవరితోనూ ఏం మాట్లాడవద్దు. ఎవరిని కదిపినా… లెఫ్ట్‌, రైట్‌… ఏదో ఒకవైపు నడవమని రెచ్చగొడతారు. దేనికీ లోబడకుండా తటస్థంగా ఉంటానంటే కుదరదు. అలాగని మీరు ఏదన్నా ఎంచుకుంటే సమస్య తీరిపోదు. రెండో పక్షానికి శత్రువుగా మారిపోతారు. సూటిపోటి మాటలతో మిమ్మల్ని వేధిస్తారు, అవమానిస్తారు. అందుకనే ఏం మాట్లాడవద్దు. ఆఖరికి మీ చిరునవ్వు, కోపాన్ని బట్టి కూడా మీ అభిప్రాయాన్ని అంచనా వేసే ప్రయత్నం చేస్తారు. గమ్మున ఉండిపోండి’ అంటూ జాగ్రత్తలు చెప్పింది భార్య. అప్పుడు అర్థమైంది కూతురు అలా ఎందుకు మారిపోయిందో! తను నిశ్చలత్వానికి అలవాటు పడిపోయినట్టుంది. రుషులకు స్థితప్రజ్ఞత వస్తుందంటారు. బండబారిపోయినా… అలాంటి స్థితి వస్తుందేమో!

ఇంతలో భార్య ఓ ఫైల్‌ తీసుకుని అతని దగ్గరకు వచ్చింది. ‘రేపు మీరు తీసుకువెళ్లాల్సిన డాక్యుమెంట్స్ ఇవి. ఓసారి చూసుకోండి’ అని దాన్ని అతని చేతిలో పెట్టింది. ఫైల్‌ తెరిచి ఉలిక్కిపడ్డాడు. AP16AW3522. ఆ సర్టిఫికెట్లలో, తన పేరు ఉండాల్సిన స్థానంలో బండి నెంబరు ఉంది. ‘ఏంటిది’ ఏడుపుగొంతుతో అడిగాడు. తన గొంతు కూడా నీరసంగా, వణుకుడుగా మారిపోవడాన్ని అతను గమనించకపోలేదు.

‘మీరు కోమాలో ఉండగా మన పేర్లన్నీ మార్చేసుకున్నాం. ఇలా ఏవో తోచిన నెంబర్లే పేరుగా పెట్టించాం. అప్పుడిక పేరుని బట్టి మీ కులం, ప్రాంతం అంచనా వేసే అవకాశం ఉండదు కదా. ఏ రిస్కూ ఉండదు’ నిదానంగా చెప్పింది భార్య. ఇంతకీ తన పేరు ఏమని మార్చుకుందో! ఆ ఆలోచనకి నవ్వు, ఏడుపు రెండూ ఒకేసారి వచ్చాయి. ఆమె పేరును అడగబుద్ధి కూడా కాలేదు. ఏ ఇంటి నెంబరునో తన పేరుగా మార్చుకుని ఉంటుంది. భార్యాపిల్లల పేర్లు ఇప్పుడు కొత్తగా తెలుసుకోవాలి.

రాత్రి చిక్కబడింది. మసిగోడల మీద నల్లగా ప్రసరిస్తున్న ట్యూబ్‌లైట్‌ వెలుగే దిక్కయింది. జావ తాగి మంచం మీదకు చేరుకున్నాడు. ఎవరో గొంతు నొక్కేస్తున్నట్టుగా, కీచుమని గోలపెడుతూ ఫ్యాన్ తిరుగుతోంది. ‘అన్నట్టు ఇవాళే పేపర్లో చదివాను. ఊర్మిళా సిండ్రోమ్‌ ఎందుకు వస్తోందో కనిపెట్టారట’ మంచం మీద సర్దుకుంటూ చెప్పింది భార్య.

‘ఎందుకో!’ అడిగాడు తను. కానీ ఎక్కడో… ఆ కారణం తనకు ముందే తెలుసు అన్న ఫీలింగ్‌.

‘జీవించాలనే ఆశ పూర్తిగా తగ్గిపోయిన వాళ్లలో ఇది కనిపిస్తోందట. రోజురోజుకీ దాని బారిన పడే వాళ్ల సంఖ్య పెరిగిపోతోందట’ ఆందోళనగా చెప్పుకొచ్చింది భార్య. అయితే తన అంచనా నిజమే!

క్షణాలు గడిచేకొద్దీ నిద్రో, మైకమో తెలియని మత్తు కమ్ముకురావడం మొదలుపెట్టింది. మిగిలిన కాస్త మెలకువలో సంధిప్రేలాపనలా ఓ ప్రశ్న అడిగాడు. ‘అవునూ! మన హాల్లో మేకులన్నీ అలా ఖాళీగా ఉన్నాయే. ఒక్క ఫోటో కూడా లేదు ఎందుకని?’

ఆ ప్రశ్నకు జవాబుగా ముందు ఓ నిట్టూర్పు వినిపిచింది. తర్వాత ఇక తప్పదన్నట్టు ‘ఏ ఫోటో తగిలించమంటారు! నవ్వుతూ ఉన్న పాత ఫోటోలు పెడితే, గతం గుర్తుకువచ్చి బాధ కలుగుతుంది. ఇప్పటి ఫోటోలు తగిలిద్దామంటే… మన మొహాలలో బతికి ఉన్న కళ కొంచెమైనా లేదు కదా! వాటిని గోడకి తగిలించి చూసుకునే ధైర్యం ఎక్కడిది…’

తను ఏదో చెబుతోంది. అతను నిదానంగా మగతలోకి జారుకుంటున్నాడు. మళ్లీ లేవాలన్న ఆశ కూడా లేకపోయింది!

https://magazine.saarangabooks.com/%e0%b0%8a%e0%b0%b0%e0%b1%8d%e0%b0%ae%e0%b0%bf%e0%b0%b3-%e0%b0%b8%e0%b0%bf%e0%b0%82%e0%b0%a1%e0%b1%8d%e0%b0%b0%e0%b1%8b%e0%b0%ae%e0%b1%8d%e2%80%8c/?fbclid=IwAR1yNWbmGMRkvSfzWHYE2SZQNNBhkcLhHZ5I6Ue8tnBcPauTEqIxt9WrF4k

నా 26వ కథ… 50 అంగుళాల జీవితం